జనసేన అప్డేట్ : చేరికలు లేవు... జోష్ వచ్చెదెలా...?

Mon Jun 27 2022 23:00:01 GMT+0530 (India Standard Time)

Janasena In Andhrapradesh

జనసేన పార్టీ ఏర్పాటు అయి ఎనిమిదేళ్ళు పైదాటింది. ఇప్పటిదాకా చూస్తే ఆ పార్టీని ఒంటి చేత్తో పవన్ కళ్యాణ్ నడిపిస్తున్నారు. ఆయన పక్కన 2018 నుంచి మరో నేతగా నాదెండ్ల మనోహర్ ఉన్నారు. జనసేన అంటే ఈ ఇద్దరే అన్న భావన ఏర్పడింది. ఇక జిల్లాలలో చూస్తే గట్టి నాయకులు ఎవరూ కనిపించడంలేదు. పవన్ కళ్యాణ్ ఈ మధ్య పర్చూర్ సభలో కొత్త వారికి చాన్స్ ఇస్తామని చెప్పారు అలాగే నవతరం రాజకీయాల్లోకి రావాలని కూడా పేర్కొన్నారు.అయితే కొత్తవారే అందరూ ఉంటే సరిపోదు  పార్టీకి పాత కొత్త కలయిక ఉండాలి. అలాగే రాజకీయంగా ఢక్కా మెక్కీలు తిన్న వారు ఉండాలి. ఎన్నిక ఎన్నికకూ  స్వరూప స్వభావాలు మారుతున్నాయి. ఎన్నికల్లో గెలుపే ప్రధానం అయిన నేపధ్యంలో ఎంతకైనా తెగించే విధంగా నాయకులు ఉన్నారు. దాంతో ఢీ అంటే ఢీ కొట్టే నాయకులు ఉండాలి.

ఇంకో వైపు చూస్తే జనసేనకు 2019 ఎన్నికల ముందు కొంత ఊపు వచ్చింది. టీడీపీ నుంచి వైసీపీ నుంచి కూడా నాడు కొందరు నాయకులు చేరారు తీరా పార్టీ ఓడగానే వారంతా ఏమయ్యారో తెలియడంలేదు. గుంటూరు జిల్లా నుంచి మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు చేరి జనసేన తరఫున పోటీ చేశారు. ఓడాక బీజేపీలోకి వెళ్ళిపోయారు. ఇపుడు ఆయన అక్కడ కూడా లేరు. '

విశాఖ జిల్లాలో చూస్తే మరో  మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు జనసేనలో చేరి పాడేరు నుంచి పోటీ చేశారు. ఇపుడు ఆయన వైసీపీలో ఉన్నారు. ఇలా చాలా మంది నాయకులు మాజీ ఎమ్మెల్యేలు అంతా కూడా వెనక్కు పోయారు. గత మూడేళ్ళుగా సీనియర్ నాయకులు ఎవరూ రావడంలేదు. దీంతో జనసేనలో  చేరికలు లేకుండా నిలిచిపోయాయని అంటున్నారు.

ఇంకో వైపు చూస్తే పవన్ కళ్యాణ్ పొత్తుల గురించి అనవసరంగా కెలికి రచ్చ చేసుకున్నారని పొత్తులు ఉంటాయన్న ఆలోచనతో ఇతర పార్టీల నుంచి చేరికలు లేకుండా పోయాయని అంటున్నారు. పైగా టీడీపీతో జనసేన పొత్తులు అంటే టీడీపీలో చేరేందుకు వైసీపీ నేతలు మొగ్గు చూపిస్తున్నారు అన్నది కూడా ప్రచారంలో ఉన్న మాట.

దాంతో పార్టీని పటిష్టం చేయాలంటే సీనియర్లు ప్రతీ జిల్లాలో నియోజకవర్గంలో అవసరంగా ఉంది. పర్చూర్ సభలో పవన్ కళ్యాణ్ అయితే జనంతోనే పొత్తులు అని మాట్లాడరు దాంతో కొంతమంది మొగ్గు చూపుతారు అని అనుకున్నా ఆ తరువాత హైదరాబాద్ లో జరిగిన పార్టీ మీటింగులో పొత్తుల గురించి ఇపుడే మాట్లాడవద్దు నేను దాని మీద మాట్లాడుతాను అని చెప్పడంతో పొత్తులు ఉంటాయన్న సందేశం మళ్ళీ వినిపించినట్లు అయింది.

ఈ రకంగా అయోమయమైన పరిస్థితులలో జనసేన రాజకీయ అజెండా ఉండడంతో ఇతర పార్టీల నుంచి రావాలనుకున్నా నేతలు రాకుండా ఉండిపోతున్నారు అని అంటున్నారు. ఇక జనసేనలోకి చేరాలని ఆసక్తి కనబరచిన నాయకులకు ఎందుకో అక్కడ నుంచి పిలుపులు రాలేదని కూడా చెబుతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు జనసేనలో చేరడానికి చూసినా కూడా ఎందుకో చేరలేకపోయారు. దీనికి పవన్ చుట్టూ ఉన్న కొందరు నాయకులే కారణం అని చెబుతున్నారు.

గంటా లాంటి బిగ్ షాట్ వస్తే తమ పని అయిపోతుందని అభద్రతాభావంతోనె ఆయన్ని రానీయలేదని ప్రచారం కూడా ఉంది. ఇంకో వైపు చూస్తే పవన్ బస్సు యాత్రకు రంగం సిద్ధం అవుతోంది. ప్రతీ చోటా అభిమానులు ఉన్నా యాత్ర సక్సెస్ ఫుల్ గా సాగాలీ అంటే బలమైన నాయకులు అవసరం అంటున్నారు. మరి పవన్ బస్సు యాత్రలో అయినా పెద్ద ఎత్తున కదలిక వచ్చి భారీగా చేరికలు ఉంటాయా అన్నది చూడాలి.