Begin typing your search above and press return to search.

డీకే హ్యాపీయేనా ?

By:  Tupaki Desk   |   28 May 2023 2:00 PM GMT
డీకే హ్యాపీయేనా ?
X
తాజాగా కొలువుతీరిన కర్నాటక మంత్రివర్గం ఆశ్చర్యంగానే ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి పదవికి పోటీపడిన పీసీసీ అధ్యక్షుడు, డిప్యూటి సీఎం డీకే శివకుమార్ కు కేటాయించిన శాఖలు ఏమంత ప్రాధాన్యత కలిగినవి కావు. నీటిపారుదల శాఖతో పాటు బెంగుళూరు నగరాభివృద్ధి శాఖలు మాత్రమే కేటాయించారు. పార్టీవర్గాల సమాచారం ప్రకారం డీకే ఆర్ధికశాఖ లేకపోతే హోంశాఖ లాంటి కీలకమైన శాఖలను ఆశించారట. అయితే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాత్రం డీకే ఆశించిన శాఖలను కేటాయించలేదు.

మంత్రివర్గంలో ఎవరున్నా అందరి దృష్టి ప్రధానంగా ఆర్ధిక, ఫైనాన్స్, హోం శాఖల మీదే ఉంటుంది. ఎందుకంటే ఆర్ధికశాఖ అంటే మొత్తం జిల్లాల కలెక్టర్లు మంత్రి అదుపులో ఉంటారు. అలాగే ఫైనాన్స్ శాఖంటే వివిధ శాఖలకు నిధుల కేటాయింపులన్నీ ఫైనాన్స్ శాఖ మంత్రిదగ్గరే ఉంటుంది. ఇక హోంశాఖ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. రాష్ట్రంలో సమస్త పోలీసు యంత్రాంగం మొత్తం హోంశాఖ మంత్రి ఆదీనంలోనే ఉంటారు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే మంత్రులకు ముఖ్యమంత్రి ఫ్రీ హ్యాండిచ్చినపుడు.

ఒకపుడు ముఖ్యమంత్రులు మంత్రివర్గంలోని సహచరులకు పూర్తి స్వేచ్చనిచ్చేవారు. ఇపుడు ఏ ముఖ్యమంత్రి కూడా అలా ఇవ్వటంలేదు. కాకపోతే ముఖ్యమంత్రి పదవికోసం డీకే కూడా సిద్ధరామయ్యతో పోటీపడటంతో పాటు పవర్ ఫుల్ నేత కావటంతో శాఖల నిర్వహణలో పూర్తి స్వేచ్చగా వ్యవహరించే అవకాశముంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే కీలకమైన ఆర్ధిక, హోంశాఖలను కేటాయించినట్లు లేరు. ఇక్కడే డీకే స్పందనపై అందరికీ అనుమానంగా ఉంది.

ఒకవేళ డీకే గనుక తనకు కేటాయించిన శాఖలపై సంతృప్తిగా లేకపోతే తొందరలోనే ఆ విషయం బయటపడటం ఖాయం. బెంగుళూరు నగరాభివృద్ధి శాఖ కీలకమైనదే అయినా నిధుల కేటాయింపు, అజమాయిషీ లాంటివి ఏవీ డీకే చేతుల్లో ఉండదు. అలాగే ఆర్ధిక, ఫైనాన్స్, హోంశాఖలను ముఖ్యమంత్రి ఎవరికి కేటాయిస్తారనే దానిపైన కూడా డీకే రియాక్షన్ ఆధారపడుంటుంది. తనకన్నా జూనియర్లకు, కొత్తవారికి కీలక శాఖలను కేటాయిస్తే డీకే సహించే అవకాశాలు లేవు. సీబీఐ, ఈడీ కేసులు నమోదవ్వటంతోనే ముఖ్యమంత్రి పదవి డీకేని కాదని సిద్ధరామయ్యను వరించిన విషయం తెలిసిందే.