Begin typing your search above and press return to search.

జగడమే : బాబుకు రూట్ క్లియర్ చేస్తున్న జగన్... ?

By:  Tupaki Desk   |   6 Aug 2022 12:30 AM GMT
జగడమే : బాబుకు రూట్ క్లియర్ చేస్తున్న జగన్... ?
X
రాజకీయాల్లో ఎపుడేమి జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. నిన్నటిదాకా పక్కన ఉన్న వారు ఆ తరువాత సైడ్ అవుతారు. అయితే ఇక్కడ జరిగే ప్రతీ దానికీ ఒక లెక్క ఉంటుంది. ఒక అంచనా కూడా ఉంటుంది. విషయానికి వస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో ఇప్పటిదాకా దోస్తీ చేస్తూ వస్తున్న వైసీపీ ఇపుడు కుస్తీ అంటోంది. అయితే ఇది ఏదో లైట్ తీసుకునే వ్యవహారం కానే కాదు అంటున్నారు. నిజంగానే బీజేపీతో యుద్ధానికి వైసీపీ సిద్ధపడేలా ఉంది అని చెబుతున్నారు.

ఈ మధ్య జరిగిన అనేక పరిణామాల నేపధ్యంలో జగన్ కేంద్రం మీద కోపంగా ఉన్నారు. ప్రత్యేకించి బీజేపీ పెద్దల మీద ఆయన మండుతున్నారు అని అంటున్నారు. ఈ నెల ఆరున ఢిల్లీలో ప్రధాని అధ్యక్షతన జరిగే ఒక సమావేశానికి జగన్ తో పాటు చంద్రబాబుని కూడా ఆహ్వానించారు. అది వైసీపీకి మంటగా ఉందని అంటున్నారు. దానికి ముందు ఏపీలో జరిగిన అల్లూరి జయంతి వేడుకలకు కూడా బాబుని పిలిచి పెద్ద పీట వేశారు. ఇక రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి టీడీపీ మద్దతు ఇచ్చింది. అతి తక్కువ మంది ఎంపీలు ఉన్నా కూడా టీడీపీ వారి సమావేశాన్ని రాష్ట్రపతి అభ్యర్ధిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీసుకెళ్ళారు. దీని వెనక కూడా బీజేపీలో ఒక పెద్దాయన సూచన ఉంది అంటున్నారు.

ఇవన్నీ కూడా బీజేపీ టీడీపీ మళ్ళీ దగ్గర అవుతున్న సూచనలే అంటున్నారు. అదే విధంగా టీడీపీ ఎంపీలు పార్లమెంట్ లో ప్రశ్నలు సంధించడం దానికి కేంద్ర మంత్రులు జవాబు అంటూ ఏపీ సర్కార్ పరువు తీసేలా అప్పుల చిట్టాను విడుదల చేయడం, పోలవరం పూర్తి కాకపోవడానికి ఏపీలో రైల్ ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి వైసీపీయే కారణం అని చెబుతూ బదనాం చేయడాన్ని కూడా ఆ పార్టీ పెద్దలు జీర్ణించుకోలేకపోతున్నారు అని అంటున్నారు.

ఇక ఇప్పటిదాకా ఏపీ సర్కార్ కి అప్పుల విషయంలో కేంద్రం ఉదారంగా ఉంటూ వచ్చింది. కానీ ఈ మధ్యనే గట్టిగా బిగిస్తోంది. దాంతో ఏపీ సర్కార్ కి కాళ్ళూ చేతులూ ఆడడంలేదు. ఏపీ మరో శ్రీలంక అవుతుంది అని విపక్షాలు విమర్శలు చేస్తూంటే కేంద్రం దానికి తగినట్లుగా కట్టడి చేస్తోంది అంటున్నారు. ఈ పరిణామాలతో వైసీపీ పెద్దలు షాక్ తింటున్నారు.

ఇక బీజేపీకి మద్దతు ఇచ్చి లాభమేంటి అన్న అంతర్మధనంలో పడిపోయారని అంటున్నారు. ఈ పరిణామల నేపధ్యం చూస్తే బీజేపీకి సరైన టైమ్ లో ఝలక్ ఇచ్చేసి బాహాటంగా పోరాటం చేయడానికి ఏపీ సర్కార్ రెడీ అవుతుంది అని అంటున్నారు. ఇప్పటికే కేంద్రం మీద వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సౌండ్ పెంచారు. కేంద్రం కంటే ఏపీలోనే పాలన బాగుందని సెటైర్లు వేశారు. కేంద్రంలో మోడీ హయాంలో అంతా అప్పుల కుప్ప అని కూడా హాట్ కామెంట్స్ చేశారు.

ఇవన్నీ చూస్తూంటే రానున్న రోజుల్లో బీజేపీతో నేరుగా యుద్ధానికే వైసీపీ తయారుగా ఉంది అనిపిస్తోంది. దాని వల్ల వైసీపీ కొన్ని రాజకీయ లాభాలను కోరుకుంటోంది అని అంటున్నారు. అవేంటి అంటే ఏపీలో పోలవరం కానీ ఇతర అభివృద్ధి పనులు కానీ పూర్తి కాకపోవడానికి కేంద్రం సహాయ నిరాకరణే కారణం అని చెప్పవచ్చు. అలాగే ప్రత్యేక హోదా డిమాండ్ ని మరోమారు అటక మీద నుంచి తీసి ఎన్నికల వేళకు అనువుగా వాడుకోవచ్చు.

ఇక ఏపీకి అన్ని రకాలుగా కేంద్రం అన్యాయమే చేస్తోంది అని చెప్పి జనాలలో బీజేపీని దోషిగా పెట్టవచ్చు. ఆ విధంగా బీజేపీతో పొత్తు పెట్టుకున్నా కూడా టీడీపీ జనసేనల మీద బాగా నెగిటివిటీ వచ్చేలా చూడవచ్చు అది తమకు పాజిటివ్ కావచ్చు అని ఆలోచిస్తోంది అంటున్నారు. మొత్తానికి చూస్తే బీజేపీతో మూడేళ్ల హానీమూన్ పూర్తి అయింది అని అంటున్నారు. బీజేపీకి కూడా వైసీపీ సహాయం ఇపుడు అవసరం లేదనే అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.