పట్ట భద్రుల ఎన్నికల్లో వైసీపీ ఓటమి పై ఉద్యోగ సంఘాల హాట్ కామెంట్స్!

Mon Mar 20 2023 20:00:01 GMT+0530 (India Standard Time)

Job unions' hot comments on YCP's defeat in graduate elections!

ఏపీలో మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీ ఓటమి పై ఉద్యోగ సంఘాల నేతలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటర్లను తాము ప్రభావితం చేయలేదని చెప్పారు. ఓటర్లను ప్రభావితం చేశామనడం అర్థరహితమని తెలిపారు. తాము తమకు రావాల్సిన హక్కులను మాత్రమే అడుగుతున్నామన్నారు. ప్రభుత్వ పాలసీలను కూడా తాము తప్పపట్ట లేదని వెల్లడించారు. ఈ మేరకు ఏపీ జేఏసీ అమరావతి నేతలు స్పష్టం చేశారు.



అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా తాము బ్లాక్ మెయిల్ చేయలేదని.. తమకు రావాల్సిన ప్రయోజనాలను మాత్రమే తాము అడుగుతున్నామని ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. తమకు హక్కుగా ప్రభుత్వం నుంచి రావాల్సినవాటినే తాము అడుగుతున్నామని వివరించారు.  పీఆర్సీ జీపీఎఫ్ ల విషయంలో తప్ప ఎప్పుడూ ప్రభుత్వాన్ని తప్పుబట్టలేదన్నారు. తమకు న్యాయబద్ధంగా రావాల్సిన వాటినే తాము అడుగుతున్నామని తెలిపారు.

ప్రభుత్వం తమకు బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ మార్చి 9 నుంచి  ఏప్రిల్ 5వ తేదీ వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతామని చెప్పామని ఉద్యోగ సంఘాల నేతలు గుర్తు చేశారు. అందుకే తాము ఎమ్మెల్సీ ఎన్నికల రోజు కౌంటింగ్ రోజు కూడా నల్ల బ్యాడ్జీలు ధరించామని తెలిపారు. అయితే తాము ఓటర్లను ప్రభావితం చేయడానికే నల్ల బ్యాడ్జీలు ధరించామనడం సరికాదని చెప్పారు. ఈ విషయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ వైసీపీ అభ్యర్థి రవీంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉద్యోగ సంఘాల నేతలు ఖండించారు.

వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రవీంద్రారెడ్డి తండ్రి వెన్నపూస గోపాల్ రెడ్డి అంటే తమకు చాలా గౌరవం ఉందని ఉద్యోగ సంఘాల నేతలు వ్యాఖ్యానించారు. కానీ రవీంద్రారెడ్డి అన్న వ్యాఖ్యలు తమను బాధపెట్టాయన్నారు. నల్ల బ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహించే విషయాన్ని తాము ముందే ప్రకటించామన్నారు. జిల్లా కలెక్టర్ కు కూడా ముందే చెప్పామని గుర్తు చేశారు. మీకు అన్యాయం జరిగిందని భావిస్తే న్యాయపరంగా వెళ్లవచ్చని కలెక్టర్లు కూడా సూచించారని తెలిపారు.

తమ నిరసనల్లో భాగంగా మార్చి 21 నుంచి వర్క్ టూ రూల్ పాటిస్తున్నామని ఏపీ జేఏసీ అమరావతి నేతలు తెలిపారు. ఇందులో భాగంగా ఉదయం 10 గంటల నుంచి 5.30 గంటల వరకు మాత్రమే విధుల్లో ఉంటామన్నారు. మార్చి 30వతేదీ లోపు పెండింగ్ లో ఉన్న బిల్లులు వేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని గుర్తు చేశారు. సీఎం జగన్ పాదయాత్ర లో చెప్పిన ఏ హామీ నెరవేర్చలేదని ఉద్యోగ సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యలపై స్పందించాలని కోరారు. తమవి గొంతెమ్మ కోర్కెలు కాదని.. హక్కులు మాత్రమేనని స్పష్టం చేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.