కరణం దెబ్బకు అధికారుల చేతి చమురు వదిలిందే...!

Thu Nov 25 2021 10:00:02 GMT+0530 (IST)

Karanam Balaram Chirala MLA

ఎవరైనా ఏదైనా కార్యక్రమం పెట్టుకుంటే.. దీనిని ఏర్పాట్లు చేసిన వారు ఖర్చు పెట్టడం ఎక్కడైనా చూశారా?  పోనీ.. విన్నారా? అన్నీ సజావుగా జరిపించే బాధ్యతలు తీసుకున్నవారు ఎక్కడైనా.. చేతి చమురు వదిలించు కోవడం.. ఎక్కడైనా కన్నారా?  లేదు కదా! కానీ.. ప్రకాశం జిల్లాకు వెళ్తే.. ముఖ్యంగా ఇక్కడి చీరాల నియోజకవర్గంలో ఇదే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ ప్రజప్రతినిధిగా ఉన్న కరణం బలరామకృష్ణమూర్తి ఏదైనా కార్యక్రమం చేస్తే.. ఆయన వచ్చి.. ఫొటోలకు ఫోజులిచ్చి.. మీడియాతో మాట్లాడి.. గొప్ప గొప్ప ప్రసంగాలు చేసేసి చేతులు దులుపుకొని.. డోర్ తీసి కారెక్కి వెళ్లిపోతారట. కానీ.. కార్యక్రమానికి చేసిన ఏర్పాట్ల గురించి.. కనీసం పట్టించుకోరట.!  మరి ఇలా.. కార్యక్రమానికి అయిన సొమ్ములు ఎవరు ఇవ్వాలి ? అంటే.. కార్యక్రమాన్ని ఆది నుంచి నిర్విఘ్నంగా జరిపించేలా .. బాధ్యతలు తీసుకుని.. నిద్ర కూడా లేకుండా.. కార్యక్రమాన్ని నిర్వహించేలా చూసిన అధికారులే ఇవ్వాలట..! ఇదేం విచిత్రం అంటారా ?  ఇదే చిత్రం. తాజాగా జరిగిన ఘటనపై నియోజకవర్గం మొత్తం ఇదే చర్చ జరుగుతోంది. గత నెలలో వైఎస్సార్ ఆసరాచెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. చీరాలలోని మండల పరిషత్ ప్రాంగణంలో ఘనంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. దీనికి చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం వచ్చారు. లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఫొటోలకు ఫోజులిచ్చారు.

కార్యక్రమం సూపర్ అంటూ.. టాక్ వచ్చేలా మాట్లాడి వెళ్లిపోయారు. ఇంత వరకు బాగానే ఉంది. కార్యక్రమం ముగిసింది. ఆ వెంటనే.. కొందరు క్యూకట్టారు. సార్.. మేం షామియానా వేశాం.. డబ్బులు ! సార్ మేం వచ్చిన వారికి కుర్చీలు వేశాం.. పైకం!  సార్.. మేం మంచి నీళ్లు పోశాం.. డబ్బులు!  అంటూ.. సంబంధిత షామియానా దుకాణం సిబ్బంది ప్రశ్నించారు. కానీ ఎవరూ ఉలకలేదు పలకలేదు. ఇదంతా కూడా పందిళ్ల పల్లికి చెందిన ఒక షామియానా దుకాణం.. యజమాని ఆధ్వర్యంలోనే జరిగింది. వాస్తవానికి ఇలాంటి ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రభుత్వమే నిధులు ఇస్తుంది.

అలానే.. దీనికి కూడా.. సంబంధిత శాఖ జిల్లా అధికారులు నిధులు పంపారు. కానీ షామియానా సిబ్బందికి ఒక్కరూపాయి ఇవ్వలేదు. పోనీ..ఎమ్మెల్యే అయినా.. పట్టించుకున్నారా ? అంటే.. చొక్కా కూడా నలగకుండా.. అక్కడ నుంచి చెక్కేశారు. దీంతో వెలుగు ఆఫీస్‌లో 50 మంది వీఏవోలు.. ఒక్కొక్కరి నుంచి రూ. 1000 చొప్పున వసూలు చేసి.. ఎంపీడీవో కార్యాలయం చెల్లించి..పరువు కాపాడుకుందట. అయితే.. వెలుగు సిబ్బంది అయ్యా మాకు వచ్చేది అరకొర వేతనాలే.. ఖర్చులు పెరిగిపోయాయి.. ఇలా వెయ్యంటే.. ఎలా అని ప్రశ్నించారట.

దీంతో ..అప్పటికే ఆగ్రహంతో ఉన్న ఎంపీడీవో.. ఖస్సు మన్నారట.. మీరు వెయ్యే ఇచ్చారు.. నా చేతి చమురు ఇంకా ఎక్కువే వదిలింది ఆయన రుసరుసలాడారట. మొత్తంగా చూస్తే.. ఎంకి పెళ్లి సుబ్బిచావుకు వచ్చినట్టు.. కరణంగారి కార్యక్రమం.. చిరుద్యోగుల చేతి చమురును వదిలించిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.