చచ్చినోళ్లకే భరోసా.. బతికున్నోళ్లకు ఏదీ!

Wed Sep 23 2015 05:00:01 GMT+0530 (IST)

KCR 6 Lakhs ex gratia to Farmers Victims Families

తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు కేసీఆర్ సర్కారు ఆరులక్షల రూపాయల వంతున ఎక్స్‌గ్రేషియా అందించాలని ఒక నిర్ణయం తీసుకుంది. ఒక కోణంలో చూసినప్పుడు.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అభినందించాల్సిందే. అయితే ఇలాంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకోవడం ద్వారా వారి లక్ష్యం ఏమిటి? ఏం ఆశించి ఇంత భారీ నిర్ణయం ఎక్స్ గ్రేషియా అందించేలా నిర్ణయం తీసుకున్నారు. అయితే తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు మాత్రం ఆగడం లేదు. ఒక రకంగా సంఖ్య పెరుగుతున్నదా అనే అనుమానం కలుగుతున్నది.ఇక్కడే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద కొన్ని అనుమానాలు కలుగుతున్నాయి. ఎలాగంటే.. ప్రభుత్వం ప్రకటించిన సాయం అనేది.. మరణిచడానికి భరోసా ఇస్తున్నట్లుగా కనిపిస్తున్నది తప్ప.. జీవించడానికి భరోసా ఇస్తున్నట్లుగా లేదని కొందరు వాదిస్తున్నారు. ఆరు లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ద్వారా.. ప్రతి రైతు కుటుంబానికి 5 లక్షల రూపాయల వంతున ఇవ్వాలని అంటున్న విపక్షాల నోర్లు మూయించేందుకు సర్కారు ప్రయత్నిస్తున్నదే తప్ప.. నిజంగా రైతుల కష్టాలు తొలగిపోవాలని వారికి జీవితం మీద ఆశ పుట్టాలని నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా కనిపించడం లేదు.

విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత.. సీఎం కేసీఆర్ నిర్వహించిన కేబినెట్ భేటీ కూడా... జీవితం మీద రైతుల్లో ఆశ పుట్టించడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో పెద్దగా చర్చించకుండానే ముగిసినట్లుగా అనిపించింది. రైతుల సంక్షేమం కోసం అన్ని చర్యలూ తీసుకుంటున్నాం.. అనే పడికట్టు వాక్యాలు తప్ప.. నిర్దిష్టంగా.. వారికి మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడానికి లేదా.. ఇతరత్రా ఉన్న అప్పుల విషయంలో స్థానికంగా వాటి వసూళ్లను వాయిదా వేయించేలా చొరవ చూపించడం గానీ.. ఎలాంటి చర్యలకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. కానీ చనిపోతే 6 లక్షలు ఇస్తాం అని మాత్రం ప్రకటించింది. తద్వారా.. రైతుగా జీవించడం కంటె.. మరణించడమే కుటుంబానికి ఎక్కువ లాభసాటి అనే భావనను ప్రభుత్వం సమాజంలోకి తీసుకువెళ్లిందా అనే విమర్శలు వస్తున్నాయి. ఈ విమర్శల్ని తిప్పి కొట్టాలంటే.. వాస్తవంగా రైతులకు జీవితంపై ఆశకల్పించేలా.. వారికి ఎలాంటి సంక్షేమ నిర్ణయాలు తీసుకోవాలో స్వయంగా రైతు అయిన కేసీఆర్ ఆలోచించాలి.