లక్షమందితో అనంతపురంలో కేసీఆర్ సభ!

Fri Dec 09 2022 17:00:01 GMT+0530 (India Standard Time)

KCR meets lakhs of people in Anantapur

ఔను.. ఇప్పుడు టీఆర్ ఎస్(ఇది బీఆర్ ఎస్గా మారింది) వర్గాల్లో ఈ మాటే వినిపిస్తోంది. త్వరలోనే సీఎం కేసీఆర్ ఏపీలోని మూడో అతిపెద్ద జిల్లా అనంతపురంలో ఆయన లక్ష మందితో బహిరంగ సభ పెడతారనే వార్త హల్చల్ చేస్తోంది. అదేంటి.. తెలంగాణను వదలేసి.. ఇక్కడ సభ పెట్టడం ఏంటి? అనే చర్చ సహజం గానే వస్తుంది. దీనికి కారణం.. ఇప్పుడు టీఆర్ ఎస్ కాస్తా.. జాతీయ పార్టీగా ఆవిర్భవించింది.ఈ ఏడాది దసరా రోజు.. టీఆర్ఎస్ను జాతీయ పార్టీ భారత రాష్ట్ర సమితిగా మారుస్తూ.. తీర్మానం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎన్నికల సంఘం తాజాగా దీనిని గుర్తిస్తూ.. పార్టీ అధినేత కేసీఆర్ కు లేఖ రాసింది. దీంతో బీఆర్ఎస్ ప్రకటన లాంఛనమే. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో వచ్చే ఎన్నికల్లో చక్రం తిప్పేందుకు కేసీఆర్కు మార్గం సుగమమైంది.

ఇప్పటి వరకు ఆయన జాతీయ స్థాయిలో ఎంతోమంది నేతలను తనదైన శైలిలో తనవైపునకు తిప్పుకొనే ప్రయత్నం చేశారు. అలానే ఇక పార్టీని దూకుడుగా ముందుకు తీసుకువెళ్లేందుకు ఇక నుంచి అడుగులు పడనున్నాయి. దీనిలో భాగంగా తొలుత.. సొంత ఇంటి నుంచి(అంటే దక్షిణాది నుంచి) తన ప్రస్థానాన్ని ప్రారంభించాలని కేసీఆర్ తలపోస్తున్నట్టు సమచారం.

దీనిలోభాగంగా.. సొంత రాష్ట్రం కాకుండా.. పొరుగున ఉన్న దాయాది రాష్ట్రం ఏపీని ఎంచుకుని..ఇక్కడ సక్సెస్ కొట్టి.. తదుపరి అడుగు కర్ణాటకలో వేసి.. అటు నుంచి మహారాష్ట్ర బిహార్ యూపీ.. తిరిగి తమిళనాడు.. అనంతరం ఢిల్లీ అటు నుంచి పంజాబ్ ఇలా.. ఒక చుట్టు చుట్టేసేలా.. టైంటేబుల్ సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. దీనిని పార్టీ వర్గాలు ధ్రువీకరించకపోయినా.. ఇదే జరుగుతుందని అంటున్నాయి.

ఇక అనంతపురం జిల్లానే కేసీఆర్ ఎంపిక చేసుకోవడం వెనుక..చిత్రమైన విషయం ఉంది. గతంలో కేసీఆర్ టీడీపీలో పనిచేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనను అనంతపురం పార్టీ ఇంచార్జ్గా నియమించారు. దీంతో ఇక్కడ ఆయన పట్టు చిక్కింది. ఇక్కడి నేతలు ఇప్పటికీ.. తరచుగా ఆయనను కలుసుకునేందుకు పార్టీలకు అతీతంగా ఉత్సాహం చూపిస్తారు.

దీంతో తన తొలిఅడుగు.. అందరూ తెలిసిన చోట వేస్తే బాగుంటుందని కేసీఆర్ తలపోస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఇక్కడ భారీ బహిరంగ సభ పెట్టి.. కనీసం లక్ష మందిని రప్పించి.. తన సభను సక్సెస్ చేయడం ద్వారా... జాతీయ స్థాయిలో తన గళాన్ని వినిపించేందుకు కేసీఆర్ రెడీ అయ్యారు.

మొత్తానికి ఒక తెలుగు నాయకుడు.. జాతీయ స్థాయిలో పార్టీ పెట్టడం ఇదే తొలిసారి.. అందునా.. మోడీ వంటి బలమైన నేతను ఢీ కొనేందుకు రెడీ అయ్యారు. దీనిని ప్రజలు కూడా అర్థం చేసుకుని.. ఆశీర్వదిస్తే.. తెలుగు వాడు ప్రధాని కావడం పెద్ద దూరంలో అయితే లేదని పరిశీలకులు అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.