Begin typing your search above and press return to search.

నేను అన్నం పెడితే..జగన్ నా ప్రాజెక్టులపై సున్నం పెడతాడా - కేసీఆర్ సీరియస్

By:  Tupaki Desk   |   10 Aug 2020 4:09 PM GMT
నేను అన్నం పెడితే..జగన్ నా ప్రాజెక్టులపై సున్నం పెడతాడా - కేసీఆర్ సీరియస్
X
జగన్ ప్రభుత్వంపై తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వంతో తమకు సత్సంబంధాలు ఉన్నాయని, కానీ తెలంగాణ హక్కుల విషయంలో రాజీలేదని మంత్రి కేటీఆర్ చెప్పిన మరుసటి రోజే కేసీఆర్ స్పందించారు. తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ అర్థంపర్థంలేని నిరాధారమైన ఆరోపణలు చేస్తోందన్నారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులపై ఏపీ కేంద్రానికి ఫిర్యాదు చేయడంపై అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. కేంద్రం కూడా తప్పుడు విధానం అవలంభిస్తోందన్నారు. కేసీఆర్ నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కేంద్ర జల్‌శక్తి లేఖ, అపెక్స్ కౌన్సిల్ భేటీపై చర్చించారు. ఈ సందర్భంగా కేసీఆర్ అధికారులకు సూచనలు చేశారు.

అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో సమర్థవంతమైన వాదనలు వినిపించాలన్నారు. వాస్తవాలు, సంపూర్ణ సమాచారంతో కేంద్రం, ఆంధ్రప్రదేశ్‌కు సరైన సమాధానం చెప్పాలన్నారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులపై ఫిర్యాదు చేయడం ఏమిటని ప్రశ్నించారు. తనంత తానే ఏపీ ప్రభుత్వ పెద్దలను పిలిచి, పీటవేసి అన్నం పెట్టి మరీ మాట్లాడానని, ఇరు రాష్ట్రాల రైతులు, ప్రజల ప్రయోజనం కోసం స్నేహంగా ముందుకు సాగుదామని చెప్పానని, బేసిన్లు లేవి, భేషజాలు లేవని స్పష్టంగా చెప్పానని, సముద్రంపాలవుతున్న నీటిని రైతుల పొలాలకు మళ్లించే దిశగా ముందుకు సాగుదామని చెప్పానని, అయినప్పటికీ ఏపీ కయ్యం పెట్టుకునే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతోందన్నారు.

నిర్మాణంలోని ప్రాజెక్టులపై నిరాధార ఆరోపణలతో ఫిర్యాదు చేసిందన్నారు. అపెక్స్ కమిటీలో ఏపీ ప్రభుత్వం నోరు మూయిస్తామని, అర్థంలేని వారి వాదనలను తిప్పి కొడదామన్నారు. మన ప్రాజెక్టుల గురించి ఏపీ మరోసారి మాట్లాడకుండా చేయాలన్నారు. తెలంగాణ నీటి వాటా ప్రకారమే ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని, వీటిపై అభ్యంతరాలు సరికాదన్నారు. శ్రీశైలం నుండి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు నీటి విడుదల చేసే అంశాన్ని కూడా కేంద్రం అభ్యంతర పెడుతోందన్నారు. వాస్తవానికి నాగార్జున సాగర్ నిండిన తర్వాతే మిగతా ప్రాజెక్టులు నింపాలని, శ్రీశైలం ప్రాజెక్టు నీటి పారుదల ప్రాజెక్టు కాదని, అది జల విద్యుత్ ప్రాజెక్టు అన్నారు. వీటిని కేంద్రం పరిగణలోకి తీసుకోవాలని హితవు పలికారు. రాష్ట్రాల హక్కులను కేంద్రం హరించడం సరికాదన్నారు. కేంద్రం వైఖరిని యావత్ దేశానికి తెలియజేస్తామన్నారు.

కృష్ణా, గోదావరి బేసిన్‌లలో తెలంగాణ వాటా ప్రకారమే ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోందన్నారు. రాష్ట్ర విభజన నాటికే ఈ ప్రాజెక్టులు మంజూరయ్యాయని, నీటి కేటాయింపులు కూడా పూర్తయ్యాయని, అనుమతులు వచ్చాయన్నారు. ఈ ప్రాజెక్టులకు దాదాపు రూ.23వేల కోట్లు ఖర్చయ్యాయని, 31,500 ఎకరాల భూసేకరణ జరిగిందని, ఇంత జరిగాక ప్రాజెక్టులను నిలిపివేయాలనడం సరికాదన్నారు. సమైక్య రాష్ట్రంలోనే పలు ప్రాజెక్టులు మంజూరయినప్పటికీ పూర్తి చేయకపోవడమే కాకుండా తక్కువ నీటితో ఎక్కువ ఆయకట్టును ప్రతిపాదించారన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మన హక్కులు, అవసరాలు, వాటా ప్రకారమే రీడిజైన్ చేసి ప్రాజెక్టులు నిర్మిస్తున్నామన్నారు. తెలంగాణ ఉద్యమం రావడానికి నీటి వాటా కూడా ఓ ప్రధాన కారణమన్నారు.

కాళేశ్వరం, సమ్మక్క సాగర్, సీతారామ ప్రాజెక్టు, సీతమ్మ సాగర్‌లను రీడిజైన్ చేసి నిర్మిస్తున్నామని, పెన్ గంగ ప్రాజెక్టుకు 1975లో ఒప్పందం కుదిరిందని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టులకు ఎప్పుడు అనుమతులు వచ్చాయి, ఎంత ఖర్చు చేశారు, ఎప్పుడు మంజూరయ్యాయి, ఏమేం అనుమతులు వచ్చాయి, భూసేకరణ, జీవోలు.. ఇలా అన్నింటిని అపెక్స్ కమిటీలో ముందుంచాలని అధికారులకు సూచించారు. గతంలో మొదటి అపెక్స్ కౌన్సిల్‌లో ఏపీ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై అభ్యంతరం వ్యక్తం చేసిందని, దీంతో తెలంగాణ ఏపీలోని ముచ్చుమర్రిని ప్రస్తావించిందని, చివరకు రెండింటిని కొనసాగించాలని నిర్ణయించాక, ఏపీ కొత్త పంచాయతీని తీసుకు వస్తోందన్నారు. సాగునీటికి సంబంధించి తెలంగాణకు మొదటి నుండి అన్యాయం జరుగుతోందన్నారు. ఉమ్మడి ఏపీలో నీటి వాటా అడిగే సమయంలో తెలంగాణను పరిగణలోకి తీసుకోలేదని స్వయంగా గ్రహించిన ట్రైబ్యునల్ ప్రత్యేకంగా తెలంగాణకు నీటిని కేటాయించిందన్నారు. వాస్తవానికి గోదావరి మిగులు జలాల్లో మరో వెయ్యి టీఎంసీలు దక్కాల్సి ఉందన్నారు. ఆ నది ప్రవాహం తెలంగాణలోనే ఎక్కువ అన్నారు. తెలంగాణకు అవసరాలు కూడా ఉన్నాయన్నారు.