Begin typing your search above and press return to search.

ఏపీ మీద కేటీఆర్ సెటైర్ వేశాడా?

By:  Tupaki Desk   |   18 Jan 2020 5:19 AM GMT
ఏపీ మీద కేటీఆర్ సెటైర్ వేశాడా?
X
పక్కరాష్ట్రం గందరగోళంగా ఉండి.. మన రాష్ట్రం ప్రశాంతంగా ఉంటే ఆ ఆనందమే వేరు.. రాజకీయ నేతలకు అయితే దొరికే హాయి అంతా ఇంతాకాదు.. మొన్నటివరకూ తెలంగాణలో ఆర్టీసీ సమ్మె , ఏపీలో ప్రశాంతత ఉండేది. అందరూ ఏపీ చూడు ఎంత ప్రశాంతమో అన్నారు. ఆ తర్వాత తెలంగాణలో సమ్మె ముగిసింది. ఏపీలో రాజధాని మార్పు లొల్లి మొదలైంది. ఇలా ఏదో ఒక రూపంలో తెలుగు రాష్ట్రాల్లో లొల్లి జరుగుతోంది. ఈ పరిణామం పక్క రాష్ట్రంలోని వారికి పండుగలా ఉంది.

తాజాగా మంత్రి కేటీఆర్ మున్సిపల్ ఎన్నికల సన్నాహక విలేకరుల సమావేశంలోనూ ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న పరిస్థితులపై ఓ రకమైన సెటైర్లు వేశారనే చెప్పవచ్చు. ఏపీలో రాజధాని మార్పుపై జరుగుతున్న ఆందోళనలపై కేటీఆర్ స్పందించారు. సీఎం కేసీఆర్ 10 జిల్లాలను 33 జిల్లాలుగా మారిస్తే ప్రజా వ్యతిరేకత రాలేదని.. ఇబ్బందులు రాకుండా సాఫీగా సాగిందని ఇది కేసీఆర్ పరిపాలన దక్షతకు నిదర్శనమని కేటీఆర్ అన్నారు. అదే క్రమంలో ఏపీలో రాజధాని మార్పు కోసం ఆందోళనలు జరుగుతున్నాయి. తెలంగాణలో ఆందోళనలు జరిగాయా అని ఏపీ పరిస్థితిపై కేటీఆర్ సెటైర్లు వేశారు.

అంతేకాదు.. ఏపీలో జనసేన-బీజేపీ పొత్తు పొడుపుపై కూడా అయిష్టంగానే స్పందించారు. తెలంగాణలోనూ బీజేపీతో పవన్ పొత్తు పెట్టుకుంటారట కదా అని విలేకరులు అడగ్గా.. ‘తెలంగాణలో ఏం ఖర్మ, కశ్మీర్ లో కూడా పవన్ పార్టీ పొత్తులు పెట్టుకోవచ్చు. ఈ క్రమంలోనే జనసేన అంతర్జాతీయ పార్టీ కూడా కావచ్చేమో’ అంటూ పవన్ పై సెటైర్ల వర్షం కురిపించారు. అయినా ఈ ఏపీలో లొల్లి మాకెందుకు? అక్కడి ప్రజలు చూసుకుంటారని సమస్యను చాకచక్యంగా వదిలించుకున్నారు.

ఇలా తెలంగాణలో ప్రశాంతతపై ఓవైపు బీరాలకు పోతూనే.. ఏపీలో రాజకీయ అలజడి ఆందోళనలపై కేటీఆర్ సెటైర్లు వేశారనే చెప్పవచ్చు. మరి ఈ వ్యాఖ్యలు ఏపీనేతలు ఎలా స్పందిస్తారన్నది వేచిచూడాలి.