మార్పు మొదలు: బహిరంగ సభలో మారిన జగన్ స్క్రిప్టు

Sun Mar 26 2023 20:00:02 GMT+0530 (India Standard Time)

Jagan's script changed in the public meeting

సభ ఏదైనా.. సమావేశం మరేదైనా సరే.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి వచ్చే మాటలు కామన్ గా ఉంటాయి. తన చేతికి మైకు వచ్చిన ప్రతిసారీ ఆయన తన రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడతారు. ప్రధాన ప్రతిపక్షనేత చంద్రబాబును ఎన్నేసి మాటలు అంటారో.. అదే నోటితో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి వ్యాఖ్యానిస్తారు. ఆ మాటకు వస్తే పవన్ ను పేరు పెట్టి కాకుండా దత్తపుత్రుడంటూ పిలవటం తెలిసిందే.ఇక.. తనకు వ్యతిరేకంగా పని చేసే మీడియ సంస్థల్ని దుష్టచతుష్టంగా అభివర్ణించే ఆయన.. ఆ మాటను పదే పదే మాట్లాడటం కనిపిస్తుంది. అలాంటిది.. తాజాగా వెల్లడైన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు జగన్ మాటపై ప్రభావాన్ని చూపినట్లుగా కనిపిస్తోంది. ఎప్పుడూ లేని రీతిలో జగన్ స్క్రిప్టు మారినట్లుగా రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నారు.

దెందులూరు సభను పరిశలించినప్పుడు ఇదే విషయం స్పష్టమవుతుంది. శనివారం నిర్వహించిన దెందులూరు సభలో  ప్రసంగించిన వేళలో సీఎం జగన్ నోటి నుంచి రోటీన్ గా వచ్చే మాటలేవీ లేకపోవటం.. కొత్తగా మారింది. అందరిలోనూ ఆసక్తికర చర్చకు తెర తీసింది.

సింహం సింగిల్ గా వస్తుందంటూ సింగిల్ పోటీ చేసే దమ్ముందా? వైనాట్ 175 లాంటి మాటలే కాదు.. తోడేళ్ల మంద.. దుష్టచతుష్టం.. దత్తపుత్రుడు ఇలాంటి మాటలేవీ లేకుండా దెందులూరు సభ సాగటం గమనార్హం. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వచ్చిన ఫలితాల ప్రభావం జగన్ ప్రసంగం మీద స్పష్టంగా కనిపించిందన్న మాట బలంగా వినిపిస్తోంది. తనకు అలవాటైన మాటల్ని పూర్తిగా విడిచి పెట్టిన వైనం చూసినప్పుడు రెండు ఎన్నికల ఫలితాలకే జగన్ స్క్రిప్టు ఇంతలా మారిపోవటమా? అన్న విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మొత్తం సభలో ఒకే ఒక్కసారి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేరును ప్రస్తావించటం గమనార్హం. ఇక.. పవన్ ఊసే తీసుకురాలేదు. ఒక్కరిగా పోటీకి వస్తారా? అన్న మాట జగన్ నోటి నుంచి రాలేదు. సాధారణంగా తాను హాజరయ్యే సభల్లో విపక్షాలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం.. రాజకీయ ప్రత్యర్థులపై ఎటకారంగా రియాక్టు అయ్యే జగన్.. అందుకు భిన్నంగా వ్యవహరించటం గమనార్హం.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్ గా పోటీ చేసే దమ్ముందా? లాంటి సవాళ్ల జోలికి వెళ్లకుండా.. తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రస్తావించటం విశేషం. సీఎం జగన్ స్పీచ్ తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.