Begin typing your search above and press return to search.

కేసీయార్ గ్రాండ్ ఇన్విటేషన్... వచ్చేది ఎవరంటే...?

By:  Tupaki Desk   |   15 Jan 2022 1:09 PM GMT
కేసీయార్ గ్రాండ్ ఇన్విటేషన్... వచ్చేది ఎవరంటే...?
X
కేసీయార్ రాజకీయ చాణక్యుడు. ఎత్తులు బాగా వేయగల దిట్ట. వచ్చే ఏడాది చివరలో తెలంగాణాలో ఎన్నికలు రాబోతున్నాయి. దాంతో కేసీయార్ ముచ్చటగా మూడవసారి తెలంగాణాలో గెలిచేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. అదే టైమ్ లో జాతీయ యవనిక మీద గులాబీ జెండా గర్వంగా ఎగిరేలా చేసేందుకు భారీ కసరత్తు మొదలెట్టారు. గతంలో బీజేపీ మీద కారాలూ మిరియాలూ కేసీయార్ నూరినా కూడా మోడీ ఇమేజ్ ముందు అవన్నీ పనిచేయలేదు.

ఇపుడు బీజేపీ గాలి పూర్తిగా తగ్గింది అని నిర్ధారణకు వచ్చాకనే కేసీయార్ హస్తినతో ఫైట్ అంటున్నారు. మోడీతో ఢీ అని కూడా చెబుతున్నారు. ఇవన్నీ ఇలా ఉండగానే తొందరలోనే హైదరాబాద్ వేదికగా భారీ స్థాయిలో జాతీయ సదస్సుని నిర్వహించడానికి కేసీయార్ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు అని అంటున్నారు.

ఈ జాతీయ సదస్సు యాంటీ మోడీ కాన్సెప్ట్ మీదనే సాగుతుందిట. ఈ సదస్సునకు దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీల అధినేతలను పిలుస్తారు అని అంటున్నారు. ఒక విధంగా దేశంలో మూడవ ఫ్రంట్ కి ఇది శ్రీకారం చుట్టే మీటింగ్ గా చెబుతున్నారు.

ఇక యాదాద్రి ఆలయ పునఃప్రారంభోత్సవాన్ని మార్చిలో నిర్వహించనున్నారు. ఆ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రాంతీయ పార్టీల నేతలను అందరినీ ఒకచోట చేర్చాలని కేసీయార్ ఆలోచిస్తున్నారుట. అంటే ఉత్తరాదిన ఎన్నికలు మార్చి 7తో పూర్తి అయి మార్చి 10న ఫలితాలు వస్తాయి. వాటి తరువాత ఈ జాతీయ సదస్సు నిర్వహిస్తే ఆ ఎఫెక్ట్ గట్టిగా ఉంటుంది అంటున్నారు. మొత్తానికి కేసీయార్ జాతీయ సదస్సు మీద బాగానే ప్రచారం సాగుతోంది.

గతంలో ఎన్టీయార్ దేశంలోని నాయకులను, పార్టీలను కలిపి తెలుగు నేల మీద అనేక సదస్సులు పెట్టారు. ఆ తరువాత చాలా కాలానికి కేసీయార్ మళ్లీ అలాంటి ప్రయోగం చేయబోతున్నారు అని అంటున్నారు. మరి ఈ కృషిలో కేసీయార్ ఎంతవరకూ సక్సెస్ అవుతారో చూడాలి. ఇంతకీ కేసీయార్ గ్రాండ్ ఇన్విటేషన్ ని అందుకునేవారు ఎవరో ఏమిటో ఆ కధా కమామీషూ ఏమిటి అన్నది కూడా ఇపుడు ఆసక్తిని కలిగిస్తున్న అంశంగా ఉంది.