కరణం ఆమంచి ఆట.. అరటిపండుగా పర్చూర్ వైసీపీ ఇన్ చార్జి

Thu Jul 16 2020 09:15:11 GMT+0530 (IST)

What is the situation of YCP in charge of Parchur?

ప్రకాశం జిల్లా వైసీపీలో నేతలను సర్ధుబాటు చేయడం వైసీపీ అధిష్టానానికి తలకు మించిన భారమవుతోందని జిల్లా నేతల్లో చర్చ జరుగుతోంది. వైసీపీలో ఆది నుంచి ఉన్న నేతలకు.. కొత్త వచ్చిన నేతలను సర్ధుబాటు చేయడం కష్టమవుతోంది. ఒకే నియోజకవర్గంలో ఇద్దరు దిగ్గజ నేతలను సర్ధుబాటు చేయలేక వైసీపీ అధిష్టానం మరో నియోజకవర్గానికి ఇన్ చార్జిగా పంపించే ప్రయత్నం చేస్తోంది. ఈ పరిణామం అక్కడున్న వైసీపీ ఇన్ చార్జి సీటుకు ఎసరు తెస్తోందని ప్రచారం జరుగుతోంది.గత ఎన్నికలకు ముందు టీడీపీలో ఉన్న ఆమంచి వైసీపీలో చేరి పోటీచేసి ఓడిపోయారు. టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి గెలిచిన గెలుపొందిన కరణం బలరాం తదనంతర పరిణామాల్లో వైసీపీలో చేరిపోయారు. దీంతో వైసీపీలో ఒకే చీరాల ఒరలో ఇద్దరు దిగ్గజ నేతలు ఎమ్మెల్యే కరణం మాజీ ఎమ్మెల్యే ఆమంచిలున్నారు. వీరి ఆధిపత్య పోరుతో పార్టీలో సెగలు కక్కుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

చీరాలలో అధికార వైసీపీలో ఆధిపత్య పోరు నడుస్తోందట.. ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ లకు న్యాయం చేయడానికి ఇద్దరినీ పార్టీలో ముందుకు తీసుకెళ్లడానికి వైసీపీ అధిష్టానం డిసైడ్ అయ్యిందనే ప్రచారం సాగుతోంది.

ఈ క్రమంలో మంత్రి బాలినేని.. పార్టీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా చర్చించి నాలుగు రోజుల కిందట మాజీ ఎమ్మెల్యే ఆమంచిని పర్చూర్ వైసీపీ ఇన్ చార్జిగా కొనసాగాలని కోరినట్లు సమాచారం. అయితే ఆయన మాత్రం తనకంటే ప్రస్తుత చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం అయితే పర్చూర్ ఇన్ చార్జిగా బెటర్ అని.. ఆయన సామాజికవర్గం కమ్మ కులం పర్చూర్ లో మెజార్టీ స్థాయిలో ఉన్నారని.. అందుకే ఆయన మారితేనే బెటర్ అని సూచించినట్టు తెలిసింది.

అయితే చీరాల సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన కరణం వేరే నియోజకవర్గానికి ఇన్ చార్జిగా వెళితే తప్పుడు సంకేతాలు వెళతాయి. ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉంటూ మరోదానికి ఇన్ చార్జిగా ఉండడం అసాధ్యమైన పని. రెండు నియోజకవర్గాలకు న్యాయం చేయలేడని ఆయన డిసైడ్ అయ్యారట.. అందుకే ఎన్నికల వరకు చూద్దాంలే అని దాటవేశాడట..

ఇలా కరణం ఆమంచిల ఆధిపత్య పోరువల్ల చివరకు పర్చూరు వైసీపీ నియోజకవర్గ ఇన్ చార్జి రామనాథం బాబు సీటుకు ఎసరు వస్తుందనే ప్రచారం వైసీపీలో సాగుతోంది. వీరిద్దరి ఆటలో పర్చూర్ ఇన్ చార్జి అరటిపండుగా మారబోతున్నాడా అన్న ప్రచారం జిల్లాలో జోరుగా సాగుతోంది.