మోడీషాలకు షాకుల మీద షాకులిస్తున్న కేసీఆర్

Fri Dec 13 2019 10:26:35 GMT+0530 (IST)

KCR Gives Shock To Narendra Modi and Amit Shah over Citizenship Bill

ఎప్పుడు స్నేహం చేయాలో.. ఎప్పుడు కటీఫ్ అన్నట్లుగా సంకేతాలు ఇవ్వాలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు బాగా తెలుసు. ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గుతూ తన పనిని తాను కోరుకున్న రీతిలో పూర్తి చేసుకునే విషయంలో గులాబీ బాస్ చాణుక్యం కాస్త భిన్నంగా ఉంటుందని చెబుతారు. అప్పుడప్పుడు విమర్శలు చేసుకుంటూ.. ఢిల్లీలో భుజాలు రాసుకుపూసుకు తిరిగే కేసీఆర్ తాజాగా మోడీషాలకు వరుస పెట్టి ఇస్తున్న షాకులు ఆసక్తికరంగా మారాయి.గత సమావేశాల్లో బీజేపీ సర్కారు విషయంలో టీఆర్ఎస్ అనుసరించిన వైనానికి.. తాజాగా జరుగుతున్న సమావేశాల సందర్భంగా టీఆర్ఎస్ ఎంపీలు వ్యవహరిస్తున్న తీరు ఆసక్తికరంగా మారింది. ట్రిపుల్ తలాక్.. ఆర్టికల్ 370.. సమాచార హక్కు చట్టానికి సవరణల విషయంలో మోడీ ప్రభుత్వానికి తనదైన మద్దతును ఇచ్చిన టీఆర్ఎస్.. తాజాగా తెర మీదకు తెచ్చిన పౌరసత్వ బిల్లుపైన ఉభయ సభల్లో నిరసన ప్రదర్శన చేయటం.. వ్యతిరేకంగా ఓటు వేయటం తెలిసిందే.

ఎందుకిలా చేస్తున్నట్లు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ట్రిపుల్ తలాక్ విషయంలో ఒకలా వ్యవహరించిన కేసీఆర్.. పౌరసత్వ బిల్లు విషయంలో మాత్రం కరకుగా ఉండటానికి కారణం ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది. ట్రిపుల్ తలాక్ విషయంలో ముస్లిం మహిళలు సానుకూలంగా ఉన్న విషయాన్ని గుర్తించిన కేసీఆర్.. దానికి అనుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు.

పౌరసత్వ బిల్లును విషయానికి వస్తే ముస్లింలు అందరూ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నది గుర్తించిన ఆయన.. ఈ విషయంలో తన స్టాండ్ ను స్పస్టం చేయటం ద్వారా మైనార్టీ నేతలకు తాను నమ్మకమైన వ్యక్తిగా ఇమేజ్ తెచ్చే ప్రయత్నం చేసినట్లుగా చెబుతున్నారు. మరి.. ఈ తీరు మోడీషాలకు కోపం వచ్చేలా చేయదా? అన్న ప్రశ్నను సంధిస్తున్నారు.

ఎప్పుడెలా వ్యవహరించాలి? తనకు అవసరమైన వేళ.. ప్రతికూలతల్ని సానుకూలంగా మార్చుకోవటం ఎలానో కేసీఆర్ కు బాగా తెలుసు. ఆ ధీమాతోనే తాజా బిల్లు విషయంలో మోడీషాలకు వ్యతిరేకంగా వ్యవహరించినట్లుగా తెలుస్తోంది. కేంద్రం మీద కేసీఆర్ వ్యతిరేకత తాత్కాలికమైనదే తప్పించి దీర్ఘకాలం సాగేది కాదంటున్నారు. గురి చూసి కొట్టే విషయంలో గులాబీ బాస్ తప్పులు చేయరని.. అంతలోనే సర్దుకున్నట్లుగా వ్యవహరించి కేంద్రంతో కలిసిపోయే తీరును ఆయన త్వరలోనే ప్రదర్శిస్తారంటున్నారు. మరీ అంచనాలు ఏ మేరకు నిజమవుతాయన్నది కాలమే చెప్పాలి.