కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో కేసీఆర్పై ఒత్తిడి పెరుగుతోంది. జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పుతానంటున్న కేసీఆర్ ఆయన పార్టీ బీఆర్ఎస్ కర్ణాటక ఎన్నికలలో ఎలాంటి పాత్ర పోషించబోతున్నాయన్నది చర్చనీయమవుతోంది. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఈ ఏడాదే ఉండనుండడంతో అంతకంటే ముందు జరుగుతున్న కర్నాటక ఎన్నికలు కేసీఆర్కు పరీక్ష పెట్టడం ఖాయమన్న వాదన ఒకటి వినిపిస్తోంది.
లెక్క ప్రకారమైతే ఇప్పుడు జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తరువాత తెలంగాణ ఎన్నికలు మరో ఆర్నెళ్ల సమయం ఉంటుంది. అయితే కేసీఆర్ తన టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చినప్పుడు కర్ణాటకలోనూ పోటీచేయాలని.. అక్కడి జేడీఎస్తో కలిసి నడవాలన్న భావన వ్యక్తంచేశారు. అయితే ఆ తరువాత రెండు పార్టీల మధ్య దీనికి సంబంధించి ఎలాంటి చర్చలు జరగలేదు.
కానీ కర్ణాటకలో తెలుగువారు ఎక్కువ ఉన్న సరిహద్దు నియోజకవర్గాలలో పోటీ చేస్తామన్న సంకేతలు బీఆర్ఎస్ నుంచి వచ్చాయి. అయితే ఇప్పుడు మాత్రం తగినంత సమయం లేదన్న సాకుతో కర్నాటక ఎన్నికలకు దూరంగా ఉండాలని కేసీఆర్ నిర్ణయించినట్లు చెప్తున్నారు.
నిజానికి కర్ణాటకలో పోటీ చేసి అభాసు పాలైతే అది ఆ తరువాత తెలంగాణ ఎన్నికలపై ప్రభావం చూపుతుందన్న భయం ఆయనలో ఉందంటున్నారు. అందుకే కర్ణాటక ఎన్నికలలో పోటీ చేయకుండా జేడీఎస్ తరఫున ప్రచారానికి తన ఎమ్మెల్యేలు ఒకరిద్దరు మంత్రులను పంపిస్తే చాలని కేసీఆర్ భావిస్తున్నారట.
కర్ణాటకలోని 224 అసెంబ్లీ నియోజకవర్గాలకు మే నెల ప్రారంభంలో ఎన్నికలు జరగనున్నాయి. మే 10న పోలింగ్ నిర్వహించి 13న ఫలితాలు వెల్లడించేలా ఎన్నికల కమిషన్ ఈ రోజు షెడ్యూల్ కూడా విడుదల చేసింది.
నెల పదిహేను రోజుల సమయమే ఉండడంతో అక్కడ పోటీ చేసినా డిపాజిట్లు కూడా రావని బీఆర్ఎస్ నేతలే అంటున్నారు. అందుకే... కర్ణాటక ఎన్నికలకు దూరంగా ఉంటామని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.