Begin typing your search above and press return to search.

సర్పంచ్ తో స్వయంగా మాట్లాడిన సీఎం కేసీఆర్.. వారిద్దరి సంభాషణ ఎలా సాగిందంటే?

By:  Tupaki Desk   |   19 Jun 2021 3:30 AM GMT
సర్పంచ్ తో స్వయంగా మాట్లాడిన సీఎం కేసీఆర్.. వారిద్దరి సంభాషణ ఎలా సాగిందంటే?
X
అనూహ్యంగా వ్యవహరించటం.. ఊహించని విధంగా రియాక్టు కావటం ఎలా అన్న విషయం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలిసినంత బాగా మరెవరికీ తెలీదనే చెప్పాలి. ఏదైనా కార్యక్రమాన్ని చేపట్టిన వెంటనే దానికి తగ్గ మైలేజీని సొంతం చేసుకునే విషయంలో ఆయన వ్యవహారశైలి ఆకట్టుకునేలా ఉంటుంది. అప్పటివరకు తిట్టిన వ్యక్తి చేత కూడా.. ‘సారు సామాన్యుడు కాదు.. ఆయనలో ఏదో మేజిక్ ఉంది’ అన్నట్లుగా కితాబులు ఇప్పించుకోవటం ఆయనకు మాత్రమే చెల్లుతుంది.

ఈ నెల నుంచి తాను గ్రామాలకు వెళతానని.. అక్కడ చోటు చేసుకున్న డెవలప్ మెంట్ గురించి తానే స్వయంగా చూస్తానని.. చెప్పటం తెలిసిందే. ఇందుకు తగ్గట్లు ఈ నెల 22న యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామానికి వెళ్లాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఆ గ్రామ సర్పంచ్ పోగుల అంజయ్యకు స్వయంగా ఫోన్ చేసిన సీఎం కేసీఆర్.. ఆయనతో మాట్లాడారు.

సీఎం ఫోన్ కాల్ తో సదరు సర్పంచ్ ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఫోన్ మాట్లాడామంటే మాట్లాడామన్నట్లు కాకుండా.. భోజనాలు ఎలా చేయించాలి? దాని బాధ్యత తాను తీసుకుంటానని చెప్పటమే కాదు.. సర్పంచ్ కోరినట్లు ఆయన ఇంటికి వస్తానన్న మాట కూడా ఇచ్చారు.అది కూడా ఎలా వస్తానన్న విషయాన్ని ఫోన్ కాల్ లోనే స్పష్టం చేయటం గమానార్హం. ఆసక్తికరంగా మారిన ఫోన్ సంభాషణలోకి వెళితే..

