శాఖలు తేలాక..మంత్రుల నిర్ణయం !

Sun Jan 13 2019 13:09:56 GMT+0530 (IST)

KCR Gives Responsibility To Selection Of Cabinet Ministers To KTR

తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఇంకా పెండింగ్ లోనే ఉంది. ఎవరికి తోచిన విధంగా వారు మంత్రివర్గ విస్తరణ తేదీలను ఖరారు చేసుకుంటున్నారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు మాత్రం వీటికి భిన్నంగా ఆలోచిస్తున్నారు. గత సంప్రదాయాలకు విరుద్ధంగా తెలంగాణ క్యాబినెట్ ఉండాలన్నది చంద్రశేఖర రావు ఆలోచనగా ఉంది. ఇందుకోసం ఆయన భారీ కసరత్తు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర సమితి వర్గాలు చెబుతున్నాయి. ఇంతకుముందు ఏ పార్టీ అధికారంలో ఉన్నా మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించేవారు. ఆ తర్వాత వారి వారి అర్హతలను బట్టి శాఖలను కేటాయించేవారు. గత ప్రభుత్వంలో కూడా ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఇదే విధానాన్ని అవలంభించారు. అయితే ఈసారి మాత్రం ఇందుకు భిన్నంగా ముందుగా ఎవరికి ఏ శాఖ లు కేటాయించాలి అన్న విషయాన్ని తేలుతున్నారు. ఎవరికి ఏ శాఖ ఇస్తారో తెలియక వారి చేత నేరుగా ప్రమాణస్వీకారం చేయించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆలోచనగా చెబుతున్నారు. ఇందుకోసం ఆయన ఇటీవల గెలిచిన శాసనసభ్యులు విద్యార్హతలు - గతంలో వారి పనితీరు వంటి అంశాలపై పూర్తిస్థాయి నివేదికలు తెప్పించుకుంటున్నారు.ఈ నివేదికల ఆధారంగానే శాసనసభ్యుల్లో కొందరికి మంత్రి పదవులు కట్టబెడతారని అంటున్నారు. ఈ నివేదికల రూపకల్పన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు - తన కుమారుడు కల్వకుంట్ల తారక రామారావు కు అప్పగించినట్లు సమాచారం. గత క్యాబినెట్ లో మంత్రులుగా ఉన్న వారిలో తక్కువ మందికి ఈ సారి అవకాశం వస్తుంది అంటున్నారు. ముఖ్యంగా గత క్యాబినెట్ లో మహిళలకు అవకాశం ఇవ్వలేదు. దీంతో ఈసారి స్పీకర్ పదవి తో పాటు మరో మంత్రి పదవి కూడా మహిళలకు దక్కే అవకాశం ఉందంటున్నారు. అయితే ఇది కూడా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కే తారకరామారావు ఇచ్చే నివేదిక పైన ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు.

ఈ నెల 18న మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రచారం జరుగుతున్నా నివేదికలు పూర్తి అయిన తర్వాత మాత్రమే మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందంటున్నారు. సంక్రాంతి అనంతరం ఈ నెలాఖరున గాని - ఫిబ్రవరి మొదటి వారంలో గానీ తెలంగాణ మంత్రి వర్గాన్ని విస్తరించే అవకాశం ఉందంటున్నారు. పైగా తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా మంత్రివర్గాన్ని ఫిబ్రవరి మొదటి వారంలోనే విస్తరించవచ్చు అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సామాజిక సమీకరణాలు - సీనియర్ శాసనసభ్యులు - యువకులు - మహిళలు ఇలా అన్ని వర్గాలను సంతృప్తి పరిచేలా తన క్యాబినెట్ విస్తరణ జరగాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు భావిస్తున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది.