Begin typing your search above and press return to search.

ఉచితాల ఖరీదు ఏడాదికి రు. 50 వేల కోట్లా ?

By:  Tupaki Desk   |   3 Jun 2023 11:00 AM GMT
ఉచితాల ఖరీదు ఏడాదికి రు. 50 వేల కోట్లా ?
X
కర్నాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందుంది మొసళ్ళపండగ. ఎందుకంటే ఈమధ్యనే జరిగిన ఎన్నికల్లో మంచి మెజారిటితో గెలిచిన విషయం తెలిసిందే. గెలుపుకోసం పార్టీ ఏమి కసరత్తు చేసిందో తెలీదు కానీ ఐదు గ్యారెంటీ స్కీముల పేరుతో హామీలిచ్చేసింది. బీజేపీ మీద వ్యతిరేకత, బీజేపీలో అంతర్గత గొడవలు, కాంగ్రెస్ ఇచ్చిన ఉచిత హామీలు అన్నీ కలిసి హస్తంపార్టీని మంచి మెజారిటితో అధికారంలోకి తెచ్చాయి. అయితే ఐదు హామీలను అమలుచేయాలంటే ఏడాదికి రు. 50 వేల కోట్లు ఖర్చవుతుందని లెక్కతేలింది.

జనాలను ఆకర్షించేందుకు ఏపార్టీ అయినా ఇపుడు అవలంభిస్తున్నది ఉచిత హామీలనే. ఏపీ, కర్నాటక, తమిళనాడు, తెలంగాణా ఏ రాష్ట్రమూ దీనికి మినహాయింపు కాదు. ఏ పార్టీ కూడా ఉచితాలను పక్కనపెట్టి అభివృద్ధి మంత్రంతో గెలుస్తామని చెప్పే పరిస్ధితిలేదు. అందుకనే రాష్ట్రాభివృద్ధిని పక్కనపెట్టేసి ముందు అధికారంలోకి వస్తేచాలని అన్నీపార్టీలు ఉచితహామీలపైనే దృష్టిపెట్టాయి. కర్నాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏమిటంటే గృహజ్యోతి పథకం కింద ప్రతి ఇంటికి 200 యూనిట్లవరకు ఉచిత విద్యుత్.

గృహలక్ష్మి పథకంలో ప్రతి మహిళకు నెలకు రు. 2 వేలు, అన్నభాగ్య పథకంలో పేద కుటుంబాలకు నెలకు పదికిలోల బియ్యం, యువనిధి కింద గ్రాడ్యుయేట్ నిరుద్యోగికి నెలకు రు. 3 వేలు, డిప్లొమా హోల్డర్ కు నెలకు రు. 1500 భృతి. శక్తి పథకంలో మహిళలకు జిల్లాల్లో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. ఉచితాల అమలుకు సంబంధించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నాయకత్వంలో ఏడాదికి అయ్యే ఖర్చును ఉన్నతాధికారులు లెక్కలేశారు.

ఈ లెక్కల్లోనే ఏడాదికి రు. 50 వేల కోట్లవుతుందని తేలింది. అంటే ప్రభుత్వంపై ఇపుడున్న ఖర్చుకు అదనంగా రు. 50 వేల కోట్ల భారమన్నమాట. ప్రభుత్వ ఆదాయంలో అత్యధిక భాగం ఉచితపథకాలు, సంక్షేమపథకాలకు ఖర్చయిపోతున్నాయి. ఇక ఉద్యోగుల జీతాలు, పెన్షనర్లకు చెల్లించే పెన్షన్ ఎలాగూ తప్పదు. ఇక అభివృద్ధి కార్యక్రమాల అమలుకు నిధులు ఎక్కడినుండి వస్తాయి ? మరీ ఉచితహామీల ట్రెండ్ ఎంతకాలం కంటిన్యు అవుతాయో అంతకాలం అభివృద్ధిగురించి మరచిపోవాల్సిందే.