Begin typing your search above and press return to search.

వీఆర్వోల వ్యవస్థ రద్దు... కేసీఅర్ యూటర్న్?

By:  Tupaki Desk   |   13 Jan 2021 2:30 AM GMT
వీఆర్వోల వ్యవస్థ రద్దు... కేసీఅర్ యూటర్న్?
X
తెలంగాణలో వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తూ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో సమగ్ర భూ సర్వేతోనే భూసమస్యలన్నీ పరిష్కారమవుతాయని, అందుకే కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టామని కేసీఆర్ అన్నారు. గతంలో ఎవ్వరూ చేయని విధంగా సాహసం చేస్తున్నామని, ధరణి పోర్టల్, సమగ్ర భూసర్వేతో భూముల రికార్డులలో పారదర్శకత తీసుకువస్తున్నామని, ఇక లంచాలకు తావు లేదని చెప్పారు. అయితే, తాజా పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ వీఆర్వోల వ్యవస్థ రద్దుపై పునరాలోచనలో పడ్డారా...అంటే ఔననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ‘ధరణి’ ఆశించిన ఫలితాలివ్వకపోవడంతో ప్రస్తుతం వీఆర్వోలు అనధికారికంగా విధులు నిర్వర్తిస్తున్నట్టు తెలుస్తోంది. హోల్డ్ లో ఉన్న వీఆర్వోలంతా పై అధికారులకు సహకరించాలని ఎమ్మార్వో కార్యాలయాల నుంచి ఉత్తర్వులందాయని తెలుస్తోంది.

కానీ, వీరెవరికీ అధికారికంగా విధులు కేటాయించకలేదు. దీంతో, అనధికారికంగానే విధులు నిర్వహిస్తోన్న వీఆర్వోలను చూసి ప్రజలు షాక్ అవుతున్నారు. వీఆర్వోల వ్యవస్థ రద్దయిన నేపథ్యంలో మళ్లీ వారు విధులు నిర్వహించడం ఏమిటని అనుకుంటున్నారట. రాష్ట్రంలోని 5400 మంది వీఆర్వోలను విధుల్లో నుంచి తీసేసి 3 నెలలు కావస్తున్నా వేరే శాఖల్లోకి వారి బదిలీ జరగలేదు. వీఆర్వోల వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా రూపొందించిన ‘ధరణి’ వర్కవుట్ కాలేదు. ఈ నేపథ్యంలోనే వీఆర్వోలకు శాఖలు కేటాయించకుండా...అనధికారికంగా విధులు నిర్వహించేలా ఆదేశాలు వచ్చాయని టాక్ వస్తోంది. వీఆర్వోల అనధికారిక విధులపై సార్ కు సమాచారం ఉండే ఉంటుందని, కానీ, పరిస్థితుల వల్ల ఆయన వీఆర్వోల వ్యవస్థ విషయంపై వెనక్కు తగ్గి ఉంటారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం దాదాపు 10లక్షల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. వాటిని పరిశీలించి అర్హులను గుర్తించేందుకు సరిపడా సిబ్బంది లేరు. దీంతో వీఆర్వోలకు ఆ పని అప్పగించారని టాక్ వస్తోంది. వీఆర్వో వ్యవస్థని రద్దు చేయడం వల్ల లాభం లేకపోగా.. నష్టమే ఎక్కువగా ఉందన్న భావనలో ఉన్నతాధికారులున్నారట. ఏది ఏమైనా వీఆర్వోల వ్యవస్థ రద్దుపై గులాబీ బాస్ కాస్త వెనక్కు తగ్గినట్టేనని, భవిష్యత్తులో వీఆర్వోల వ్యవస్థ రద్దు నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నా ఆశ్చర్య పోనవసరం లేదని ప్రచారం జరుగుతోంది. వీఆర్వోల వ్యవస్థ రద్దుపై కేసీఅర్ యూటర్న్ తీసుకునే అవకాశముందని అనుకుంటున్నారు.