Begin typing your search above and press return to search.

అమిత్‌షాపై కేటీఆర్ పంచ్‌లు విన్నారా...వాట్సాప్ యూనివ‌ర్సిటీ అంటూ...

By:  Tupaki Desk   |   15 May 2022 4:38 PM GMT
అమిత్‌షాపై కేటీఆర్ పంచ్‌లు విన్నారా...వాట్సాప్ యూనివ‌ర్సిటీ అంటూ...
X
బీజేపీ ముఖ్య‌నేత అమిత్ షా తెలంగాణ ప‌ర్య‌ట‌న టీఆర్ఎస్ , బీజేపీల మ‌ధ్య మాట‌ల యుద్ధాన్ని మ‌రింత‌ పెంచింది. శంషాబాద్ స‌మీపంలోని తుక్కుగూడలో నిర్వ‌హించిన భారీ బ‌హిరంగ స‌భ ద్వారా తెలంగాణ బీజేపీ ఎన్నిక‌ల శంఖారావం మోగించిన సంగ‌తి తెలిసిందే. ఏకంగా ముంద‌స్తుకు సైతం సై అని బీజేపీ ముఖ్య నేత ప్ర‌క‌టించేశారు. త‌మ‌దైన శైలిలో తెలంగాణ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. అయితే, దీనికి సహ‌జంగానే టీఆర్ఎస్ త‌ర‌ఫున కౌంట‌ర్లు వ‌స్తున్నాయి.

తాజాగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు, టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అమిత్ షా పై విరుచుకుప‌డ్డారు. ఆయ‌న అమిత్ షా కాదు.. అబ‌ద్ధాల బాద్ షా అని ధ్వ‌జ‌మెత్తారు. అమిత్ షా మాట్లాడిన మాట‌లు, చెప్పిన అబ‌ద్ధాలు చూస్తుంటే ఆయ‌న పేరును క‌చ్చితంగా మార్చుకోవాలని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

వాట్సాప్ వ‌ర్సిటీలో తిరిగే విష‌యాల‌ను వాస్త‌వాలుగా భ్ర‌మింప చేసే ప్ర‌య‌త్నం అమిత్ షా చేశార‌ని కేటీఆర్ మండిప‌డ్డారు. తుక్కుగూడ‌లో చెప్పిన తుక్కు డిక్ల‌రేష‌న్.. తప్పుడు మాట‌లు న‌మ్మ‌డానికి విశ్వ‌సించ‌డానికి తెలంగాణ ప్ర‌జ‌లు సిద్ధంగా లేరు అంటూ కొట్టిపారేశౄరు. ``2014, 2018 ఎన్నిక‌ల్లో దారుణంగా ఓట‌మి చ‌విచూశారు. 108 స్థానాల్లో డిపాజిట్లు గ‌ల్లంత‌య్యాయి. క్షేత్ర‌స్థాయిలో బ‌లం లేదు.

కేంద్ర మంత్రిగా బాధ్య‌త‌లో ఉన్న వ్య‌క్తి ప‌చ్చి అబ‌ద్ధాలు మాట్లాడి త‌ప్పుదోవ ప‌ట్టించ‌డం స‌రికాదు. ఈ 8 ఏళ్ల‌ కాలంలో తెలంగాణ‌కు ఏం చేశారో చెప్పాల‌ని కోరాం. 27 ప్ర‌శ్న‌ల‌తో ఓ లేఖ కూడా రాశాను. దానికి గురించి ఒక్క మాట లేదు. తెలంగాణ‌కు నిధుల కేటాయింపుల‌పై ప‌చ్చి అబ‌ద్ధాలాడి, రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించేందుకు ప్ర‌య‌త్నించారు`` అంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

టీఆర్ఎస్ పార్టీది అవినీతి ప్ర‌భుత్వమంటూ అమిత్ షా ఆరోప‌ణ‌లు చేయ‌డంపై కేటీఆర్ విరుచుకుప‌డ్డారు. ``పొరుగున ఉన్న క‌ర్ణాట‌క‌లో ఏం జ‌రుగుతుందో మీ దృష్టికి వ‌చ్చే ఉంటుంది. ముఖ్య‌మంత్రి పీఠం కోసం కేంద్ర అధిష్టానం రూ. 2500 కోట్లు అడిగిన‌ట్లు క‌ర్ణాట‌క‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పాటిల్ ప్ర‌క‌టించారు. ఈ ఎమ్మెల్యే ఇప్ప‌టి వ‌ర‌కు స‌స్పెండ్ కాలేదు.. చ‌ర్య‌లు తీసుకోలేదు.. బీజేపీ అధిష్టానం ఖండించ‌లేదు. హిందూ మ‌ఠాల వ‌ద్ద 30 శాతం క‌మీష‌న్ ఇవ్వ‌నిదే నిధులు రావ‌ని ఓ పీఠాధిప‌తి చెప్పారు.

క‌ర్ణాట‌క‌లో కాంట్రాక్ట‌ర్ల‌ను కూడా వేధిస్తున్నారు. 40 శాతం క‌మిష‌న్ అడుగుతున్నారు. మంత్రి ఈశ్వ‌ర‌ప్ప వేధింపులు త‌ట్టుకోలేక ఓ కాంట్రాక్ట‌ర్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. అదే క‌ర్ణాట‌క‌లో 40 శాతం క‌మీష‌న్ ఇవ్వ‌క‌పోతే టూరిజం మంత్రి ఓ ప్రాజెక్టును ఆపేశారు. ఇప్పుడు చెప్పండి ఎవ‌రిదీ అవినీతి ప్ర‌భుత్వం`అని కేటీఆర్ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. గ‌త కొద్దికాలంగా తెలంగాణ‌లో రాజ‌కీయ ప‌ర్యాట‌కుల సంద‌డి న‌డుస్తోంద‌ని కేటీఆర్ కామెంట్ చేశారు. ``ఒక్కో టూరిస్టు వ‌చ్చి ఇష్ట‌మొచ్చిన‌ట్లు మాట్లాడి వెళ్తున్నారు. వారికి ఇక్క‌డి ప‌రిస్థితులు వారికి తెలియ‌వు. ఎయిర్‌పోర్టులోనూ, పార్టీ కార్యాల‌యాల్లోనూ చ‌క్క‌గా బిర్యానీ తిని, చాయ్ తాగి స్థానిక నాయ‌త‌క్వం రాసిచ్చిన స్ర్కిప్టు చ‌దువుతున్నారు. వెళ్లిపోతున్నారు`` అంటూ కేటీఆర్ సెటైర్లు వేశారు.