Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యేలకు సూటి వార్నింగ్ ఇచ్చేసిన కేటీఆర్

By:  Tupaki Desk   |   28 Feb 2021 4:35 AM GMT
ఎమ్మెల్యేలకు సూటి వార్నింగ్ ఇచ్చేసిన కేటీఆర్
X
ఒకటి తర్వాత ఒకటిగా తగులుతున్న ఎన్నికల ఎదురుదెబ్బలు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ మాటల్ని మరింత కటువుగా మార్చేస్తున్నాయి. తప్పులు చేసే పార్టీ నేతల్ని సున్నితంగా డీల్ చేసే ఆయన తన తీరును మార్చుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. హైదరాబాద్.. రంగారెడ్డి.. మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వేళ.. హైదరాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు.. కార్పొరేటర్లు.. మాజీ కార్పొరేటర్లతో టీఆర్ఎస్ భవన్ లో ఆయన ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు.

పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా పని చేయాలని.. కాదు.. కుదరదు.. మా వ్యక్తిగత విభేదాలే ముఖ్యమనుకుంటే ఆ విషయాన్ని ఓపెన్ గా చెప్పేసి తప్పుకోవాలని తేల్చేశారు. ‘మీరు కాకుంటే ఇంకొకరు వస్తారు. ఎమ్మెల్యేలతో సఖ్యత లేదు. ఎంపీలతో పడుతలేదని పార్టీకి నష్టం చేసేలా వ్యవహరించొద్దు. ఎమ్మెల్యేలు అందరినీ కలుపుకొని వెళ్లాలి’ అని సూటిగా స్పష్టంగా చప్పేశారు.

అంతేకాదు.. ప్రభుత్వ పథకాలు.. ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇస్తున్న మెటీరియల్ తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకొని కూర్చోవద్దన్నారు. ‘ఏవైనా పనులు ఉంటే తమకు ముందుగా చెబితే బాధ్యతలను ఇతరులకు అప్పగిస్తాం. ఎవరు పని చేస్తున్నారో.. ఎవరుచేయటం లేదో మాకు ఎప్పటికప్పుడు రిపోర్టుల వస్తాయి. దాని ప్రకారమే భవిష్యత్తులో నిర్ణయాలు తీసుకుంటాం’ అని కటువుగా చెప్పేసినట్లు చెబుతున్నారు.

పార్టీకి గెలుపోటములు కొత్తేం కాదని.. గతంలో చాలా ఎన్నికల్లో గెలిచాం.. ఓడామని చెప్పిన కేటీఆర్ గతం గురించి గుర్తు చేసుకున్నారు. ‘అసలు పార్టీ ఉంటుందా? లేదా? అన్న సందేహం నుంచి ఈ స్థాయికి వచ్చాం. ఇక ముందు కూడా టీఆర్ఎస్ అప్రతిహతంగా కొనసాగుతుంది. పార్టీ విషయంలో మీరు కూడా అంకితభావంతో ఉండాలి. నగరంలో కార్పొరేటర్లుగా పోటీ చేసేందుకే నాయకులు లేరన్న స్థితి నుంచి రెండుసార్లు అతి పెద్ద విజయాలతో మేయర్ పీఠాన్ని దక్కించుకున్నాం’ అని గుర్తు చేయటం గమనార్హం. ఇటీవల జరిగిన దుబ్బాక.. గ్రేటర్ ఎన్నికల్లో ఎక్కడైతే తప్పులు జరిగాయో.. తాజాగా జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అలాంటివి చోటు చేసుకోకూడదన్నట్లుగా కేటీఆర్ మాటలు ఉన్నాయని చెప్పక తప్పదు.