Begin typing your search above and press return to search.

వారిని విమర్శలతో చెడుగుడు ఆడిన కేటీఆర్

By:  Tupaki Desk   |   9 July 2020 4:30 PM GMT
వారిని విమర్శలతో చెడుగుడు ఆడిన కేటీఆర్
X
కరోనా ప్రారంభంలో తెలంగాణ రాష్ట్ర సర్కారుకు వచ్చిన మైలేజీ అంతా ఇంతా కాదు. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా అందరి కంటే ముందుగా లాక్ డౌన్ విధించటమే కాదు.. రెండు మూడు రోజులకు ఒకసారి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా మీడియాను పిలిపించి మరీ.. తాను తెలుసుకున్న విషయాల్ని ప్రజలకు చెప్పేవారు. ఏ విషయాల్లో తామేం చేయబోతున్న వైనాన్ని వెల్లడించటమే కాదు.. కేంద్రంలోని మోడీ సర్కారు అనుసరించాల్సిన విధి విధానాల్ని ఎన్నింటినో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రస్తావించేవారు.

అలా ఎప్పటికప్పుడు కేసీఆర్ ఇచ్చే అప్డేట్ తో రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయిపోయారు. చివరకు పరిస్థితి ఎక్కడివరకూ వెళ్లిందంటే.. కేసీఆర్ ప్రెస్ మీట్ అంటే చాలు.. టీవీలో చూసే సినిమాలు.. ఇతర కార్యక్రమాల్ని బంద్ చేసుకొని మరీ ప్రెస్ మీట్ సాగే గంట నుంచి రెండు గంటల పాటుసాగే ప్రెస్ మీట్ ను ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేవారు. కేసీఆర్ మాటలకు ప్రజల్లో వస్తున్న సానుకూలతను తెలంగాణ సర్కారు సాధించిన విజయంగా చెప్పుకునేవారు. అలాంటిది సీఎం కేసీఆర్ తన ప్రెస్ మీట్లను బంద్ చేయటమే కాదు.. బయట ప్రపంచానికి దూరంగా ఉంటూ ఫామ్ హౌస్ కు పరిమితమవుతున్నారు.

దీంతో ప్రభుత్వాన్ని తప్పు పట్టే వారి సంఖ్య అంతకంతకూ పెరగటం మొదలైంది. ముందుగా అంచనా వేసుకున్నట్లే కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న వేళ.. వ్యవస్థలు ఎక్కడికక్కడ స్తంభించిపోయే పరిస్థితి. దీనికి తోడు కరోనా మొదలై దాదాపు నాలుగు నెలలు కావొస్తున్న వేళ.. వైరస్ పై యుద్ధం చేస్తున్న వారియర్స్ కు అండగా ఉన్న వారంతా ఇప్పుడు నీరసించిపోతున్నారు. ఇలాంటి సమయాల్లోనే తప్పులు జరుగుతుంటాయి.

సాధారణంగా ఇలాంటి సమయాల్లోనే ప్రభుత్వం చురుగ్గా పాల్గొని తప్పులు చోటు చేసుకునే అవకాశం ఉన్న చోట సరి చేయాల్సిన అవసరం ఉంది. సరిగ్గా ఇదే సమయంలోనే విపక్షాలు ప్రభుత్వం మీద విరుచుకుపడుతుంటాయి. పొగడ్తలు వచ్చినప్పుడు ఎంజాయ్ చేసిన ప్రభుత్వ పెద్దలు.. విమర్శలు వినిపిస్తున్నప్పుడు మాత్రం భరించలేకపోతోంది. తమను తప్పు పట్టటమా? అంటూ తమ నోటికి పని చెబుతున్నారు ప్రభుత్వ పెద్దలు.

దీనికి తోడు రోగులకు అవసరమైన మౌలిక సదుపాయాలు దొరకని ఉదంతాలుబయటకురావటంతో ప్రతిపక్షాలు రంగాలు దిగాయి. ప్రభుత్వంపై ఘాటు విమర్శలతో విరుచుకుపడుతున్నాయి. తమను పొగడటమే తప్పించి విమర్శిస్తే స్వీకరించే అలవాటును మిస్ అయిన కేసీఆర్ సర్కారుకు.. విమర్శలు చేస్తునన విపక్షాలపై విరుచుకుపడుతున్నారు. దీంతో.. ఇటీవల కాలంలో పొలిటికల్ పొల్యూషన్ పెరుగుతోంది.

తెలంగాణలో రోజుకు 1500 కేసులకు తగ్గకుండా పాజిటివ్ లు నమోదవుతుతున్నాయి. వీరిలో85 శాతం వరకు హైదరాబాద్ మహానగరానికి చెందిన వారే. ఇంత పెద్ద సంఖ్యలో రోజువారీ వైద్యం అందించటం తలకు మించిన భారంగా మారుతోంది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్న విపక్షాలు ప్రభుత్వం తీరును తప్పుపడుతున్నారు. దీంతో.. ఆత్మరక్షణలో పడిన ప్రభుత్వం.. ఎదురు దాడికి దిగుతోంది. తాజాగా మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనంగా చెప్పారు. కరోనాపై ప్రతిపక్షాలు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నాయి.. బాధ్యతగా వ్యవహరించాల్సిన స్థానే.. ఇష్టం వచ్చినట్లుగా ఉంటున్నాయని మండిపడ్డారు.

అదే పనిగా ప్రభుత్వాలపై బురద జల్లటంతో పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారే తప్పించి.. మరింకేమీ సాధించటం లేదన్నారు. పరీక్షలు చేయటం లేదు.. డేటా దాస్తున్నారు? కేసీఆర్ సర్కారు ఫెయిల్ అవుతుందంటూ విపక్షాలు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ కేటీఆర్ ఆగ్రహాం వ్యక్తం చేశారు. నిజమైన మరణాల సంఖ్యను ఎలా దాచగలమని ప్రశ్నించిన మంత్రి కేటీఆర్ తీరు చూసినప్పుడు మరింత అమాయకంగా అనిపించొచ్చు. ప్రైవేటు ఆసుపత్రుల్లో మరణించిన వారి లెక్కలు ప్రభుత్వ లెక్కల్లోకి సరిగా రావటం లేదన్న వాస్తవాన్ని మంత్రి కేటీఆర్ కు తెలియకపోవటం వల్లే ఇలా మాట్లాడి ఉంటారంటున్నారు? ఇంతకీ వారి మాటల్లో నిజమెంత? అన్న విషయాన్ని కేసీఆర్ సర్కారు చెక్ చేయాల్సిన అవసరం ఉంది.
Tags: