Begin typing your search above and press return to search.

మోడీ సర్కారుపై కేసీఆర్ బహిష్కరణాస్త్రం

By:  Tupaki Desk   |   8 Dec 2021 8:38 AM GMT
మోడీ సర్కారుపై కేసీఆర్ బహిష్కరణాస్త్రం
X
ముందుగా అనుకున్నట్లే.. అధినేత దిశానిర్దేశానికి ఏ మాత్రం తీసిపోని రీతిలో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ధాన్యం కొనుగోలు విషయంలో తాము చెప్పినట్లుగా చేయని కేంద్రం తీరును ఎండగట్టాలని.. ప్రజాక్షేత్రంలో వారి నిర్వాకాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పటం ద్వారా.. తమ మీద వచ్చే వ్యతిరేకతను బీజేపీ మీదకు.. ప్రధాని మోడీ నాయకత్వంలోని కేంద్రం మీదకు మళ్లించాలన్న గులాబీ బాస్ కమ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకున్నట్లే తాజా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సోమవారం నాటి పార్లమెంటు సమావేశాల్ని బహిష్కరించిన టీఆర్ఎస్.. తాము ఈ సెషన్ జరిగే వరరకు సభలో పాల్గొనమని స్పష్టం చేశారు.

బీజేపీకి తాము పూర్తి వ్యతిరేకమని.. రానున్న రాష్ట్రపతి.. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లోనూ బీజేపీని వ్యతిరేకిస్తామని.. దేశానికి మంచి చేసే అంశం ఏదైనా ఉన్నప్పుడు ప్రభుత్వానికి మద్దతు ఇస్తామన్న మాట టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేకే నోటి నుంచి రావటం గమనార్హం.

అంటే.. మోడీ ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించిన సమయంలోనూ.. మొత్తంగా కాకుండా.. దేశ ప్రయోజనాల పేరుతో ఒక అవకాశాన్ని సజీవంగా నిలుపుకోవటం విశేషం. మోడీ ప్రజా వ్యతిరేకి.. రైతు వ్యతిరేకి అంటూ ధ్వజమెత్తుతూనే.. పార్లమెంటులో ఎన్డీయేకు మెజార్టీ ఉండటంతో అప్రజాస్వామికంగా.. నిరంకుశంగా వ్యవహరిస్తున్నారంటూ కేకే మండిపడ్డారు.

ఈ తీరు ప్రజాస్వామ్యానికే ప్రమాదమని.. దీనికి ప్రత్యామ్నాయంగా ప్రజలతో తిరుగుబాటు చేయించటమేనని.. తాము అదే చేయబోతున్నట్లుగా కేకే పేర్కొన్నారు. ఇప్పటి నుంచి ప్రధాని మోడీ దిగిపోవాలన్నదే తమ నినాదంగా పేర్కొన్నారు.

మోడీ ప్రభుత్వమంత దుర్మార్గమైన ప్రభుత్వం ఇంకొకటి ఉండదని.. తాము ఏంమాట్లాడినా గోడతో మాట్లాడినట్లు.. గోడకు తల పగలగొట్టుకున్నట్లే అనిపిస్తోందన్నారు. ఈ పరిస్థితుల్ని చూసి రైతు అంశాలపై మాట్లాడనివ్వరన్న భయం వేస్తోందన్నారు.

తాము సభలో నిరసన చేపట్టినా.. ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. అందుకే.. ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతోనే పార్లమెంటును బహిష్కరించాలని నిర్ణయించామన్నారు.

పార్లమెంటును దిగ్బంధిస్తామని చెప్పి.. ఇప్పుడు అర్థాంతరంగా ఆందోళల్ని ముగిస్తున్నారేంటన్న ప్రశ్న అడిగితే.. దానికి కేకే ఇచ్చిన సమాధానం ఏమంటే.. ‘చరిత్ర ఇంకా ముగియలేదని.. తర్వాత ఏం జరుగుతుందో చరిత్ర పూర్తి అయిన తర్వాతే తెలుస్తుంది’ అని వ్యాఖ్యానించారు. ఈ చరిత్రేందో? అన్న మాటకు అర్థం కాలమే బదులివ్వాలి.