Begin typing your search above and press return to search.

ఛాన‌ళ్ల‌కు కేసీఆర్ మార్క్ వార్నింగ్‌!

By:  Tupaki Desk   |   12 July 2018 4:43 AM GMT
ఛాన‌ళ్ల‌కు కేసీఆర్ మార్క్ వార్నింగ్‌!
X
అంత త్వ‌ర‌గా నిర్ణ‌యాలు తీసుకోన‌ట్లుగా క‌నిపిస్తూనే.. మెరుపు వేగంతో పావులు క‌దిపి నిర్ణ‌యాల మీద నిర్ణ‌యాలు తీసుకునే చిత్ర‌మైన ధోర‌ణి తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ లో క‌నిపిస్తుంటుంది. వివాదాల విష‌యంలో పెద్ద‌గా స్పందించ‌న‌ట్లుగా.. క‌లుగ‌జేసుకోన‌ట్లుగా ఉండే కేసీఆర్‌..అన్ని విష‌యాల్ని ఓ కంట క‌నిపెడుతూనే.. తొంద‌ర ప‌డ‌కూడ‌ద‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తూ ఉంటారు. అయితే.. ఉత్సాహం కాస్తా అత్యుత్సాహంగా మారి.. సంచ‌ల‌నాల కోసం దేనికైనా రెఢీ అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న వేళ‌..కేసీఆర్ ఎంట‌ర్ కావ‌టం.. షాకుల మీద షాకులు ఇవ్వ‌టం మామూలే. తాజాగా అలాంటి ప‌నే మ‌రోసారి చేశారు కేసీఆర్‌.

మ‌త విద్వేషాలు రెచ్చ‌గొట్టేలా వ్య‌వ‌హ‌రించే వారి విష‌యంలో ప్ర‌భుత్వం క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌న్న విష‌యాన్ని తేల్చి చెప్పింది కేసీఆర్ స‌ర్కారు. ఇటీవ‌ల ఒక ఛాన‌ల్‌నిర్వ‌హించిన చ‌ర్చ‌లో శ్రీ‌రాముడి మీద సినీ విమ‌ర్శ‌కుడు క‌త్తి మ‌హేశ్ ఫోన్ ఇన్ లో అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌టం.. దీనిపై పెను దుమారం రేగ‌టం.. ప‌లు పోలీస్ స్టేష‌న్ల‌లో కేసులు న‌మోదు కావ‌టం తెలిసిందే.

క‌త్తి వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్ గా స్వామి ప‌రిపూర్ణానంద నిర‌స‌న యాత్ర చేప‌డ‌తాన‌న్న వ్యాఖ్య‌ల‌తో వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా వేడెక్కింది. మ‌రోవైపు.. మ‌తాల్ని కించ‌ప‌రిచేలా.. కొంద‌రి మ‌నోభావాల్ని దెబ్బ తీసేలా కొన్ని ఛాన‌ళ్లు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై కేసీఆర్ స‌ర్కారు గుర్రుగా ఉన్న‌ట్లు గెలుస్తోంది. మ‌త విద్వేషాలు.. భావోద్వేగాలురెచ్చ‌గొట్టేలా కార్య‌క్ర‌మాల్ని ప్ర‌సారం చేసిన ఛాన‌ళ్ల‌పై క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌న్న అంశంపై సీఎం కేసీఆర్ ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన‌ట్లు చెబుతున్నారు.

అభ్యంత‌ర‌క‌ర అంశాల‌పై వార్త‌ల్ని ప్ర‌సారం చేసే టీవీ ఛాన‌ళ్ల‌పై వివిధ సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు చేయాల‌ని.. ఛాన‌ళ్ల ప్ర‌సారాల‌పైనా నిఘా పెట్టాల‌ని.. వారి కంటెంట్ మీద ప్ర‌త్యేక దృష్టి పెట్టాల‌ని పేర్కొన‌ట్లు తెలుస్తోంది. టీవీ ఛాన‌ళ్ల‌తో పాటు.. మ‌త విద్వేషాల్ని పెంచేలా ఉండే వార్త‌ల విష‌యంలోనూ పోలీసులు దృష్టి సారించాల‌ని కేసీఆర్ చెప్పిన‌ట్లుగా స‌మాచారం. ఛాన‌ళ్లు.. ప‌త్రిక‌లు.. వెబ్ కంటెంట్ మీద కూడా పోలీసులు ప్ర‌త్యేక దృష్టి సారించాల‌ని పోలీసు ఉన్న‌తాధికారుల‌కు స్ప‌ష్టంగా చెప్పిన‌ట్లు తెలుస్తోంది. తాజా నిర్ణ‌యం నేప‌థ్యంలో గ‌తంలో మాదిరి ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా చ‌ర్చ‌లు పెట్టే విష‌యంలోనూ.. మ‌తానికి సంబంధించిన వార్త‌ల్ని ప్ర‌సారం చేసే విష‌యంలో ఛాన‌ళ్లు జాగ్ర‌త్త వ‌హించాల్సిందే. లేదంటే.. చ‌ర్య‌లు ఎదుర్కొనేందుకు సిద్ధం కావాల్సిందే.