Begin typing your search above and press return to search.

హుజూరాబాద్ రాజకీయాన్ని మార్చేసిన కేసీఆర్

By:  Tupaki Desk   |   30 July 2021 11:29 AM GMT
హుజూరాబాద్ రాజకీయాన్ని మార్చేసిన కేసీఆర్
X
సీఎం కేసీఆర్ కు ఎప్పుడు ఎక్కడ ఎలా రాజకీయాన్ని మార్చాలో తెలిసినంతగా ఎవ్వరికి తెలియదంటారు. సమకాలీన రాజకీయాల్లో కేసీఆర్ ను మించిన రాజకీయ నాయకుడు లేడంటారు. నిన్నా మొన్నటిదాకా హుజూరాబాద్ లో ‘బీసీ రాజకీయం’ నిడిచింది. తెలంగాణ కేబినెట్ నుంచి తొలగించబడ్డ ఈటల రాజేందర్ బీసీ కావడంతో నియోజకవర్గంలో టీఆర్ఎస్ ఆయనపై బీసీనే నిలబెట్టాలని ప్లాన్ చేసింది. అయితే కేసీఆర్ అంతకుమించిన ప్లాన్ వేశారు.

బీసీనంటూ చెప్పుకుంటూ ప్రతిసారి కేసీఆర్ ను ఉద్దేశించి ‘దొరల పెత్తనం’ సహించను అంటూ విమర్శిస్తున్నారు. బీసీలను చిన్న చూపు చూస్తున్న కేసీఆర్ అని విమర్శిస్తున్నారు. బడుగులపై బ్రహ్మాస్త్రం అంటూ బీసీల ఓట్లకు ఈటల గాలం వేశారు. తన బీసీ కార్డును వాడుకొని హుజూరాబాద్ ఎన్నికల్లో కేసీఆర్ దొర అంటూ టీఆర్ఎస్ ను ఓడించే ప్లాన్ చేశారు.

అయితే హుజూరాబాద్ లో బీసీ రాజకీయం కాస్త మారిపోయింది.. కేసీఆర్ దొర అని హైలెట్ చేయాలనుకున్న ఈటలపై దళిత ద్రోహి అనే ముద్రపడేలా అధికార పార్టీ పక్కా ప్లానింగ్ తో ముందుకెళుతోంది. ఈటలను దెబ్బకొట్టేందుకు కేసీఆర్ అక్కడ ‘దళితకార్డు’ ఉపయోగించారు. దళిత బంధును హుజూరాబాద్ నుంచే ప్రకటించారు. ఆ పథకంలో దళితులకు ఏకంగా ఇంటికి రూ.10లక్షలు ప్రకటిస్తున్నారు.

ఇక దళిత బంధును ఆపాలని ఎన్నిక కమిషనర్ కు ‘ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ’ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు.దీనిపై హుజూరాబాద్ దళితుల్లో ఆందోళన మొదలైంది. వారంతా ఏకమయ్యారు. ఇక దళిత ఫోరంను ఈసీకి ఫిర్యాదు చేయించింది ఈటలనేనని.. దీనివెనుక ఈటల ఉన్నారని టీఆర్ఎస్ నేతలు విమర్శించారు. దళితులు బాగుపడితే ఈటల చూస్తూ ఉండలేకపోతున్నారని మండిపడ్డారు.

హుజూరాబాద్ నియోజకవర్గంలో నిజానికి బీసీలతోపాటు దళిత సామాజికవర్గం ఓటు బ్యాంకు కూడా బాగానే ఉంది. వారిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రధాన పార్టీలు పాకులాడుతున్నాయి. విచిత్రం ఏంటంటే వారి ఓట్లకు భారీగా గాలం వేస్తున్న పార్టీలు ఆ సామాజికవర్గ నేతలకు మాత్రం టికెట్ ఇవ్వడం లేదు. గడిచిన 25 ఏళ్లలో హుజూరాబాద్ లో దళిత అభ్యర్థి బరిలోకి దిగలేదు. పోనీ ఇప్పుడు కూడా వారిని ఉపయోగించుకుంటూ ప్రధాన పార్టీలు టికెట్ ఇచ్చిన పాపాన పోవడం లేదు.

ఈటల బీసీ నినాదం ఎత్తుకోవడంతో దళితులకు వ్యతిరేకంగా చిత్రీకరించేందుకు కేసీఆర్ ఆపసోపాలుపడుతున్నారు. దాదాపు ఈ విషయంలో అధికార టీఆర్ఎస్ సక్సెస్ అయ్యిందనే చెప్పుకొవాలి. ఇటీవల ఈటల బావమరిది చేసిన వాట్సాప్ చాటింగ్ లో దళితులను కించపరిచేలా విమర్శించాడని టీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈటల రాజేందర్ దళితులతో కాళ్లు కడిగించుకున్నారని కూడా టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. వీటికి సంబంధించిన ఫొటోలను,వీడియోలను హుజూరాబాద్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

మొత్తంగా ఇప్పుడు హుజూరాబాద్ రాజకీయం మొత్తం బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ మధ్య కుల పంచాయతీగా మారిపోయిందని అంటున్నారు. దళితులను టీఆర్ఎస్ ఓన్ చేసుకుంటే బీసీ జపాన్ని బీజేపీ పట్టుకుంది. ఇరువర్గాల దళితులను టార్గెట్ గా మార్చి రాజకీయం చేస్తున్నట్టుగా కనిపిసి్తోంది. ఈ దళిత రాజకీయంతో ఈటల రాజేందర్ డిఫెన్స్ లో పడిపోయారు. తాను బీసీనని చెప్పుకొని సింపతీతో ఓట్లు కొల్లగొట్టాలని చూసిన ఈటలకు కేసీఆర్ ప్రయోగించిన దళిత కార్డు గుదిబండగా మారింది. ఇప్పుడు ఈటల వర్సెస్ కేసీఆర్ పోరు కాస్తా బీసీ, దళిత వర్గాల మధ్య సామాజిక చిచ్చుకు కారణమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.