Begin typing your search above and press return to search.

కూల్చుడు గురించి మీరు మాట్లాడితే బాగుంటుందా కేసీఆర్?

By:  Tupaki Desk   |   5 Dec 2022 4:23 AM GMT
కూల్చుడు గురించి మీరు మాట్లాడితే బాగుంటుందా కేసీఆర్?
X
కొంతమంది నోటి నుంచి వచ్చే కొన్ని మాటలు వారికి అస్సలు సూట్ కావు. ఇప్పుడు అలాంటి మాటలే వస్తున్నాయి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నోటి నుంచి. తాజాగా మహబూబ్ నగర్ లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆవేశంతో మాట్లాడిన గులాబీ బాస్.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీపైనా.. కేంద్ర ప్రభుత్వం తీరుపైనా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వ దుర్మార్గాల్ని.. దౌర్జన్యాల్ని ప్రశ్నిస్తే ప్రభుత్వాల్ని కూల్చేయమని అనటం ఏమిటంటూ మండిపడ్డారు. తెలంగాణ డెవలప్ మెంట్ ను చూసి కేంద్ర పెద్దలు ఓర్వలేకపోతున్నట్లుగా ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ లాంటి శక్తివంతమైన ముఖ్యమంత్రి నోటి నుంచి వచ్చిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు షాకింగ్ గా మారాయి.

ఇంతకూ ప్రధానమంత్రి మోడీ తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని చెప్పారా? ఒకవేళ చెబితే ఏ సందర్భంలో చెప్పారు? అన్నది ప్రశ్న. మొన్నటివరకు సంబంధాలు బాగున్నంతవరకు చెట్టాపట్టాలేసుకొని తిరిగిన మోడీ - కేసీఆర్ లు ఇప్పుడు అందుకు భిన్నంగా ఎందుకు వ్యవహరిస్తున్నట్లు? ప్రభుత్వాన్ని కూల్చేస్తామని ప్రధానే స్వయంగా ఎలా అంటారని మండిపడుతున్న కేసీఆర్.. తానెప్పుడూ ఎవరిని కూల్చలేదా? అన్నది ప్రశ్న.

తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే.. తమ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తామని మాట ఇచ్చి.. ఆ తర్వాత హ్యాండ్ ఇవ్వటం.. దాని కారణంగా కాంగ్రెస్ కు జరిగిన నష్టం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ మాటకు వస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. టీఆర్ఎస్ తప్పించి మరే పార్టీ కూడా బతకకూడదన్నట్లుగా వ్యవహరించిన గులాబీ బాస్.. వ్యూహాత్మకంగా ఒకటి తర్వాత ఒకటి చొప్పున పార్టీలు తెలంగాణలో మనలేని రీతిలో మార్చిన వైనాన్ని మర్చిపోలేం.

అంతేనా.. తమ పార్టీ తరఫున కాకుండా మరే పార్టీ తరఫున పోటీ చేసి గెలిచినా.. వారిని తమ పార్టీలో మార్చేసే విషయంలో గడిచిన రెండు టర్మ్ లల్లో ఆయన చేసిన విన్యాసాల గురించి ఎవరికి తెలీవు. తన రాజకీయ ప్రయోజనం కోసం పార్టీలను.. పార్టీల తరఫున గెలిచిన రాజకీయ నేతల్ని ఒకరు తర్వాత ఒకరు చొప్పున తన వైపునకు లాగేసుకునేలా చేసిన కేసీఆర్ కు.. పార్టీల్ని కూల్చటం కాదు.. నేలమట్టం చేసి.. వాటి ఆనవాళ్లు తెలంగాణలో లేకుండా చేయటంలో చూపిన టాలెంట్ ను ఎవరు మాత్రం మర్చిపోగలరు.

అలాంటి కేసీఆర్ ఈ రోజున మోడీ తమ ప్రభుత్వాన్ని కూల్చేస్తామన్న తప్పుడు మాటను ఎలా అనగలరంటూ ప్రశ్నిస్తున్నారు. తన విషయంలో ఎదుటి వారు చేస్తున్న తప్పుడు పని గురించి గుండెలు బాదుకుంటున్న కేసీఆర్.. ఇంతకాలం తాను అదే పని చేశానన్న విషయాన్ని ఎందుకు గుర్తించరు? అన్నది ప్రశ్న. తాను చేసిన పనులే.. ఇప్పుడు తనకు ఎదురవుతుంటే ఆగమాగం అవుతున్న మాటల్ని వింటున్న వారంతా.. కేసీఆర్ ఇప్పుడు చెబుతున్న లాజిక్ కు కనెక్టు కాలేకపోతున్న పరిస్థితి. అందుకే అంటారు.. తప్పులు చేయటం తేలికే.. కానీ వాటి ఫలితాల్ని అనుభవించే సమయమే కష్టంగా మారుతుందని.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.