Begin typing your search above and press return to search.

అయ్యో కేన్ మామ.. ఫామ్ లో ఉండగా ఇలానా..?

By:  Tupaki Desk   |   1 April 2023 5:00 PM GMT
అయ్యో కేన్ మామ.. ఫామ్ లో ఉండగా ఇలానా..?
X
ప్రపంచ క్రికెట్ లో క్లాస్ బ్యాట్స్ మన్ ఎవరంటే..? అత్యంత నిలకడగా పరుగులు సాధించగల వారెవరంటే..? మూడు ఫార్మాట్లలోనూ మంచి సగటు ఉన్నవారెవరంటే..? క్లాస్ లోనూ మాస్ చూపగలదెవరంటే..? కూల్ గా కెప్టెన్సీ భారం మోయగల ఆటగాడెవరంటే..? అందరినుంచి వచ్చే సమాధానం న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్. మిన్ను విరిగి మీద పడ్డా హుందాతనం కోల్పోని నైజం విలియమ్సన్ ది. 2019 ప్రపంచ కప్ ఫైనల్ సందర్భంగానే ఈ సంగతిని మనం గమనించాం. అత్యంత ఒత్తిడి మధ్య జరిగిన ఈ మ్యాచ్ లో.. పరిస్థితులు అనుకూలంగా ఉన్నా.. కేవలం సాంకేతిక కారణాలతో ఫలితం వ్యతిరకంగా వచ్చినప్పటికీ.. విలియమ్సన్ మనోధైర్యం చెక్కుచెదరలేదు. ముఖంపై అదే చిరునవ్వు..

కెప్టెన్సీ వదులుకుని బ్యాటింగ్ పై కన్నేసి

విలియమ్సన్ రెండేళ్లుగా బ్యాటింగ్ పై ఫోకస్ పెట్టాడు. న్యూజిలాండ్ కెప్టెన్సీ ని ఒక్కోటిగా వదులుకుంటున్నాడు. ఈ క్రమంలో ఫామ్ పరంగానూ సమస్యల్లో చిక్కుకున్న అతడు ఇటీవల మళ్లీ గాడినపడ్డాడు. గత పది ఇన్నింగ్స్ లో రెండు అర్ద సెంచరీలు, రెండు సెంచరీలు, ఓ డబుల్ సెంచరీ కొట్టి మంచి ఊపు మీద ఉన్నాడు.

వాస్తవానికి విలియమ్సన్ కు సన్ రైజర్స్ హైదరాబాద్ తో మంచి అనుబంధం ఉంది. ఈ జట్టు తరఫున గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. కానీ, నిరుడు అతడిని జట్టు రిటైన్ చేసుకోలేదు. ఈ సారి డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ విలియమ్సన్ ను రూ.2కోట్లకు తీసుకుంది. జట్టుగా ఆడుతూ మ్యాచ్ లు గెలుస్తున్న గుజరాత్ కు ఇలాంటి బ్యాట్స్ మన్ అవసరం కూడాను. కానీ.. విలియమ్సన్ నే కాక గుజరాత్ నూ బ్యాడ్ లక్ వెంటాడింది.

12.5 ఓవర్లలోనే..

ఎన్నో ఆశలతో ఈసారి లీగ్ బరిలో దిగిన విలియమ్సన్ కేవలం 12.5 ఓవర్ల పాటే మైదానంలో ఉండగలిగాడు. శుక్రవారం చెన్నైతో జరిగిన మ్యాచ్ లో ఆ జట్టు ఓపెనర్ రుతు రాజ్ గైక్వాడ్ స్క్వేర్ లెగ్ లో భారీ షాట్ ఆడగా.. బౌండరీ దగ్గర బంతిని అందుకునేందుకు విలియమ్సన్ గాల్లోకి జంప్ చేశాడు. ఈ క్రమంలో చాలా ఎత్తు ఎగిరిన అతడు.. బంతి బౌండరీ ఆవలకు వెళ్లకుండా క్యాచ్ పట్టేశాడు. కాలు బౌండరీ దాటేలా కనిపించడంతో బంతిని మైదానంలోకి విసిరేసి కుడికాలిపై ల్యాండ్ అయ్యాడు.

అంత ఎత్తునుంచి బరువుతో పాటు ల్యాండ్ కావడంతో కుడి మోకాలు మెలికపడింది. చాలా సేపు విలవిల్లాడాడు. మోకాలును నిటారుగా చాపలేకపోయాడు. దీంతో ఫిజియోలు వచ్చి సరిచేశారు. ఆ తర్వాత ఇద్దరు మనుషుల సాయంతో మైదానం వీడాడు. గమనార్హమేమంటే.. విలియమ్సన్ కు ఇదివరకే కుడికాలి గాయం ఉంది. దాన్నుంచి కోలుకుని ఇటీవలే మ్యాచ్ లు ఆడుతున్నాడు. తాజాగా అదే కాలుకు గాయమైంది.

సీజన్ ను నుంచి ఔట్

విలియమ్సన్ ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరం కానున్నాడు. గత ఏడాది గుజరాత్ గెలుపులో కీలకంగా నిలిచిన దక్షిణాఫ్రికా మిడిలార్డర్ బ్యాట్స్ మన్ డేవిడ్ మిల్లర్ ఇంకా జట్టుతో చేరలేదు. నెదర్లాండ్స్ తో వన్డే సిరీస్ అనంతరం కానీ అతడు రాడు. ఈక్రమంలో గుజరాత్ కు విలియమ్సన్ సేవలు కీలకం. కానీ, అతడు పూర్తిగా అందుబాటులో లేకుండా పోయాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.