Begin typing your search above and press return to search.

అధికారులపై ఎదురుతిరిగిన వైసీపీ ఎమ్మెల్యే

By:  Tupaki Desk   |   2 Jun 2020 1:30 PM GMT
అధికారులపై ఎదురుతిరిగిన వైసీపీ ఎమ్మెల్యే
X
అధికారుల తీరుపై వైసీపీ ఎమ్మెల్యే ఎదురుతిరిగారు. పనులు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్న వారి కార్యాలయం ముందు నిరసన తెలిపారు. ప్రభుత్వం 100 కోట్లు మంజూరు చేసినా నీరు సరఫరా చేయకుండా కాంట్రాక్టర్లకు కొమ్ముకాస్తున్నారా అని ఆ వైసీపీ ఎమ్మెల్యే ఆగ్రహించారు. తన నియోజకవర్గానికి ఒక్క బిల్లు కూడా పాస్ కాకపోవడంపై అధికారులను నిలదీశారు. ఇదంతా ప్రకాశం జిల్లా జెడ్పీ కార్యాలయంలో చోటుచేసుకుంది. నిలదీసింది అధికార వైసీపీ పార్టీ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి.

ప్రకాశం జిల్లా కందుకూరు వైసీపీ ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి శివాలెత్తిపోయారు. పనిచేయని అధికారుల వైఖరిపై ప్రశ్నల వర్షం కురిపించారు. తాగునీటిసమీక్షలు చేయకుండా మంజినీటి సరఫరా డబ్బులు ఇవ్వకుండా.. ప్రభుత్వం 100 కోట్లు ఇచ్చినా బిల్లులు పాస్ చేయకుండా పనిచేయని అధికారులపై మండిపడ్డారు. కాంట్రాక్టర్లు పనిచేయని వారికే పనులు ఇస్తున్నారని.. సమస్యలు పరిష్కరించడం లేదని జడ్పీ కార్యాలయం నుంచి కదలనని భీష్మించుకు కూర్చుకున్నారు.

సోమశిల జలాశయం నుంచి కందుకూరులోని 90 గ్రామాల ప్రజలకు తాగునీటి ప్రాజెక్టును పనిచేయని కాంట్రాక్టర్లకు అప్పగించారని మహీధర్ రెడ్డి వాపోయారు. ఎండాకాలం ముగిసినా వాళ్లు పనిచేయలేదని.. ప్రజలకు ట్రాక్టర్లతో నీళ్లు అందిస్తున్నారని అధికారులపై నిప్పులు చెరిగారు. కరోనా టైంలో ట్రాక్టర్ల వద్ద జనాలు నీళ్లు పట్టుకుంటారా అని నిలదీశారు.

జిల్లా అధికారులు వీడియో కాన్ఫరెన్సులంటూ తప్పించుకుంటున్నారని.. పనులు చేయడం లేదని.. ఈ విధానాలను సరిచేయకపోతే ఊరుకోం అంటూ ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేయడం సంచలనమైంది.