జనసేనాని ఈ కొత్త కార్యక్రమం ప్రజలకు దగ్గర చేస్తుందా?

Wed Jun 29 2022 12:00:01 GMT+0530 (IST)

Janasena New Program Jana Vani

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ దూకుడు పెంచారు. ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వినూత్న కార్యక్రమాలతో ప్రజల ముందుకు వెళ్తున్న ఆయన మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. జనవాణి పేరుతో కొత్త కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ఇందులో భాగంగా జనసేనాని పవన్ కల్యాణ్ ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలపై అర్జీలను స్వీకరిస్తారని ఆ పార్టీ చెబుతోంది. ప్రజా సమస్యలను ప్రభుత్వానికి చేరవేసేలా సామాన్యుడి గళానికి బలానిచ్చేలా జనవాణి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపింది.జనవాణి కార్యక్రమంలో భాగంగా వచ్చే ఐదు ఆదివారాలు పవన్ కల్యాణ్ ప్రజలకు ప్రత్యక్షంగా అందుబాటులో ఉంటారు. ప్రజలు వివిధ అంశాలపై వారి సమస్యలు వినతులకు సంబంధించిన అర్జీలను స్వయంగా పవన్ కల్యాణ్ కు అందించివచ్చని ఆ పార్టీ చెబుతోంది.

ఇందులో భాగంగా తొలివిడత జనవాణి కార్యక్రమాన్ని జూలై 3న విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో నిర్వహిస్తారు. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పవన్ కళ్యాణ్ ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలపై అర్జీలు స్వీకరిస్తారని జనసేన పార్టీ తెలిపింది.

ఇక రెండో ఆదివారం కూడా విజయవాడలోనే జనవాణి కార్యక్రమం ఉంటుందని జనసేన పార్టీ చెబుతోంది. మూడో ఆదివారం నాలుగో ఆదివారం ఐదో ఆదివారం జనవాణి కార్యక్రమాన్ని వరుసగా ఉత్తరాంధ్ర రాయలసీమ ఉభయగోదావరి జిల్లాల్లో నిర్వహిస్తారు. అక్కడ కూడా పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్వయంగా పాల్గొంటారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారు.

రాజకీయాలకు అతీతంగా సామాన్యుడికి న్యాయం జరగాలన్న ఆకాంక్షతోనే ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశామని జనసేన పార్టీ చెబుతోంది. జనవాణి కార్యక్రమంలో బాగంగా జనసేనాని పవన్ కల్యాణ్ స్వీకరించే ప్రతి అర్జీకి రసీదు ఇస్తామని తెలిపింది.

అర్జీలు స్వీకరించిన రోజు సాయంత్రమే ఆ సమస్యలను సంబంధిత అధికారులకు చేరవేస్తామని వెల్లడించింది. ఆ తర్వాత ఆ సమస్యల పరిష్కారం ఎంతవరకో వచ్చిందో తమ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచే ఫాలో అప్ చేస్తామని తెలిపింది.