Begin typing your search above and press return to search.

ఇందిర ఫోన్ కాల్ తో ఎన్టీయార్ ని ఎదిరించిన జమున!

By:  Tupaki Desk   |   28 Jan 2023 6:00 AM GMT
ఇందిర ఫోన్ కాల్ తో ఎన్టీయార్ ని ఎదిరించిన జమున!
X
ఎన్టీయార్ తెలుగుదేశం పార్టీ పెట్టి అప్రతిహతంగా వెలిగిపోతున్న రోజులు అవి. ఎన్టీయార్ మాటే శాసనం. ఆయనతో పుట్టిన తెలుగుదేశం పార్టీదే కొత్త రాజకీయం. అప్పటిదాకా ఏలిన కాంగ్రెస్ కి ముతక రాజకీయం అయిపోయింది. ఎందుకూ పనికిరాకుండా పోయింది. జనాలు కాంగ్రెస్ ని పక్కన పెట్టేశారు. ఎంత పెద్ద నాయకులు అయినా ముఖ్యమంత్రులుగా చేసిన వారు అయినా ఢిల్లీ స్థాయిలో ఎంతటి బడా నాయకులు అయినా ఎన్టీయార్ ముందు ఎక్కడా అసలు ఆనేవారే కాదు.

ఒక విధంగా 1983లో తెలుగుదేశం అఖండమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చిన తరువాత కాంగ్రెస్ పని అయిపోయింది ఇక మళ్ళీ మనుగడ లేదు అన్న వారే ఎక్కువగా ఉన్నారు. సరిగ్గా ఆ టైం లో ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ ప్రెసిడెంట్, నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఏపీ మీద సీరియస్ గా ఫోకస్ పెట్టారు. ఎన్టీయార్ సినీ గ్లామర్ ని ఢీ కొట్టే వారు కావాలని ఆమె ఏపీకి చెందిన కాంగ్రెస్ ప్రముఖులకు గట్టిగా చెప్పారు.

ఇక అప్పటికే మద్రాస్ నుంచి హైదరాబాద్ కి షిఫ్ట్ అయి సినిమాలతో పాటు సేవా కార్యక్రమాలు చేస్తూ జమున బిజీగా ఉన్నారు. ఆమె ఆనాటికే అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్న టైం లో ఏపీ నాటక అకాడమి చైర్ పర్సన్ గా అధికార పదవిని కూడా తీసుకుని పనిచేసి ఉన్నారు. కాంగ్రెస్ పెద్దలతో ఆమెకు మంచి అనుబంధం ఉండేది. అలా ఆనాటి కాంగ్రెస్ సీనియర్ కోన ప్రభాకరరావు ఇందిరాగాంధీకి జమున పేరుని చేరవేశారు. ఆమె ఎన్టీయార్ కి ధీటైన లీడర్ అని చెప్పడంతో ఇందిరమ్మ నేరుగా జమునకు ఫోన్ చేయించి తనను కలవమని చెప్పారు

అలా ఇందిరమ్మను ఢిల్లీలో కలసి వచ్చిన తరువాత జమున వెండి తెర క్రిష్ణుడు ఎన్టీయార్ మీద రాజకీయ రంగంలో అపర సత్యభామ అవతారం ఎత్తి ఎదురు నిలిచి పోరాడారు. 1983 నుంచి 1989 వరకూ ఏడేళ్ల పాటు కాంగ్రెస్ పక్షాన అలుపెరగని పోరాటమే జమున చేశారు. ఎన్టీయార్ మీద ఘాటైన విమర్శలు చేయడం ద్వారా కాంగ్రెస్ ఉనికిని చాటారు. ఎన్టీయార్ కి సమవుజ్జీ అయిన నాయకురాలిగా నాడు ఆమె నిలిచారు.

ఎన్టీయార్ పార్టీ ప్రభుత్వ విధానాలను తెగ ఎండగట్టారు. జమున స్వతహాగా మంచి వక్త. ఆమె ప్రసంగాలు బాగా ఉండేవి. దాంతో ఆమె మహిళా కాంగ్రెస్ తరఫున టీడీపీని ధీటుగా ఎదుర్కొన్నారు. ఎన్టీయార్ ని దేవుడుగా జనాలు కొలిచే నాటి రోజులలో ఆయన వ్యవహార శైలి గురించి కూడా జనాలకు అదే సినీ సీమ నుంచి వచ్చిన నటీమణిగా జమున వివరించి తెలుగుదేశం సినీ గ్లామర్ ని బాగా తగ్గించడంలో కీలక పాత్ర పోషించారు. అలా జమున ఇందిరాగాంధీ తరువాత రాజీవ్ గాంధీ మన్ననలూ పొందారు

ఇక 1989 ఎన్నికల వేళ ఆమెకు నాటి ప్రధాని రాజీవ్ గాంధీ స్వయంగా పిలిచి రాజమండ్రి లోక్ సభ సీటు ఇచ్చారు. అంతకు ముందు 1985లో దుగ్గిరాల అసెంబ్లీ నుంచి పోటీ చేయమని కోరినా జమున తిరస్కరించారు. కానీ రాజీవ్ ఆమెను పోటీ చేయాల్సిందే అని కోరడంతో మాత్రం నో అనలేకపోయారు. అలా 1989లో మంచి మెజారిటీతో కాంగ్రెస్ తరఫున ఆమె పోటీ చేసి గెలిచారు. అయితే రెండేళ్ళు తిరగకుండా 1991లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో మాత్రం ఆమె అదే రాజమండ్రీ నుంచి ఓడారు.

తాను డబ్బు ఖర్చు పెట్టలేకపోవడం వల్ల అలాగే సొంత కాంగ్రెస్ లో వెన్నుపోట్ల వల్ల ఓడాను అని ఆమె చెప్పుకున్నారు. ఇక పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న టైం లో ఆమెను ఏపీ మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా నియమించారు. కానీ అక్కడ రాజకీయాలు తట్టుకోలేక కేవలం పది నెలలకే ఆమె తన పదవిని రాజీనామా చేసి టోటల్ పాలిటిక్స్ కి స్వస్తి అనేశారు.

ఇవన్నీ పక్కన పెడితే ఎన్టీయార్ మీద జమున చేసిన రాజకీయ విమర్శలు అప్పట్లో వేడెక్కించాయి. తెలుగుదేశం నుంచి కౌంటర్ గా రావు గోపాలరావు లాంటి వారు జమున మీద విమర్శలు చేసేవారు. ఎన్టీయార్ తో ఎన్నో చిత్రాలలో కధానాయిక నటించిన జమున ఆయన రాజకీయాల మీద మాత్రం తీవ్ర స్థాయిలోనే విమర్శలు చేసి ఫైర్ బ్రాండ్ అనిపించుకున్నారు. అది హార్డ్ కోర్ టీడీపీ ఫ్యాన్స్ కి మంటగా ఉండేది. మొత్తానికి జమున సినీ జీవితంలో ప్రత్యేకత ఉంది. ఆమె ముప్పయ్యేళ్ల పాటు హీరోయిన్ గా చేసి లాంగ్ కెరీర్ కొనసాగించారు. అలాగే రాజకీయాల్లో కూడా ఏ హీరోయిన్ కి లేని విధంగా అత్యంత కీలక భూమిక పోషించారు అని చెప్పాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.