Begin typing your search above and press return to search.

జోక్ కాదు నిజం.. అమిత్ షాతో కేఏ పాల్ భేటీ.. ఏం చెప్పారంటే?

By:  Tupaki Desk   |   13 May 2022 5:13 AM GMT
జోక్ కాదు నిజం.. అమిత్ షాతో కేఏ పాల్ భేటీ.. ఏం చెప్పారంటే?
X
కేఏ పాల్ అన్నంతనే కామెడీ పీస్ గా చాలామంది భావిస్తుంటారు. ప్రధాన మీడియా సంస్థల్లో అయితే.. ఆయన మీద చేసే వ్యాఖ్యలకు తగ్గట్లే.. ఆయన వార్తలకు ఇచ్చే ప్రాదాన్యత చాలా తక్కువగా ఉంటుంది. ప్రింట్ మీడియా కేఏ పాల్ ను పట్టించుకోదు. అందుకు భిన్నంగా టీవీ చానళ్లు.. డిజిటల్ మీడియా మాత్రం ఆయనకు పెద్ద పీట వేస్తుంటుంది. ఆయనకు సంబంధించిన వివరాల్ని వార్తాంశాలుగా అందిస్తూ ఉంటుంది. ఎందుకిలా? అంటే.. ఎవరు నమ్మినా నమ్మకున్నా.. కేఏపాల్ కు సంబంధించిన వార్తలు.. ఆయన మాట్లాడే మాటల్ని వినేందుకు తెలుగు ప్రజలు ఆసక్తిని ప్రదర్శిస్తుంటారు.

ఆయన మాటల్ని సీరియస్ గా తీసుకుంటారా? కామెడీగా తీసుకుంటారా? లాంటి చర్చను పక్కన పెట్టేస్తే.. ఒకటి మాత్రం వాస్తవం.. ఆయన్ను.. ఆయన మాటల్ని ప్రజలైతే ఒక కంట కనిపెడుతూ.. ఒక చెవిన వేసుకోవటం కనిపిస్తూ ఉంటుంది. నోరు తెరిస్తే చాలు.. ఆ దేశ ప్రధానితో భేటీ అయ్యా? ఆ దేశ ఇష్యూను సాల్వ్ చేశానని చెప్పే మాటల్ని విన్నప్పుడు ఎక్కువ చేస్తున్నట్లుగా అనిపిస్తుంటుంది.

కానీ.. తాజాగా ఆయన చేసిన పని చూస్తే.. మాటలే కాదు చేతల్లోనూ పాల్ లెక్క వేరుగా ఉంటుందని చెప్పాలి. తాజాగా ఆయన అమిత్ షాతో భేటీ అయ్యారు. ఇది చదివిన వెంటనే మేమేదో ఫ్రాంక్ చేస్తున్నట్లు అనుకోవద్దు. నిజంగానే ఆయన షాతో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయన కుమారుడు కేటీఆర్ లు దాడి చేయించారన్నారు. ఈ దాడి పరిణామాల్ని వారు త్వరలోనే చూస్తారన్నారు. తెలంగాణలో జరుగుతున్న అవినీతి.. అక్రమాలను తన జీవితంలో ఎప్పుడూ చూడలేదన్నారు. అమిత్ షాతో తాను చెప్పిన పలు విషయాల్నిఆయన మీడియాకు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్.. కేటీఆర్ అవినీతి కారణంగా రూ.లక్షల కోట్లు మాయమయ్యాయన్నారు.

ఆంధ్రప్రదేశ్ అప్పు రూ.8లక్షల కోట్లు ఉంటే.. తెలంగాణ అప్పు రూ.నాలుగున్నర లక్షలకోట్లు ఉండేదన్నారు. ఇలానే అప్పులు చేసుకుంటూ పోతే.. దేశం మరో శ్రీలంకగా మారుతుందన్నఅభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

తెలంగాణ డీజీపీని టైం అడిగితే ఇవ్వలేదని.. తనను కలిసేందుకు ఆయన సమయం ఇవ్వలేదని.. కానీ కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసేందుకు తాను సమయం అడిగిన వెంటనే ఇచ్చారన్నారు. ప్రధాని మోడీని కలవాలని తనకు అమిత్ షా సూచించారన్నారు. మొత్తానికి త్వరలోనే కేఏ పాల్.. ప్రధానమంత్రి మోడీని కలవనున్నారన్న మాట.