Begin typing your search above and press return to search.

మాజీలే టార్గెట్ : జనసేన పిలుస్తోంది.... కదలిరా...

By:  Tupaki Desk   |   2 July 2022 12:30 PM GMT
మాజీలే టార్గెట్ : జనసేన పిలుస్తోంది.... కదలిరా...
X
ఇప్పటికి పద్నాలుగేళ్ళ క్రితం ఒక సంచలన వాతావరణంలో ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం జరిగింది. నాడు వెండి తెర వేలుపు. నంబర్ వన్ స్టార్ అయినా చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ప్రజారాజ్యం పార్టీ ప్రకటనతో ఏపీలో ఆ రోజు ఎక్కడ చూసినా మోత మోగింది. ప్రజారాజ్యంలో బలమైన నాయకులు అంతా చేరిపోయారు. కాంగ్రెస్ టీడీపీల పట్ల విరక్తి గా ఉన్న వారే కాదు, తమ సామాజికవర్గానికి చెందిన వారు సీఎం కావాలన్న బలమైన ఆకాంక్షతో చాలా మంది ప్రధాన పార్టీలను వీడారు.

ఒక విధంగా ప్రజారాజ్యం సూపర్ హిట్ కావాల్సిందే. కానీ వచ్చింది రాంగ్ టై,. అటు వైఎస్సార్, ఇటు మహాకూటమి కట్టిన చంద్రబాబు ఉండగా ఆయన నడిమధ్యలో దిగారు. ఇంకో వైపు చూస్తే తెలంగాణా ఉద్యమం పీక్స్ లో ఉంది. ఇలా కాని కాలంలో దిగిన ప్రజారాజ్యం పొలిటికల్ బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది.

దానికి స్వీయతప్పిదాలతో పాటు కలసిరాని రాజకీయం కూడా ప్రధాన కారణాలు అయ్యాయి. ఆ ప్రజారాజ్యం పార్టీనే 2014 దాకా కంటిన్యూ చేస్తే ఏమయ్యేదో ఏమో కానీ ఆ కసి తనలో దాచుకుని జనసేనను పవన్ కళ్యాణ్ స్థాపించారు. ప్రజారాజ్యంలో యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ దూకుడు చేశారు. అలా ప్రజారాజ్యం నేతలు అందరితో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

సీన్ కట్ చేస్తే 2014 ఎన్నికల్లో పవన్ పోటీ చేసి ఉంటే ప్రజారాజ్యం నేతలకు జనసేన సరైన రాజకీయ వేదిక అయ్యేది. కానీ ఆయన ఆ ఎన్నికలలో టీడీపీ, బీజీపీలకు మద్దతు మాత్రమే ఇచ్చి ఊరుకున్నారు. ఇక 2019 నాటికి ఆయన సొంతంగా పోటీ చేసినా మాజీ పీయార్పీ నేతలు టీడీపీ వైసీపీలలో అప్పటికే సర్దుకున్నారు. దాంతో బలమైన నాయకులు లేకుండానే ఎన్నికలను ఫస్ట్ టైమ్ జనసేన ఫేస్ చేయాల్సి వచ్చింది.

ఇక 2024లో ఎన్నికలు రాబోతున్నాయి. మూడేళ్ళ కాలంలో జనసేన సంస్థాగతంగా ఎత్తిగిల్లింది లేదు. అదే టైమ్ లో పొత్తుల మీద జనసేన పెద్దలు ఆశలు పెట్టుకుని ఉండి ఉంటారు అని కూడా అనుకోవాలి . తీరా ఇపుడు చూస్తే టీడీపీ ఆలోచనలు మారుతున్నాయి. దాంతో పొత్తు లేకపోతే ప్లాన్ బీ అంటూ ఉండాలి కదా అన్న ఆలోచనలు ఇపుడిపుడే వస్తున్నాయట. చూస్తే సమయం గట్టిగా రెండేళ్ళు లేదు.