సీఎం కేసీఆర్‌: హలో
సర్పంచ్‌: సార్‌ నమస్తే సార్‌
సీఎం: నమస్తే అంజయ్య.. బాగున్నవా?
సర్పంచ్‌: బాగున్న సార్‌.. బాగున్న సార్‌
సీఎం: అంజయ్యా.. ఇప్పుడేందంటే 22న వస్తున్న మీ ఊరికి.
సర్పంచ్‌: 22 తారీఖా సార్‌.
సీఎం: ఎందుకంటే ఈ మధ్య నాకు కరోనా వచ్చింది. దేశమంతా కరోనా వచ్చే. సూద్దమంటే కూడ రాలేకపోయిన. అప్పుడు నేను మాటిచ్చిన కాబట్టి 22న వచ్చి, ప్రాజెక్ట్‌ టేకాఫ్‌ చేద్దాం ఇగ.
సర్పంచ్‌: ఓకే సార్‌. థాంక్యూ సార్‌.
సీఎం: నువ్వు రెండు జాగలు జూడాలే. ఊరందరికీ భోజనం నేనే పెట్టాలే. ఎవరు పెట్టే అవసరం ఉండదు. ఎమ్మెల్యే గారికి కూడ చెప్పిన. నేనే పంపిస్తా. టీమ్‌ హైదరాబాద్‌ నుంచి వస్తారు. మొత్తం మీ ఊరి జనాభా ఎంతయ్యా?
సర్పంచ్‌: 2,600 సార్‌.
సీఎం: మూడు వేల మందికి వండితే సరిపోతదిగా మంచిగ?
సర్పంచ్‌: మూడు వేలకు సరిపోతది సార్‌.
సీఎం: నా వెంబడే వస్తది జిల్లా యంత్రాంగమంతా..
సర్పంచ్‌: అయితే ఎక్కువ గావలే సార్‌..
సీఎం: సరిపోతది.. నా వెంబడి 200 మంది వస్తే.. ఇంకో 200 మందికి ఎక్‌స్ట్రా అనుకుందాం.
సర్పంచ్‌: సరిపోతది సార్‌.
సీఎం: పోలీసోళ్లు, వాళ్లు, వీళ్లు ఉంటరు చూద్దాంలే. దానికి నువ్వెందుకు బాధ పడతవుగని. నేను జేపిస్తలే, టీమ్‌ వచ్చి సపరేట్‌ చేస్తరులే నువ్వేం గాబరా గావాల్సిన అవసరం ఉండది, కాకపోతే రెండు జాగాలు చూడాలే నువ్వు. మీ కలెక్టర్‌ కూడ వస్తది.
సర్పంచ్‌: ఇప్పుడే వస్తదా సార్‌?
సీఎం: ఆ.. కలెక్టర్‌ ఇప్పుడొస్తది. నీకు చెప్పే వస్తది, నీ పేరు కూడ చెప్పిన.. మధ్యాహ్నం వరకు వస్తదేమో. మొత్తం టీమ్, టీమ్‌ వస్తరిగ. మొత్తం రెండు జాగలు, ఒకటి ఊరి మొత్తం కులం, మతం, జాతి లేకుండా అందరికీ గలిసి సామూహిక భోజనం. ఒక్కతాననే తిందాం. నేను పదకొండున్నర, 12 మధ్యన చేరుకుంట. అందరితోపాటు కలిసి నేనుగూడ తింట. మందిల్నే కూర్చుని తింట. మీ మంత్రి గారొస్తరు. లోకమంత వస్తరు. దాని తర్వాత ఇంకో జాగల మీటింగ్‌
సర్పంచ్‌: సార్‌.. ఓకే సార్‌
సీఎం: దీనికి కూడ రెయిన్‌ ఫ్రూప్‌ టెంట్‌ ఏర్పాటు చేయాలే.. వానొచ్చినా ఇబ్బంది లేకుంట.. కలెక్టర్‌కు చెప్పిన. వాళ్లు చూసుకుంటరు. ఊరంత కూర్చొని తినడానికి. ఊరంత గూసోని మళ్లీ సభ జరుపుకోవడానికి రెండు జాగలు మంచివి నీట్‌గా ఉండేవి చూడాలె. అర్థమైందిగదా..
సర్పంచ్‌: ఊరు చిన్నది సార్‌. గ్రామ పంచాయతీ అంటే మరీ మధ్యన అయితది, అంతమంది కూర్చోవడానికి వీలు కాకపోవచ్చు సార్‌. మన రామాలయం అప్పుడు మీరు కారు ఆపిండ్రు చూడు సార్‌ టర్నింగ్‌ల, కొండాపూర్‌ రోడ్‌ల, అక్కడ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ ఉంటడు. అక్కడ అయనది ఓ ముప్పై ఎకరాలుంటది. హాస్టల్‌ దగ్గర..
సీఎం: అక్కడనే పెట్టియ్యి. అదే జాగల పెట్టు.
సర్పంచ్‌: అక్కన్నే పెడ్తసార్‌. మీరొచ్చే తొవ్వలనే.. మీరు రావడానికి ఈజీ ఉంటది సార్‌. ట్రాఫిక్‌ ఇబ్బంది ఉండది.
సీఎం: నాది బస్సు వస్తది. అండ్లనే బాత్రూం గిట్ల అన్ని ఉంటయి. నేను ఎవరింటికి పోవాల్సిన అవసరం ఉండది. బస్సులకే పోత.
సర్పంచ్‌: మా ఇంటికి రావాలే సార్, ఓ సారి..
సీఎం: మీ ఇల్లు ఎక్కడుంది?
సర్పంచ్‌: మాది ఊరి లోపలుంటది సార్‌. చిన్నది పెంకల ఇల్లు సార్‌.
సీఎం: ఆ.. ఏముంది మీ ఇంటికి వస్తా.
సర్పంచ్‌: మా ఇంటికి వచ్చి మీ బ్లెస్సింగ్స్‌ ఇచ్చి పోవాలే సార్‌.
సీఎం: నో ప్రాబ్లం. ముందో, తరువాతనో పోచేలా ప్లాన్‌ చేసుకుందాం.
సర్పంచ్‌: ఒకే సార్, సరే సార్‌.
సీఎం: దీంట్ల చిల్లర రాజకీయాలు, పార్టీలుండవు.
సర్పంచ్‌: నా దగ్గర అట్లాంటివి లేవు సార్‌.
సీఎం: నీదిగాదు నేను చెప్పేది వేరే పార్టీలోళ్లు ఉంటే గూడ ఓపికతో కలుపుకొని పోవాలే. ప్రతి ఇంటిని బాగు చేయాలనే చూస్తున్నం. వీడు, వాడు అనేదేం ఉండదు మనకు, నువ్వు మంచిగ చేస్తే, ప్రాజెక్ట్‌ మంచిగ ఇంప్లిమెంట్‌ జేస్తే నీకు మంచి ఫలితాలు ఉంటాయి.
సర్పంచ్‌: మీ దయ, బ్లెస్సింగ్స్‌ సార్‌.
సీఎం: బాగ చెయ్యి ఊరును, నీకు మంచిగుంటది.
సర్పంచ్‌: సరే సార్‌
సీఎం: అన్నం తినే జాగ, మీటింగ్‌ జాగ వేరే ఉండాలి. అర్థమైంది గద.
సర్పంచ్‌: అర్థమైంది సార్‌.
సీఎం: మీటింగ్‌ అయ్యే లోపున అన్నం తిని మీ ఇంటికి వస్తా, పబ్లిక్‌ తిని మీటింగ్‌ వచ్చే వరకల్ల మీ ఇంటికి పోయి వద్దాం.
సర్పంచ్‌: మంచిది సార్‌.