రజనీ - కమల్ ఒకటయ్యేందుకు..పీకే పుట్టించిన భయమే కారణమా?

Wed Nov 20 2019 19:12:55 GMT+0530 (IST)

Kamal Haasan reiterates intention to join hands with Rajinikanth

రాజకీయాల్లోకి దిగినప్పటికీ...క్రియాశీలంగా లేని సూపర్ స్టార్ రజనీకాంత్...రాబోయే రోజుల్లో రాష్ర్ట రాజకీయాల్లో ఆశ్చర్యకరమైన పరిణామాలు చోటుచేసుకుంటాయని - పళనిస్వామి సీఎం అవడం ఒక వింత అని చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపడం తెలిసిందే. రజినీ వ్యాఖ్యలను మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ సమర్థించారు. రజనీ చెప్పిన మాటలను విమర్శలుగా తీసుకోవద్దని - అది వాస్తవమని ఆయన పేర్కొంటూ రజనీకి అండగా నిలిచారు. ‘రజనీ వ్యాఖ్యలను విమర్శలుగా పరిగణించొద్దు. అది వాస్తవం.. నిజం. మేమిద్దరం చేతులు కలుపడంలో కొత్తదనం ఏమీ లేదు. గత 44 ఏళ్లు మేము కలిసే ఉన్నాం’ అని తమ సినీ ప్రస్థానాన్ని పరోక్షంగా ఉద్దేశిస్తూ కమల్ వ్యాఖ్యానించారు. అయితే ఈ ఇద్దరు నేతలు ఈ కామెంట్లు చేయడం వెనుక రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఉన్నారట.తమిళనాడు ప్రజల సంక్షేమం కోసం రజినీతో చేతులు కలుపుడానికి తాను సిద్ధంగా ఉన్నట్టు కమల్ పేర్కొన్నప్పటికీ... ఈ ఇద్దరి భయం పీకే రిపోర్ట్ అంటున్నారు. తదుపరి సీఎంగా ఎవరిని కోరుకుంటున్నారన్న ప్రశ్నతో ఇటీవల తమిళనాడులో సర్వే నిర్వహించిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కు ఆశ్చర్యకరమైన సమాధానం వచ్చింది. తమిళ సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ - మరొకరు విశ్వ నటుడుగా పేరొందిన రజినీకాంత్ - కమల్ హాసన్ కాకుండా...తమిళ తెరపై ప్రేక్షకుల మదిని దోచుకుంటున్న యువ హీరో విజయ్ కు ఓటేశారట. దీంతో పీకే తన సర్వే రిపోర్టుతో విజయ్ ని కలిసి ఈ తమిళ హీరోను రాజకీయాల్లోకి రావాలని కోరారట.

పీకే-విజయ్ భేటీ - ముఖ్యమంత్రి పీఠంపై రాష్ట్ర ప్రజల మనోగతం స్పష్టమైపోయిన నేపథ్యంలో...రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే కలుస్తామని రజనీ - కమల్ ప్రకటించారంటున్నారు. రాజకీయాల్లో కాకలు తీరిపోయిన అధికార ప్రతిపక్ష పార్టీలైన అన్నా డిఎంకె - డిఎంకెలను  ఎదుర్కునేందుకు చెమటోడ్చుతున్న తరుణంలో..విజయ్ రూపంలో ఇంకో సవాల్ ను వేర్వేరుగా ఎదుర్కోవడానికి బదులుగా కలిసే ఢీకొట్టాలని...ఈ ఐక్యత రాగం తెరమీదకు తెచ్చారని విశ్లేషకులు చెప్తున్నారు.