ప్రశ్నించే వారి విషయంలో బీజేపీ ఇలా.. మేము ఇలా.. కేటీఆర్ సూటి ప్రశ్న

Wed Mar 22 2023 12:00:01 GMT+0530 (India Standard Time)

KTR Tweet Goes Viral

బీజేపీ  పక్క రాష్ట్రంలో వ్యవహరిస్తున్న తీరుపై ట్విట్టర్ లో సూటిగా ప్రశ్నించాడు మంత్రి కేటీఆర్.  కర్ణాటకలో హిందుత్వం మీద కామెంట్ చేసిన  కన్నడ నటుడు చేతన్ కుమార్ ను అక్కడి బీజేపీ ప్రభుత్వం కేసులు పెట్టి అరెస్ట్ చేసిన వైనాన్ని ట్విట్టర్ లో షేర్ చేసిన కేటీఆర్.. కర్ణాటకలో ఒక న్యాయం.. తెలంగాణలో మరో న్యాయంగా వ్యవహరించాలా? అన్న ధోరణితో కొన్ని సూటి ప్రశ్నలు సంధించాడు. అవి ఇప్పుడు ట్విట్టర్ లో వైరల్ అవుతున్నాయి.కేటీఆర్ ట్వీట్ చేస్తూ "హిందుత్వం గురించి ప్రశ్నించిన ఓ కన్నడ నటుడిని అరెస్ట్ చేసిన కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం 14 రోజుల జైలు శిక్షను విధించింది. ఇదే తెలంగాణలో మా సీఎం కేసీఆర్ ను మంత్రులు శాసనసభ్యులను తీవ్రంగా దూషించారు. సోషల్ మీడియాలో అనరాని మాటలు అంటున్నారు. ప్రత్యక్షంగా భయంకరమైన అవమానాలను సహించాము. మేము వీటిపై బీజేపీ తరహాలోనే తిరిగి ఇవ్వవలసి ఉంటుంది. ఈ విషయంలో ప్రజలు ఏం చెబుతారు? ఇలాంటివి చేయడం భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కు దుర్వినియోగం కాదు" అంటూ కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్రంలో ఒక న్యాయం.. తెలంగాణలో మేం చర్యలు చేపడితే అన్యాయమా? అంటూ కేటీఆర్ నిలదీశారు.

ఇటీవల ఈడీ విచారణకు హాజరవుతున్న కవిత మీద.. అలాగే టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ఎపిసోడ్ లపై బీఆర్ఎస్ రాజకీయ ప్రత్యర్థులు కొంతమంది సోషల్ మీడియా యాక్టివిస్టులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తీన్మార్ మల్లన్న రఘు వంటి సోషల్ మీడియా జర్నలిస్టులు కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలంగా తమ వాణి వినిపిస్తున్నారు. బీఆర్ఎస్ ను ప్రజల్లో ఎండగడుతున్నారు. వీరు తీవ్ర పదజాలాలతో కేసీఆర్ కేటీఆర్ లపై విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల తీన్మార్ మల్లన్న ఆఫీసుపై బీఆర్ఎస్ మద్దతుదారులు దాడి చేసి ధ్వంసం చేశారు. ఇక రఘు ‘తొలివెలుగు’ ఛానెల్ ను సైతం కొనుగోలు చేశారనే ప్రచారం ఉంది.

అయితే ఇవన్నీ కూడా కేసీఆర్ సర్కార్ చేసిన ప్రత్యక్ష చర్యలు కాదు. పరోక్షంగా వారి మద్దతుదారులు చేసినవి. కర్ణాటకలోలాగా అరెస్ట్ లు తెలంగాణ ప్రభుత్వం చేయలేదు.విమర్శించిన వారిని జైలుకు పంపలేదు. ఇదే విషయాన్ని కేటీఆర్ ట్వీట్ ద్వారా తన మనోగతాన్ని బయటపెట్టాడు. ప్రజలే ఈ విషయంలో తమ ఆలోచనను బయటపెట్టాలని.. కర్ణాటకలో చేసింది తెలంగాణలో మేం చేయడం లేదు.. విమర్శలను ఎంతో భరిస్తున్నాం అన్నట్టుగా కేటీఆర్ వివరణ ఇచ్చాడు.

-కర్ణాటకలో హీరో చేతన్ ను బీజేపీ ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేసిందంటే?

కన్నడ నటుడు చేతన్ కుమార్ ఇటీవల హిందుత్వపై చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది. 'అసత్యాలపై హిందుత్వ నిర్మాణమైంది. రావణుడిని ఓడించి రాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన తర్వాతే భారత జాతి అనేది మొదలైందని సావర్కర్ చెప్పారనేది ఒక అసత్యం బాబ్రీ మసీదే రాముడి జన్మస్థలం అని పేర్కొనడం ఒక అసత్యం' అంటూ చేతన్ ట్వీట్ చేశాడు. హిందుత్వను కేవలం నిజం మాత్రమే ఓడించగలదని.. ఆ నిజం సమానత్వం అంటూ ట్వీట్ లో పేర్కొన్నాడు.

ఆయన వ్యాఖ్యలపై బీజేపీ అనుకూల హిందుత్వ సంస్థ ఫిర్యాదు చేయడంతో బెంగళూరు పోలీసులు నటుడిని అరెస్ట్ చేశారు.

ఈ ఘటనను ఉదాహరణగా తీసుకొని కర్ణాటక ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు.. తెలంగాణలో తమపై జరుగుతున్న ప్రచారాన్ని ఉటంకిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.