నిధులు రిలీజ్ చేశాక లేట్ చేయటమా? మంచి ఛాన్స్ కేసీఆర్ సర్కార్ మిస్

Wed Dec 08 2021 12:03:29 GMT+0530 (IST)

KCR is missing a good chance

తాను ఏదైనా ఒక విషయంలో ఫిక్సు అయితే.. దాన్ని 360 డిగ్రీల్లో ఆలోచించటం.. అష్ఠదిగ్బంధనం లాంటివి చేయటం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు అలవాటన్న సంగతి తెలిసిందే.ధాన్యం కొనుగోలుపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న కేసీఆర్.. దాన్నిఅస్త్రంగా చేసుకొని కేంద్రంలోని మోడీ సర్కారును ఢీకొనాలని భావిస్తున్న వైనం తెలిసిందే. ఇందులో భాగంగా దేశ రాజధాని శివారులో జరుగుతున్న రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతు కుటుంబాలకు రూ.5లక్షలచొప్పున తెలంగాణ ప్రభుత్వం తరపున పరిహారంగా ఇవ్వాలని నిర్ణయించటం తెలిసిందే.

మాట అయితే అన్నారు కానీ.. దానికి సంబంధించిన ఫైల్ ముందుకు కదల్లేదన్న ఆరోపణలకు చెక్ చెబుతూ.. ఈ మధ్యనే నిధుల మంజూరుకు ఓకే చేశారు. నిధులు మంజూరైన వేళ.. ఢిల్లీలో ఒక పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించటం కానీ.. రైతు ఉద్యమం జరుగుతున్న వేదిక మీదనే.. బాధిత రైతుకుటుంబాలకు పరిహారం ఇవ్వటం ద్వారా.. కేసీఆర్ భారీ మైలేజీని సొంతం చేసుకుంటారని.. కేంద్రంపైన తీవ్ర ఒత్తిడిని పెంచుతారని కొందరు ఆశించారు.

నిధులు విడుదలయ్యాక.. వాటిని బాధిత కుటుంబాలకు చేర్చటం పెద్ద కష్టమైన పని కాదు. కానీ.. అలాంటిదేమీ జరగకపోవటం ఒక ఎత్తు అయితే.. తాజాగా రైతు ఉద్యమాన్ని విరమించుకుంటున్నట్లుగా రాకేశ్ తికాయిత్ నాయకత్వంలోని రైతు సంఘాలు తమ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటిస్తారని చెబుతున్నారు.

అదే జరిగితే.. ఒక చక్కటి అవకాశాన్ని టీఆర్ఎస్ అధినేత కమ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మిస్ చేసుకున్నట్లు అవుతుందన్న మాట వినిపిస్తోంది.

పరిహారం నిధులు విడుదలైనతర్వాత కూడా కేసీఆర్ అండ్ కో మౌనంగా ఉన్నారంటే.. రైతు సంఘాల నేత రాకేశ్ టికాయిత్ అందుకు సానుకూలంగా స్పందించలేదా? అన్న సందేహం వ్యక్తమవుతోంది. ఏమైనా.. నిధుల్ని విడుదల చేశాక కూడా అందుకు తగ్గ మైలేజీని సొంతం చేసుకోకపోవటం వెనకున్న కారణం ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.