Begin typing your search above and press return to search.

అపుడు చంద్రబాబు, ఇపుడు కేటీఆర్

By:  Tupaki Desk   |   17 Jan 2022 4:32 AM GMT
అపుడు చంద్రబాబు, ఇపుడు కేటీఆర్
X
ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీసంస్ధ టెస్లా ప్లాంటును తమ రాష్ట్రంలో ఏర్పాటు చేయమంటే తమ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని రాష్ట్రాలు కోరుతున్నాయి. అమెరికాకు చెందిన టెస్లా ఎలక్ట్రిక్ కారు ప్లాంటును ఇండియాలో ఏర్పాటు చేయాలని ఉందని కంపెనీ సీఈవో ఎలాన్ మస్క్ 2020లోనే ప్రకటించారు. అయితే కరోనా వైరస్ మహమ్మారితో పాటు అనేక కారణాల వల్ల మళ్ళీ మస్క్ ఆ ప్రస్తావన తేలేదు.

అయితే ఈ మధ్యనే ట్విట్టర్ వినియోగదారుడు ఒకరు మస్క్ తో మాట్లాడారు. భారత్ లో టెస్లా కార్ల ఉత్పత్తిని ఎప్పుడు ప్రారంభిస్తారంటు నెటిజన్ మస్క్ ను ప్రశ్నించారు. దానికి మస్క్ సమాధానమిస్తూ ఇప్పటికే ఈ విషయమై భారత ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. అయితే తమ కార్లను ఇండియాలో విడుదల చేయాలంటే చాలా సవాళ్ళను ఎదుర్కోవాల్సుంటుందని కూడా చెప్పారు. మస్క్ ట్వీట్ చూసిన వెంటనే తెలంగాణ మంత్రి కేటీయార్ స్పందించారు.

ఇండియాలో ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటు చేసేట్లయితే అవకాశం తమకే ఇవ్వాలని కోరారు. ఇండియాకు టెస్లా గనుక వచ్చేట్లయితే కలిపి పనిచేయటానికి తాము ఆసక్తిగా ఉన్నట్లు కేటీయార్ చెప్పారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన అనేక కంపెనీలు ఇప్పటికే తెలంగాణలో పెట్టుబడులు పెట్టిన విషయాన్ని కేటీయార్ గుర్తుచేశారు. తాజాగా మహారాష్ట్ర మంత్రి జయంత్ పటేల్ కూడా టెస్లా ప్లాంటు కోసం పోటీపడుతున్నారు. మహారాష్ట్రలోనే టెస్లా ప్లాంటును ఏర్పాటు చేయాలని కోరారు.

భారత్ లోని అత్యంత ప్రగతిశీల రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటన్న విషయాన్ని పటేల్ గుర్తుచేశారు. కంపెనీనిని గనుక మహారాష్ట్రలో ప్రారంభిస్తే అవసరమైన అన్ని సహాయ సహకారాలను అందిస్తామని కూడా పటేల్ హామీ ఇచ్చారు. మొదటి తెలంగాణ ఇపుడు మహారాష్ట్ర తెరపైకి వచ్చాయి. ముందు ముందు ఇంకెన్ని రాష్ట్రాలు పోటీపడతాయో చూడాలి.

ఇక్కడ గమనించాల్సిందేమంటే టెస్లా ఉత్పత్తి ప్లాంటును ఇండియాలో ఏర్పాటు చేయటం ఇంకా ఫైనల్ కాకపోయినా వ్యూహాత్మకంగా టెస్లాకు డిమాండ్ పెంచుకుంటున్నారు. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే కార్ల ఉత్పత్తి ప్లాంట్ ను ఏర్పాటు చేయటానికి మస్క్ చాలా రాయితీలను అడుగున్నారు. ఇందులో నూరుశాతం దిగుమతి సుంకాల మినహాయింపు చాలా కీలకమైనది. ఇదొకటి ఫైనల్ అయితే మిగిలినవన్నీ పరిష్కారమవుతాయి.

గతంలో ఏపీ ప్రభుత్వంతో టెస్లా ఒప్పందం

పునరుత్పాదక ఇంధన నిల్వ, ఇంటర్నెట్, విత్తనోత్పత్తి మరియు ఆహార సాంకేతిక రంగాలలో టెస్లా ఇంక్ తో 2017 మేలో చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారు. వారం రోజుల పాటు ఆనాడు జరిపిన పర్యటనల్లో ఇదొకటి కీలక పరిణామం.

టెస్లా సీఈఓ, ఎలోన్ మస్క్, ఇంధన రంగంలో తదుపరి దశ సంస్కరణలకు శ్రీకారం చుట్టడానికి సహకరించాలని చంద్రబాబు నాయుడు చేసిన విజ్ఞప్తికి ప్రతిస్పందనగా రాయలసీమలో ఒక్కొక్కటి 4 మెగావాట్ల సామర్థ్యం గల రెండు సౌరశక్తి నిల్వ యూనిట్ల తో ప్లాంట్ పెడతామని ఆరోజు ఎలాన్ మస్క్ అంగీకరించారు. టెస్లాతో, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రాంతీయ స్మార్ట్ గ్రిడ్‌లను ఏర్పాటు చేయాలని భావించింది, మొదట వ్యవసాయ పంపుసెట్‌లన్నింటినీ సౌరశక్తితో నడిచేవిగా మార్చడం మరియు చివరికి ఏదైనా మిగులు విద్యుత్‌ను గ్రిడ్‌లోకి ఎగుమతి చేయడం. అయితే, జగన్ ప్రభుత్వం వచ్చాక విద్యుత్ ఒప్పందాల రద్దు నిర్ణయం ప్రకటించడంతో ఎలాన్ మస్క్ తన మనసు మార్చుకున్నారు. ఇపుడు అదే ఎలాన్ మస్క్ కోసం అందరూ ఎగబడుతున్నారు.