Begin typing your search above and press return to search.

నాందేడ్ లో బిల్లులపై నాలుక మడతేసిన కేసీఆర్

By:  Tupaki Desk   |   6 Feb 2023 11:01 AM GMT
నాందేడ్ లో బిల్లులపై నాలుక మడతేసిన కేసీఆర్
X
మహారాష్ట్రలోని నాందేడ్ లో బీఆర్ఎస్ రెండో సభ నిర్వహించింది. ఇది తొలి రాష్ట్రాయేతర మీటింగ్ కూడా. ఇందులో పాల్గొన్న కేసీఆర్ కేంద్రంపై విమర్శల వర్షం గుప్పించారు. సభ అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇన్నాళ్లు బీజేపీ ప్రభుత్వం భారత్ కు చేసిందేమి లేదని, చేయాల్సింది ఇంకా ఎంతో ఉందని అన్నారు. తాము బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామన్నారు. అయితే గతంలో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు బిల్లులపై ఎందుకు మద్దతు ఇచ్చారన్న ప్రశ్నలపై కేసీఆర్ చాకచక్యంగా సమాధానం ఇచ్చారు. ఓ పాత్రికేయుడు ట్రిపుల్ తలాక్ బిల్లు విషయంలో ఎందుకు ఓటింగ్ లో పాల్గొనలేదని అడిగారు. దీంతో తాము ఉద్దేశ పూర్వకంగానే ఈ బిల్లుకు దూరంగా ఉన్నామంటూ చెప్పారు. అయితే కేసీఆర్ రాజకీయ ప్రయోజనాలకే ఆ ఓటింగ్ లో పాల్గొనలేదన్న చర్చ సాగుతోంది.

బీజేపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఎన్నో బిల్లులకు కేసీఆర్ మద్దతు పలికారు. ప్రజా శ్రేయస్సు కోసం ప్రవేశపెట్టిన బిల్లులకు తాము మద్దతు ఇస్తామని బీఆర్ఎస్ నేతలు సైతం ప్రకటించారు. తెలంగాణలో బీజేపీ పుంజుకుంటున్న నేపథ్యంలో ఆ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. హైదారాబాద్ లోని జీహెచ్ఎంసీ ఎన్నికల నుంచి కేసీఆర్ బీజేపీ దూరంగా ఉంటూ వస్తున్నట్లు తెలుస్తోంది. అప్పటి వరకు దుబ్బాక ను కోల్పోయిన బీఆర్ఎస్ ఆ తరువాత జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చాలా చోట్ల ఓడిపోయింది. బీజేపీకి బలం పెరగడంతో హుజూరాబాద్ ఉప ఎన్నికలో విజయం సాధించింది. ఆ తరువాత కేసీఆర్ కేంద్రంపై పోరు మొదలు పెట్టారని రాజకీయంగా చర్చ సాగుతోంది.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చాలా బిల్లులకు కేసీఆర్ మద్దతు ఇచ్చారు. నోట్ల రద్దు నుంచి అంతర్రాష్ట్ర నదీ జలాల చట్ట సవరణ బిల్లుల వరకు బీజేపీకి సపోర్టుగా నిలుస్తూ వచ్చారు. నోట్ల రద్దు బిల్లును సమర్థించిన కేసీఆర్ ఆ తరువాత మోదీని వ్యక్తిగతంగా కీర్తించారు.

ఆ తరువాత ప్రవేశపెట్టిన జీఎస్టీ బిల్లుల విషయంలో అందరికంటే ముందుగా కేసీఆర్ అసెంబ్లీలో ఆమోదించారు. ఆ బిల్లును పాస్ చేసిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ గా రికార్డులోకెక్కింది. ఆ తరువాత ఆర్టీఐ సవరణ చట్టం, జమ్మూకాశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు బిల్లులకు కూడా కేసీఆర్ బీజేపీకి సపోర్టు చేశారు.

అయితే తెలంగాణో బీజేపీ పట్టు సాధించడంతో కేసీఆర్ కేంద్రంపై పోరు మొదలు పెట్టారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తరువాత కేసీఆర్ వైఖరిలో మార్పు వచ్చింది. ఆ సమయంలో కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను ముందుగా వ్యతిరేకించారు. రైతులు పిలుపిచ్చిన బంద్ కు బీఆర్ఎస్ నాయకులు పాల్గొనేలా ఆదేశించారు. ఈ సమయంలో ఆయన రైతులను కలుస్తారని అందరూ భావించారు. కానీ అలా చేయలేదు. ఇదే సమయంలో మోదీ, షా తో మీటింగ్ అయిన కేసీఆర్ సాగు చట్టాలకు మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. కానీ ఓటింగ్ సమయంలో వ్యతిరేకంగా ఉన్నారు.

ఇక ట్రిపుల్ తలాక్ విషయంలో కేసీఆర్ ఓటింగ్ కు దూరంగా ఉండడంపై అనేక రాజకీయ కారణాలు ఉన్నాయన్న చర్చ సాగుతోంది. ఈ ఓటింగ్ లో పాల్గొని మద్దతు ఇస్తే తెలంగాణలోని ముస్లిం ఓట్లు దూరమవుతాయని భావించారని అంటున్నారు. వ్యతిరేక ఓటు వేస్తే మహిళలు దూరమయ్యే ప్రమాదముంది. అందువల్ల ఈ బిల్లుకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తాము ఉద్దేశ పూర్వకంగానే ఓటింగ్ లో పాల్గొనలేదని, కేంద్రంపై అప్పటి నుంచే యుద్ధం చేస్తున్నామని కేసీఆర్ నాందేడ్ మీటింగ్ లో చెప్పారు. కానీ నిజంగా అప్పుడే కేంద్రంకు వ్యతిరేకంగా ఉంటే ఓటింగ్ లో పాల్గొని వ్యతిరేక ఓటు వేయాలి కదా..? అని అనుకుంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.