నడి రోడ్డు మీద కొట్టుకున్న యూట్యూబ్ స్టార్.. కరాటే కల్యాణి

Fri May 13 2022 09:57:18 GMT+0530 (IST)

Karate Kalyani Prank Srikanth Reddy Fight Video on Street

అనుకోని పరిణామం ఒకటి చోటు చేసుకుంది. గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత హైదరాబాద్ మహానగర రోడ్డు మీద యూట్యూబ్ ఫ్రాంక్ స్టార్ గా పేరున్న శ్రీకాంత్ రెడ్డికి సినీ నటి కరాటే కల్యాణికి మధ్య గొడవ జరిగింది.అది కాస్తా కొట్టుకునే వరకు వెళ్లింది. చివరకు నడి రోడ్డు మీద తిట్టుకుంటూ.. ఇరువురు కొట్టుకోవటం షాకింగ్ గా మారింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకునే క్రమంలో శ్రీకాంత్ రెడ్డి చొక్కా పూర్తిగా చిరిగిపోవటం గమనార్హం.

ఎస్ ఆర్ నగర్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఉదంతంలో ఫ్రాంక్ వీడియోల పేరుతో మహిళలతో శ్రీకాంత్ రెడ్డి అసభ్యకరంగా వ్యవహరిస్తున్నట్లుగా కరాటే కల్యాణి మండిపడ్డారు. శ్రీకాంత్ ఇంటికి వెళ్లిన ఆమె.. చెత్త వీడియోలు తీసి జనాల్ని చెడగొడుతున్నావని కరాటే కల్యాణి తిట్టి పోశారు.

అందుకు స్పందించిన శ్రీకాంత్ రెడ్డి కరాటే కల్యాణిపై ఆవేశంతోనాలుగు మాటలు అనేశారు. ఇలా ఒకరిపై ఒకరు మాటలు రువ్వుకున్న అనంతరం.. ఆ హీట్ పెరిగిపోయి ఇద్దరు కొట్టుకునే వరకు వెళ్లింది. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డిని కరాటే కల్యాణి చితకబాదింది.

ఈ క్రమంలో శ్రీకాంత్ రెడ్డి చొక్కా మొత్తం చిరిగిపోయింది. అనంతరం వీరిద్దరూ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు. ఇరువురి వాదనల్ని వింటున్న పోలీసులు.. తదుపరి చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నారు.

ఏమైనా.. చెత్త వీడియోలు చేస్తున్న శ్రీకాంత్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే బాగుండేదని.. అతడి ఇంటికే నేరుగా వెళ్లి గొడవ పెట్టుకోవటం ఏమిటన్న మాట వినిపిస్తోంది. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.