తన కోసం పనిచేసిన వారిని విజయవంతంగా చీల్చిన కేసీఆర్

Thu Oct 10 2019 21:44:41 GMT+0530 (IST)

KCR on about TS RTC Emplyees Strike

తన కోసం పనిచేసిన వాళ్లను చీల్చడంలో...తెలంగాణ ముఖ్యమంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ విజయం సాధించారా? ఒకనాడు తన వెంట నడిచిన వారిని వారి డిమాండ్ల నేపథ్యంలో...చెట్టుకొకర్ని పుట్టకొకర్ని చేస్తున్నారా? తాజా పరిణామాల నేపథ్యంలో...రాజకీయ వర్గాలు ఈ మేరకు విశ్లేషణలు చేస్తున్నాయి. ఆర్టీసీ కార్మిక సంఘాలతో ఇతర ఉద్యోగ సంఘాల భేటీ జరిగితే ఎక్కడ వారి సమస్యలపై కూడా చర్చ జరిగి - సమ్మెకు దిగుతారని ప్రచారం జరుగుతున్న సమయంలో....మరో గంటలో ఆర్టీసీ జేఏసీతో భేటీ ఉందనగా - రండి.. సమస్యలపై చర్చిద్దామంటూ టీఎన్జీవో నేతలకు ఫోన్లు వెళ్లాయి. వారు సీఎం కేసీఆర్ తో సమావేశం అయ్యారు.తెలంగాణలో ఆర్టీసీ సమ్మె జరుగుతున్న సంగతి తెలిసిందే. తమ సమ్మెకు మద్దతు ఇవ్వాలని కోరేందుకు ఆర్టీసీ కార్మికులు వారితో కలవాలని నిర్ణయించుకున్నాయి. ఇందుకోసం ఆయా సంఘాలతో మాట్లాడి టైం ఫిక్స్ చేసుకున్నాయి. సకల జనుల సమ్మెలా మరోసారి అన్ని ఉద్యోగ సంఘాలు కలిసి సమ్మెకు దిగేలా ప్లాన్ చేసుకున్నారని సమాచారం. అయితే - మరోసారి సకల జనుల సమ్మె తరహా ఉద్యమం వస్తుందన్న అనుమానంతో - దానికి బ్రేక్ వేసేందుకు కేసీఆర్ సర్కారు చకచకా పావులు కదిపింది. ఆర్టీసీ జేఏసీతో మరో గంటలో భేటీ ఉందనగా.. ఉద్యోగ సంఘాలకు సీఎంవో నుంచి ఫోన్లు వెళ్లడంతో వారు ప్రగతి భవన్ పయనమై వెళ్లారు. దీంతో ఆర్టీసీ సంఘాలతో భేటీ ఆగిపోయింది.

కాగా తమ డిమాండ్లపై ప్రభుత్వానికి విన్నవించేందుకు ఉద్యోగ సంఘాలు ఎన్ని సార్లు అపాయింట్ మెంట్ కోరినా సీఎం కేసీఆర్ కనికరించలేదని సమాచారం.  పీఆర్సీ - డీఏ పెంపుపై ఏడాదిగా టీఎన్జీవో - టీజీవో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. కానీ సీఎం కేసీఆర్ పట్టీపట్టనట్టుగా ఉన్నారు. కానీ ఆర్టీసీ సమ్మె జరుగుతున్న తరుణంలో ఇవాళ సడన్ గా వారిపై ప్రభుత్వానికి ప్రేమ పుట్టుకొచ్చిందంటున్నారు. ఉద్యోగ సంఘాలను చీల్చేందుకే..ఈ ఎత్తుగడతో ఒకనాడు సకల జనుల సమ్మెలో తనతో కలిసి నడిచిన వారిని కేసీఆర్ విజయవంతంగా చీల్చగలిగారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.