Begin typing your search above and press return to search.

పార్లమెంట్ లో గులాబీ ఎంపీలు ఏం చేయాలో చెప్పేసిన కేసీఆర్

By:  Tupaki Desk   |   29 Nov 2021 4:36 AM GMT
పార్లమెంట్ లో గులాబీ ఎంపీలు ఏం చేయాలో చెప్పేసిన కేసీఆర్
X
కేంద్రంలోని మోడీ సర్కారు మీద సమర శంఖాన్ని పూరించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. తాజాగా ఆ కార్యక్రమాన్ని ఏ రీతిలో చేపట్టాలన్న దానిపై మరింత క్లారిటీతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ధాన్యం సేకరణ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానం అయోమయంగా ఉండటంతో పాటు అస్పష్టంగా ఉందని పేర్కొన్నారు.

తెలంగాణ రైతాంగానికే కాదు దేశీయ వ్యవసాయ రంగానికి ఇబ్బందికరంగా మారిందన్న ఆయన.. కేంద్రం తీరును పార్లమెంటు సాక్షిగా నిలదీయాలని నిర్ణయించారు. ఇదే విషయాన్ని ఆదివారం ప్రగతిభవన్ లో సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఆయన.. తమ పార్టీ ఎంపీల (లోక్ సభ.. రాజ్యసభ సభ్యులు)ను పిలిచి.. పార్లమెంటు వేదిక మీద ఏం చేయాలన్న దానిపై దిశానిర్దేశం చేశారు.

ధాన్యం సేకరణపై స్పష్టత కోసం ఉభయ సభల్లో టీఆర్ఎస్ ఎంపీలు తమ గళాన్ని వినిపించాలని ఆదేశించారు. ధాన్యం సేకరణ విషయంలో కొన్ని రాష్ట్రాలకు ఒక రీతిలో.. తెలంగాణ తదితర రాష్ట్రాల విషయంలో ఇంకోలా వ్యవహరించే తీరును ప్రశ్నించాలన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉంటే కేవలం 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరిస్తామని చెబుతున్నారని.. ఈ తీరును నిలదీయాలన్నారు.

ఆహార ధాన్యాల సేకరణ విషయంలో జాతీయ సమగ్ర విధానం ఉండాలని.. అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఏకరీతి విధానాన్ని అనుసరించాలన్నారు. ఈ విషయాలపై ఉభయసభల్లో ప్రస్తావించాలన్నారు. ధాన్యం సేకరణ విషయంలో కేంద్రం ద్వంద వైఖరిని విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు.

ఈ అంశంపై తెలంగాణ మంత్రులతో కూడిన టీం కేంద్ర వ్యవసాయ మంత్రిని కలిసినా.. ధాన్యం కొనుగోళ్ల మీద దేన్ని తేల్చకపోవటం రికాదన్నారు. రాష్ట్ర రైతాంగం తరఫున పార్లమెంటు వేదికగా కేంద్రాన్ని నిలదీయాలన్నారు. కేసీఆర్ దిశానిర్దేశం నేపథ్యంలో ఎంపీ ఏ రీతిలో రియాక్టు అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.