Begin typing your search above and press return to search.

షర్మిలను ఓడించే అభ్యర్థిని దించబోతున్న కేసీఆర్

By:  Tupaki Desk   |   6 Dec 2022 3:30 AM GMT
షర్మిలను ఓడించే అభ్యర్థిని దించబోతున్న కేసీఆర్
X
ఇన్నాళ్లు సోదిలో లేకుండా ఉన్న వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తాజాగా తన ఆందోళనలతో వార్తల్లో నిలిచారు. పాదయాత్ర వద్ద మొదలైన లొల్లి హైదరాబాద్ ప్రగతి భవన్ ముట్టడి వరకూ సాగింది. తెలంగాణ రాజకీయాల్లో వైఎస్ షర్మిల సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారారు. తెలంగాణలో ఇప్పటివరకూ చెప్పుకోదగిన స్థాయిలో పట్టు సాధించలేకపోయిన షర్మిల ఇప్పుడు రూటు మార్చారు. నేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకున్నారు.

బీజేపీ మద్దతు షర్మిలకు ఉందంటూ టీఆర్ఎస్ కౌంటర్ ఎటాక్ చేస్తోంది. షర్మిల తాను వెనకడగు వేసే ప్రసక్తే లేదని తేల్చిచెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీచేసే నియోజకవర్గాన్ని ఇప్పటికే షర్మిల ప్రకటించారు. షర్మిల అసెంబ్లీలో ఎలా అడుగు పెడుతారో చూస్తానని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఇందుకోసం వ్యూహాత్మకంగానే షర్మిలపైన అభ్యర్థి ఎవరనేది కేసీఆర్ తేల్చేశారని సమాచారం. షర్మిలను ఓడించేందుకు కేసీఆర్ వేస్తున్న అడుగులు రాజకీయాల్లో మరింత ఆసక్తికరంగా మారింది.

వైఎస్ షర్మిల తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేయనున్నారు. ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేయనున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే పాలేరులో రెడ్డి సామాజికవర్గం అధికరంగా ఉన్నారని.. షర్మిల టీం ఇప్పటికే అక్కడ ఆమెకు మద్దతుగా పనిచేస్తోంది. ఖమ్మం జిల్లాలో పాదయాత్ర సమయంలో షర్మిల ఈ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ కేంద్రంగా పనిచేసే ఒక సర్వే సంస్థ సూచన మేరకు ఈ నియోజకవర్గం ఎంపిక చేసుకున్నారు.

పాలేరులో సామాజిక సమీకరణాలు.. గతంలో గెలిచిన వారి నేపథ్యంలో పరిశీలించిన తర్వాత తొలిసారి అసెంబ్లీకి పోటీచేస్తున్న తనకు పాలేరు కలిసి వస్తుందని షర్మిల భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఇక షర్మిలపై పోటీకి టీఆర్ఎస్ బలమైన అభ్యర్థి కోసం చూస్తోంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ హవాలోనూ ఇక్కడ కాంగ్రెస్ సీనియర్ నేత రాంరెడ్డి వెంకటరెడ్డి గెలుపొందారు. 2014లో ఆయన మరణంతో వచ్చిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీచేసిన తుమ్మల నాగేశ్వరరావు భారీ మెజార్టీతో గెలిచారు. 2018 ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి తుమ్మలను ఓడించి విజయం సాధించారు. అనంతరం కందాల ఉపేందర్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరారు.

ఇక కేసీఆర్ ఈసారి కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకొని సాగాలని చూస్తున్నారు. ఇందులో భాగంగానే పాలేరు సీటును సీపీఎంకు కు కేటాయించాలని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. పాలేరుకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేరు పార్టీలో ప్రచారం ఉంది.ఇక్కడ వామపక్షాలకు స్థిరమైన ఓటు బ్యాంకు ఉంది. ఖమ్మం ఎంపీగా పనిచేసిన తమ్మినేని పాలేరు నియోజకవర్గంలో 2009లో పోటీచేసి 58889 ఓట్లు తెచ్చుకున్నారు.

ఇక కాంగ్రెస్ , రెడ్డి సామాజికవర్గం ప్రాబల్యం ఎక్కువగా ఉన్నా టీఆర్ఎస్ , సీపీఎం కలిస్తే విజయం ఖాయమని నిర్ధారణకు వచ్చారు. షర్మిల పోటీచేస్తే ఇది రెడ్డిలు, ఇతర సామాజికవర్గాల ఏకీకరణ అవుతుందా? టీఆర్ఎస్, సీపీఎం కలిసి ఓడిస్తాయన్న నమ్మకం టీఆర్ఎస్ లో ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.