ఈనెల 22వ తేదీ నుంచి 26వ తేదీ వరకు దావోస్ లో జరగబోతున్న అంతర్జాతీయ ఆర్ధిక సదస్సులో ఏపీ తరపున 10 అంశాలపైనే ఫోకస్ పెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి పరిశ్రమలు ఐటి శాఖ మంత్రి అమర్నాధ్ తో పాటు ఉన్నతాధికారులు కూడా పాల్గొనబోతున్నారు. ఈ నేపధ్యంలోనే గడపగడపకు కార్యక్రమం అమలు ఉద్దేశ్యాలతో పాటు సచివాలయ వ్యవస్ధ పనితీరును కూడా ప్రభుత్వం హైలైట్ చేయబోతోంది.
ఇదే సమయంలో ఏపీలో విద్యా వైద్యం నైపుణ్య రంగం తయారీ రంగం లాజిస్టిక్స్ ఆర్థిక సేవలు పునరుత్పాదక ఇంధనం టెక్నాలజీ వినియోగదారుల వస్తువుల అంశాలపైనే ప్రధానంగా పెట్టుబడులు పెట్టే అవకాశాలను ప్రభుత్వం వివరించబోతోంది. ప్రతి ఏడాది దావోస్ లో జరిగే ఆర్ధిక సదస్సుకు ప్రపంచంలోని అనేక కంపెనీలు పారిశ్రామిక దిగ్గజాలు పాల్గొంటారు. అలాగే దేశాధినేతలు కూడా ఈ సదస్సులో పార్టిసిపేట్ చేస్తారు.
పారిశ్రామికవేత్తలు కంపెనీల సీఈవోలు దేశాల అధినేతలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పాల్గొంటారు కాబట్టి దేశాలైనా రాష్ట్రాలైనా పెట్టుబడుల ఆకర్షణకు ఈ సదస్సును మంచి వేదికగా చూస్తాయి.
అందుకనే ఇపుడీ అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు జగన్ నేతృత్వంలో దావోస్ కు వెళుతున్న బృందం సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలో ఉన్న సుమారు 970 కిలోమీటర్ల సముద్ర తీరాన్ని ప్రభుత్వం బాగా హైలైట్ చేయాలని కూడా డిసైడ్ చేసింది.
మెరైన్ రంగంలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలున్నాయని ప్రభుత్వం ప్రమోట్ చేయబోతుంది. కరోనా వైరస్ కారణంగా గడచిన రెండేళ్ళు ఈ సదస్సు జరగలేదు. అందుకని ఇపుడు జరగబోయే సదస్సుకు వివిధ దేశాలకు చెందిన 2200 మంది ప్రతినిధులు హాజరు కాబోతున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పలువురు కేంద్ర మంత్రులు పారిశ్రామికవేత్తలు కొందరు ముఖ్యమంత్రులు మంత్రులు కూడా సదస్సులో హాజరు కాబోతున్నారు. ఈ సదస్సులో పెట్టుబడిదారులతో సమావేశాలు నిర్వహించుకునేందుకు ఒప్పందాలు చేసుకునేందుకు దావోస్ నిర్వాహకులు అవసరమైన వేదికలను ఏర్పాటుచేశారు.