జగన్ విమానం అత్యవసర ల్యాండింగ్.. విమానాశ్రయం డైరెక్టర్ వివరణ ఇదే!

Tue Jan 31 2023 14:27:21 GMT+0530 (India Standard Time)

Jagan's plane made an emergency landing M Lakshmikanth Reddy explanation!

ఢిల్లీలో గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సు సన్నాహక సమావేశం కోసం ఢిల్లీ వెళ్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తిన విషయం తెలిసిందే. ఏసీ వాల్వ్లో లీకేజి కారణంగా ప్రైజరైజేషన్ సమస్య తలెత్తిందని పైలట్ గుర్తించినట్టుగా ప్రాథమికంగా తెలిసిందని అధికారులు వెల్లడించిన విషయం విదితమే.విమానంలో సాంకేతిక సమస్యను గుర్తించిన పైలట్ తిరిగి గన్నవరం విమానాశ్రయానికి విమానాన్ని మళ్లించారు. ఢిల్లీ పర్యటన కోసం ముఖ్యమంత్రి అధికారుల బృందం జనవరి 29 సాయంత్రం 5:03 గంటలకు టేకాఫ్ అయ్యింది. కాసేపటికే పైలట్ విమానంలో సాంకేతిక సమస్యను గుర్తించడంతో విమానాన్ని వెనక్కి మళ్లించారు. తిరిగి సాయంత్రం 5:27 గంటలకు గన్నవరంలో విమానం ల్యాండ్ అయ్యింది. దీంతో సీఎం తాడేపల్లి నివాసానికి వెళ్లిపోయారు. జనవరి 30న ఉదయం అధికారులతో కలసి సీఎం మరో విమానంలో ఢిల్లీ వెళ్లారు.

కాగా సాంకేతిక కారణాలతోనే సీఎం జగన్ ప్రయాణిస్తున్న విమానం వెనుదిరిగిందని గన్నవరం ఎయిర్పోర్టు డైరెక్టర్ ఎం.లక్ష్మీకాంత్ రెడ్డి తాజాగా వివరణ ఇచ్చారు. ప్రతి విమానం బయల్దేరే సమయంలో పూర్తిగా తనిఖీలు చేస్తామని తెలిపారు.

ఈ తనిఖీలన్నీ పూర్తయ్యాకే విమానం టేకాఫ్ అవుతుందని వెల్లడించారు. చిన్న సాంకేతిక లోపం ఉన్నా ఫ్లైట్ను వెనక్కి తీసుకొచ్చేస్తారని చెప్పారు.

సీఎం జగన్ ప్రయాణిస్తున్న విమానం విషయంలోనూ అదే జరిగిందన్నారు. ప్రయాణీకుల భద్రతే పైలట్ ముఖ్య ఉద్ధేశమని తెలిపారు. సాంకేతిక లోపం అనేది ఏ టైం లోనైనా రావొచ్చు.. ఏ విమానానికైనా రావొచ్చు అని లక్ష్మీ కాంత్ రెడ్డి స్పష్టం చేశారు.

మరోవైపు సీఎం జగన్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం.. అత్యవసరంగా తిరిగి ల్యాండ్ కావడంపై ప్రభుత్వం సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై సీఎంవో అధికారులతోనూ ఎయిర్ పోర్ట్ అధికారులతోనూ సంబంధిత అధికారులు మాట్లాడినట్టు సమాచారం. ఈ ఘటన వెనుక గల కారణాలపై ప్రభుత్వం అంతర్గతంగా విచారణ కూడా చేస్తున్నట్టు చెబుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.