ప్రజావేదిక కూల్చివేత..జేపీ లాజిక్ మరిచారు..

Wed Jun 26 2019 13:46:31 GMT+0530 (IST)

ప్రజావేదిక కూల్చివేత.. అక్రమమా..? సక్రమమా..? 8.9 కోట్ల ఏపీ ప్రజల ధనాన్ని వెచ్చించి చంద్రబాబు కట్టించిన అక్రమ నిర్మాణం ఇదీ.. దీన్ని కూలగొడితే గుండెలు బాదేసుకుంటున్నారు టీడీపీ నేతలు.. కొందరు సామాజిక వాదులు. అయితే ఇందులోని అసలు తంత్రాన్ని మాత్రం గ్రహించకపోవడం నివ్వెరపరుస్తోంది.తాజాగా లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ ప్రజావేదిక కూల్చివేతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్రిటీష్ హయాంలో కట్టారని పార్లమెంట్ ను మన వాళ్లు కూల్చేశారా? ఇప్పుడు చంద్రబాబు అక్రమంగా కట్టారని.. అన్ని కోట్ల ప్రజాధనాన్ని కూలగొడతారా అని ప్రశ్నించారు. తెల్లవాళ్లు కట్టారని పార్లమెంట్ భవనాన్ని నాటి ప్రభుత్వాలు కూల్చలేదని.. వలస రాజ్యానికి ప్రతీకలు అయినప్పటికీ ప్రజాధనం దుర్వినియోగం కావద్దనే కారణంతోనే వాటిని వాడుతున్నారని జేపీ చెప్పుకొచ్చారు. స్వాతంత్ర్యం వచ్చాక నేటి వరకు ఎవరూ ఈ తరహా నిర్ణయాలు తీసుకోలేదని.. అక్రమ నిర్మాణం అని.. నదీ పరివాహన ప్రాంతంలో నిర్మాణం చేపట్టారని కూల్చడం సహేతుక కారణం కాదని.. ప్రజలను ఒప్పించి ఆ భవనం కూల్చివేత వల్ల కలుగుతున్న ప్రజా ప్రయోజనాలను చూపి ఆ భవన నిర్మాణానికి అయిన ఖర్చును .. లాభనష్టాలను బేరీజు వేసుకొని చేస్తే బాగుంటుందని హితవు పలికారు.

అయితే జేపీకి కూడా అంతుచిక్కని భూకబ్జాల కుంభకోణం దీనివెనుక ఉందని వైసీపీ నాయకులు చెబుతున్నారు. కృష్ణా  నదీ కరకట్ట మీద ఈ ప్రజావేదిక.. దాని పక్కనే ఉన్న చంద్రబాబు నివాసాలు అక్రమంగా రైతులను బెదిరించి తీసుకున్నవని.. నిబంధనలకు విరుద్ధమని వైసీపీ భావిస్తోంది. ఇదే కాదు.. రైతుల వందల ఎకరాలను కృష్ణ కరకట్ట వెంట నేతలు కబ్జాలు చేశారు. తాజాగా ప్రజావేదిక  భూమి తమ నుంచి లాక్కున్నారని రైతులు అధికారులకు ఓ ఫిర్యాదును దాఖలు చేశారు. అంతేకాదు.. వీటికి చేరడానికి నిర్మించిన రోడ్డును కూడా కబ్జా చేశారట.. ఇంత అక్రమంగా భూములు కాజేసి.. రైతులను మోసం చేసి కొల్లగొట్టిన ఆస్తులను జగన్ ప్రభుత్వం కూలుస్తోంది. అంతేకాదు.. అమరావతి పేరిట ఇలా వందలాది మంది రైతుల నోట్లో మన్ను కొట్టి కొల్లగొట్టిన వందలాది భూములున్నాయి. వాటిలో నిర్మాణాలున్నాయి. ఒక్క ప్రజావేదికే కాదు.. వందలాది మంది మూడు పంటలు పండే రైతుల జాగాలను గత ప్రభుత్వంలో కబ్జా చేశారని.. వాటన్నింటిని కూలగొడుతామని తాజాగా వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రకటించారు.

ఇదే కాదు.. విశాఖ - ఇతర జిల్లాల్లో కూడా అధికార టీడీపీ నేతలు అక్రమంగా కొల్లగొట్టిన భూములను - అందులోని నిర్మాణాలను కూలగొట్టి అర్హులైన ఆ రైతులకే ఇచ్చేందుకు జగన్ నిర్ణయించారు. ఇందుకోసం సీఎం చంద్రబాబు నివాసం పక్కనే కట్టిన అక్రమ నిర్మాణాన్నే కూల్చి రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ అక్రమదారులకు హెచ్చరికలు పంపారు.

ప్రజావేదిక కూల్చివేతపై రచ్చ చేస్తున్న జయప్రకాష్ నారాయణ్ సహా టీడీపీ నేతలు ఆ భూములు కోల్పోయిన రైతుల బాధలను ఒక్కసారి కూడా విన్న దాఖలాలు లేవు. వందలాది ఎకరాలను రాష్ట్రవ్యాప్తంగా కొట్టేసిన వారికి హెచ్చరికగానే జగన్ ఈ కూల్చివేతల యజ్ఞాన్ని చంద్రబాబు ఇంటిపక్కనుంచే మొదలు పెట్టారు. రైతులకు న్యాయం చేస్తున్న ఈ మహాకార్యాన్ని సపోర్టు చేయాల్సింది పోయి విమర్శించడం జేపీ లాంటి మేధావులకు తగదని వైసీపీ శ్రేణులు కౌంటర్ ఇస్తున్నాయి. 8కోట్ల బిల్డింగే కానీ.. దానికి ఆనుకొని వందల కోట్ల అక్రమ భూ కబ్జాలున్నాయని.. ఎంతో మంది రైతులు భూములు కోల్పోయి రోడ్డున పడ్డారని.. వాటిని కూలగొట్టి రైతులకు పంచేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని వైసీపీ నేతలు కూల్చివేత రాజకీయాలపై స్పష్టతనిస్తున్నారు.