ఆత్మకూరు ఫలితంపై జనసేన సైలెంట్.. రీజనేంటి..?

Wed Jun 29 2022 08:49:32 GMT+0530 (IST)

Janasena Silent on Atmakuru Outcome .. What is the Reason ..?

ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరులో జరిగిన ఉప ఎన్నికలో వైసీపీ ఒంటరి విజయం నమోదు చేసింది. ప్రధానపార్టీలు ఈ ఎన్నికలకు దూరంగా ఉండడం సింపతీ ఎక్కువగా కనిపించడంతో 82 వేల పైచిలుకు ఓట్లతో వైసీపీ అభ్యర్థి విక్రమ్ రెడ్డి విజయం సాధించారు. అదేసమయంలో బీజేపీ ఇక్కడ పోటీ చేసినప్పటికీ.. భారీ సంఖ్యలో మాజీ మంత్రులను తెచ్చి క్యాంపు రాజకీయాలు చేసినా.. ఆ పార్టీ కనీసం డిపాజిట్లు దక్కించుకోలేక పోయింది.అయితే.. 2019 ఎన్నికల్లో కన్నా.. ఇప్పుడు మెరుగైన ఓట్లు సాధించామని ఆ పార్టీ నాయకులు సంతృప్తి వ్యక్తం చేయడం మినహా వారికి మిగిలింది ఏమీ లేదు. ఇదిలావుంటే.. బీజేపీ మిత్రపక్షం జనసేన ఈ ఫలితంపై ఇప్పటి వరకు పెదవి విప్పలేదు. బీజేసీ డిపాజిట్లు కోల్పోవడం సహా.. వైసీపీ విజయంపైనా జనసేన నాయకులు ఎవరూ ఇప్పటి వరకు ఎలాంటి కామెంట్లు చేయలేదు. దీనిని బట్టి.. బీజేపీని వదిలేసుకున్నట్టేనా.. అనే సందేహాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

పైగా తమ తరఫున ఇక్కడ జనసేన కూడా ప్రచారం చేస్తుందని బీజేపీ నాయకులు ప్రకటించారు. కానీ జనసేన అధినేత పవన్ కానీ.. ఇతర నాయకులు కానీ.. ఇక్కడ ప్రచారం చేయలేదు. ఇది బీజేపీకి మైనస్‌గా మారింది. అలాగని..

జనసేనపై బీజేపీ నాయకులు ఎవరూ విమర్శలు చేయకపోగా.. తాము కలిసే ఉన్నామని.. వచ్చే ఎన్నికల్లో కలిసే పోటీకి దిగుతామని.. బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్‌రెడ్డి చెప్పారు. కానీ జనసేన నుంచి అలాంటి సంకేతాలు కనిపించడం లేదు.

అదేవిధంగా ఇప్పటి వరకు జరిగిన తిరుపుతి బద్వేల్ ఉప ఎన్నికల్లోనూ బీజేపీ ఘోర పరాజయం మూట గట్టుకుంది. ఆ ఎన్నికల్లోనూ బీజేపీ డిపాజిట్లు సంపాయించుకోలేదు. ఈ పరిణామాలను బట్టి.. జనసేన బీజేపీకి చాన్స్ లు ఇస్తోందని.. రేపు బీజేపీతో కటీఫ్ చేసుకునేందుకు ఈ ఎన్నికల ఫలితాలను చూపించే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

"మీకు ఓటు బ్యాంకు కూడా లేదు. మీతో చేతులు కలిపి మేం సాధించేది ఏముంటుంది?" అని రేపు జనసేన అడిగే అవకాశం ఉంటుందని.. అందుకే ఇప్పుడు మౌనంగా ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. మరి ఏంజ రుగుతుందో చూడాలి.