ఈ షార్ట్ పీరియడ్ లో సంస్థాగతంగా బలపడడం అంటే కష్టమైన విషయం. దాంతో ఇపుడు మాజీ పీయార్పీ నేతల మీద జనసేన చూపు మళ్ళింది అంటున్నారు. బలమైన సామాజికవర్గం పట్ల అభిమానం, మెగా ఫ్యామిలీ మీద నమ్మకం ఉన్న వారు ఏ పార్టీలో ఉన్నా జనసేన వైపుగా మళ్ళించాలన్న ప్లాన్ బీలో ఆ పార్టీ ఉంది అంటున్నారు.

కనీసం జిల్లాకు ఒకరిద్దరు బలమైన నేతలు ఉంటే రానున్న ఎన్నికల్లో సొంతంగా పోటీ చేసినా బలాన్ని చాటుకోవచ్చు అన్న కొత్త వ్యూహాలను జనసేన రచిస్తోంది. ఇందులో భాగంగా కాపులకు ఐకాన్ లాంటి దివంగత నేత వంగవీటి మోహన రంగా కుమారుడు వంగవీటి రాధాను జనసేనలో చేర్చుకోవాలని చూస్తున్నారు.

ఆయన టీడీపీలో ఉన్నా ఇమడలేకపోతున్నారు. వైసీపీ వైపు మళ్ళీ రావాలని ఆయన మిత్రులు కొడాలి నాని, వల్లభనేని వంశీలు కోరుతున్నా మనస్కరించడంలేదు. దాంతో ఆయన చూపు జనసేన వైపు ఉందని అంటున్నారు. రంగా కుమారుడు కనుక జనసేనలో చేరితో కోస్తాలో పార్టీకి కొత్త ఊపు వస్తుందని ఆ పార్టీ భావిస్తోంది. అలాగే రాధా కూడా తాను స్టేట్ వైడ్ లీడర్ గా ఫోకస్ అవడానికి ఆ పార్టీ వేదిక అవుతుంది అని భావిస్తున్నారుట. ఈ క్రమంలో ఈ నెల 4న తన తండ్రి 75వ జయంతి వేడుకలను రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్నారు.

దానికి జనసేన నుంచి పవన్ కళ్యాణ్ ని పిలిచారు. దీనికి ముందు బెజవాడ వీధుల్లో రాధా పవన్ ఫ్లెక్సీలు కూడా వెలిశాయి. అంటే దాని అర్ధం జనసేన న వైపుగా ఆయన పయనం అవుతున్నారు అన్న సంకేతాలు ఇవ్వడమే అంటున్నారు. ఇక రాధా కనుక జనసేనలో చేరి బోణీ కొడితే కోస్తా జిల్లాల‌లో ఆయన మరింతమందిని పార్టీలో చేర్పిస్తారు అని కూడా జనసేన వర్గాలు విశ్వసిస్తున్నాయి. ఇంకో వైపు చూస్తే ఈ రోజున వైసీపీలో ఉన్న మాజీ పీయార్పీ నేతలు ఎన్నికల వేళకు జనసేన గూటికి చేరే చాన్స్ ఉందని అంటున్నారు.

అలాగే టీడీపీ నుంచి కూడా కొందరు నేతలు ఈ వైపుగా చూస్తారని చెబుతున్నారు. ఇన్నాళ్ళూ వాళ్లే తమ వైపునకు రావాలి అని కాస్తా బెట్టుగా ఉన్న జనసేన ఇపుడు మెట్టు దిగి పిలుస్తోంది. మీరు రావాలి, మాతో చేతులు కలపాలి అని కోరుతోంది. మరో వైపు ఆ సామాజికవర్గం నుంచి కూడా నేతలకు పిలుపులు వెళ్తున్నాయట. ఇదంతా చూస్తూంటే ప్రజారాజ్యం ఆవిర్భావం ముందు ఏ రకమైన తెర వెనక కసరత్తు జరిగిందో ఇపుడు అలాంటిదే జరుగుతోంది అంటున్నారు. మరి దీని ఫలితాలు ఏంటి అన్నది కొద్ది నెలలు ఆగితేనే కానీ స్పష్టం అవదని చెప్పాలి.