దావోస్ : కేటీఆర్ మంచి ఫాస్టు మీదన్నుడే !

Tue May 24 2022 14:09:51 GMT+0530 (IST)

KTR on davos

ఆంధ్రా తెలంగాణ ప్రాంతాలకు చెందిన ముఖ్య నేతలంతా దావోస్ లోనే ఉన్నారు. ఫొటోలు దిగుతున్నారు. ముఖ్యంగా అన్నయ్య జగన్ తో తమ్ముడు కేటీఆర్ దిగిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.కేటీఆర్ కూడా వీటిని తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసి తన ఆనందాన్ని పంచుకున్నారు. సోదర రాష్ట్రంతో సఖ్యత స్నేహ భావం అన్నవి ఎంతో ముఖ్యం అన్నవి ఈ సందర్భంగా ఆ ఇద్దరు నేతలూ చెప్పకనే చెబుతున్నారు.

ఇంతవరకూ బాగానే ఉంది కానీ పెట్టుబడులకు సంబంధించిన సంప్రతింపుల్లో సంబంధిత ఫలితాల సాధనలో అన్నయ్య (జగన్) కన్నా తమ్ముడు (కేటీఆర్) దూసుకుపోతున్నారు. ఒకప్పుడు మన గుంటూరు కేంద్రంగా చదువుకున్న కుర్రాడు కేటీఆర్ జగన్ కన్నా వేగంగా దూసుకుపోతున్నారు.

ఇప్పటికే నాలుగైదు కంపెనీలతో చర్చలు సఫలీకృతం కావడంతో అంతా కేటీఆర్ ను మెచ్చుకుంటున్నారు.  ఇదే సమయంలో జగన్ మాత్రం విదేశీ పెట్టుబడులను సంబంధిత కంపెనీలను ఇటుగా రప్పించడంలో తడబడుతున్నారని టీడీపీ నుంచి విమర్శల మీద విమర్శలు అందుకుంటున్నారు.

ఇప్పటికే  కేటీఆర్ తరఫున చర్చలు ఫలించి లులూ సంస్థ సానుకూల దృక్పథం వ్యక్తీకరించి తెలంగాణ వాకిట ఐదు వందల కోట్లతో ఆహార శుద్ధి పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. అదే విధంగా మరో దిగ్గజ కంపెనీ కిమో ఫార్మా కంపెనీ విస్తరణకు వంద కోట్లు వెచ్చించేందుకు ముందుకు వచ్చింది.

ఇదే సందర్భం లో భాగ్యనగరిలో ప్రముఖ ఈ కామర్స్ సంస్థ మిషో తమ కార్యాలయం ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసింది. మొదటి రోజే దావోస్ లో వేగంవేగంగా తన పని తాను చేసుకుని కేటీఆర్ అన్నను మించిన తమ్ముడిగా పేరు తెచ్చుకోవడంపై తెలంగాణ రాష్ట్ర సమితి వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.