మోడీ చేతిలో జమిలి అస్త్రం...టార్గెట్ గట్టిదే...?

Sun Mar 19 2023 12:00:01 GMT+0530 (India Standard Time)

Jamili Astram in Modi's hands...the target is tough...?

ఒకేమారు అసెంబ్లీ కి పార్లమెంట్ కి ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ భావిస్తోని. ఈ ఆలోచన 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత బీజేపీ లో అనేక సార్లు వచ్చింది. దాని మీద 2017 నుంచి ఒక మాదిరి ప్రయత్నాలు అయితే సాగాయి. కానీ 2019 నాటికి మళ్ళీ మామూలుగా ఎవరికి వారే అన్నట్లుగా రాష్ట్రాలు కేంద్రంలో ఎన్నికలు జరిగాయి. ఈ మధ్యలో అనేక రాష్ట్రాలకు ఎన్నికలు జరిగాయి.అయితే ప్రస్తుతం 2023 నడుస్తోంది. గట్టిగా చూస్తే మరో ఏడాదిలో అంటే 2024లో సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి. మరి జమిలి ఎన్నికలు అంటే మాటలా అన్నది ఇపుడు అందరి మదినీ దొలుస్తోంది. పార్లమెంట్ లో తాజగా దీని మీద కేంద్ర న్యాయం శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రకటన చేశారు. కేంద్రం జమిలి ఎన్నికల వైపు మొగ్గు చూపుతోంది అని ఆయన స్పష్టం చేశారు.

జమిలి ఎన్నికలకు తాము కట్టుబడి ఉన్నామని కూడా చెప్పుకొచ్చారు. దాని వల్ల సమయం ధనం అన్నీ కూడా కలసి వస్తాయని అన్నారు. ఈ విషయంలో దేశంలోని అన్ని రాజకీయ పార్టీలలో ఏకాభిప్రాయానికి తీసుకురావాల్సి ఉందని చెప్పారు. ఇక పార్లమెంటరీ కమిటీ ఎన్నికల సంఘం సహా వివిధ భాగస్వాములతో సంప్రదించాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

ఇంకో వైపు చూస్తే ఎన్నికల సంస్కరణల కోసం నియమించిన లా కమిషన్ కూడా జమిలి ఎన్నికలనే గట్టిగా సమర్ధించింది. ఈ నేపధ్యం నుంచి చూసినపుడు మోడీ చేతిలో జమిలి అస్త్రం ఉందని అంతా అంటున్నారు. ఇక దేశంలో చాలా రాష్ట్రాలకు ఎన్నికలు ఇప్పటికైతే ముగిసాయి.  అయితే బీజేపీ తలచుకుంటే జమిలి ఎన్నికల పేరుతో పూర్తిగా కాకున్నా చాలా రాష్ట్రాలను కలుపుకుని 2024లో నిర్వహించే సీన్ అయితే ఉంది అంటున్నారు.

కర్నాటక తెలంగాణా ఎన్నికలను 2024 వరకూ వాయిదా వేయవచ్చు. ఏపీ ఎలాగూ 2024లో ఎన్నికల బరిలో ఉంటుంది. 2025లో జరిగే బీహార్ సాహా మరికొన్ని రాష్ట్రాలను ఏడాది పాటు వెనక్కి లాగితే టోటల్ గా దేశంలో జమిలి ఎన్నికలు కాకపోయినా కనీసం పది రాష్ట్రాలలో ఎన్నికలు ఒకేసారి కేంద్రంతో పాటు జరిగే వీలు ఉంటుంది అని అంటున్నారు.

ఇక్కడ బీహార్ తెలంగాణా కర్నాటక వంటి చోట్ల జమిలి ఎన్నికల ప్రభావం గట్టిగా పడి బీజేపీ ఆయా రాష్ట్రలను కూడా గెలుచుకునే వీలు ఉంటుందన్న ప్లాన్ ఉంది. అదే టైం లో కేంద్రంలో మరింత మెజారిటీతో మూడవసారి అధికారంలోకి రావచ్చు అన్నది బీజేపీ మరో ఎత్తుగడగా చెబుతున్నారు. అయితే జమిలి ఎన్నికల ప్రతిపాదనను ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. జమిలి పేరు చెప్పి మతం కార్డుతో నూ ఇతర అంశాలతో బీజేపీ రాష్ట్రాలను గెలుచుకునే ఎత్తుగడ ఇది అని అంటున్నారు. మరి మోడీ చేతిలో ఉన్న జమిలి అస్త్రం 2024లో ప్రయోగిస్తారా ఎపుడు ప్రయోగిస్తారు అన్నది చూడాల్సి ఉంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.