Begin typing your search above and press return to search.

గుండెలు బాదుకునే కేటీఆర్.. సర్పంచ్ దంపతుల ఆత్మహత్యాయత్నం మీద మాట్లాడరేం?

By:  Tupaki Desk   |   31 Jan 2023 9:31 AM GMT
గుండెలు బాదుకునే కేటీఆర్.. సర్పంచ్ దంపతుల ఆత్మహత్యాయత్నం మీద మాట్లాడరేం?
X
తెలంగాణలోని పరిస్థితులు ఎంత ఇబ్బందికరంగా ఉన్నాయన్న విషయాన్ని కళ్లకు కట్టే ఉదంతం ఒకటి నిజామాబాద్ కలెక్టరేట్ లో చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుటకు వచ్చిన సర్పంచ్ దంపతులు.. తాము చేయించిన పనులకు సంబంధించిన బిల్లులు మంజూరు కాక.. అప్పులు పాలు అయ్యామని.. దీంతో తీవ్రమైన ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్లాడుతున్నట్లుగా వాపోయారు. అంతేకాదు.. వారిద్దరు పెట్రోలు పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకోవటం సంచలనంగా మారింది.

నందిపేట సర్పంచ్ వాణి.. ఆమె భర్త తిరుపతి (వార్డు మెంబరుగా ఉన్నారు) ఇద్దరు కలిసి ఆత్మహత్యాయత్నం చేసుకునే ప్రయత్నం చేయటం చూసినప్పుడు కేసీఆర్ సర్కారు పని తీరు మరి ఇంతలా ఉందా? అన్న సందేహం కలుగక మానదు. గ్రామంలో రూ.2 కోట్ల డెవలప్ మెంట్ పనులు చేయించామని.. పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా వేధిస్తున్నట్లుగా సర్పంచ్ భర్త కమ్ వార్డు మెంబరు అయిన తిరుపతి కంటతడి పెట్టారు.

బీజేపీ నుంచి పోటీ చేసి భార్యను సర్పంచ్ గా గెలిపించుకున్న తాను గ్రామాన్ని డెవలప్ చేయాలన్న ఆలోచనతో బీఆర్ఎస్ లో చేరినట్లు చెప్పారు. అయినప్పటికీ చెక్ పవర్ రద్దుచేసి.. సస్పెండ్ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఆరోపించారు. కలెక్టరేట్ ఎదుట పెట్రోల్ పోసుకున్న ఈ దంపతులు.. అగ్గిపెట్ట తీసుకొని నిప్పు అంటించుకునే వేళలో.. అక్కడున్న ఒక వ్యక్తి.. వారి చేతిలో నుంచి అగ్గిపెట్టెను లాక్కోవటంతో పెను ప్రమాదం తప్పింది.

ఈ అనూహ్య పరిణామంతో కలెక్టరేట్ లోని అధికారులు.. పోలీసులు ఒక్కసారిగా అలెర్టు అయ్యారు. సర్పంచ్ దంపతులకు నచ్చజెప్పి వారిని అక్కడి నుంచి పంపారు. తనకున్న చెక్ పవర్ ను రద్దు చేశారని.. అట్రాసిటీ కేసు పెట్టారని.. మూడేళ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నట్లుగా వాపోయారు దంపతులు. తమ సమస్యల గురించి ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి చెప్పినా పట్టించుకోలేదన్నారు. అధికారుల చుట్టూ తిరిగి.. తిరిగి విసిగిపోయామని దీంతో ఆత్మహత్య తప్పించి మరో మార్గం లేదని వాపోయారు.

ఒకప్పుడు తాను పది మందిని ఆదుకున్నానని.. అలాంటి తన పరిస్థితి ఈ రోజు దీనంగా మారిందన్నారు. గ్రామంలోని డెవలప్ మెంట్ కార్యక్రమాల కోసం రూ.2కోట్లు ఖర్చు చేస్తే.. వడ్డీతో సహా ఇప్పుడు రూ.4 కోట్లకు చేరిందని.. చేతిలో చిల్లిగవ్వ లేదని.. పెండింగ్ బిల్లులు రాక దీనమైన పరిస్థితుల్లో ఉన్నట్లు వాపోయారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. నిత్యం కేంద్రం మీద విరుచుకుపడే కేటీఆర్.. రాష్ట్రంలో సొంత పార్టీకి చెందిన సర్పంచ్ లు బిల్లులు విడుదల కాక సూసైడ్ అటెంప్టు చేసే వరకు వెళుతున్న వైనం మీద కాస్త ఫోకస్ పెడితే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.