ఫస్ట్ టూర్ : ఈసారి అక్కడికి వెళ్ళేది జగన్ ....?

Thu May 12 2022 22:00:01 GMT+0530 (India Standard Time)

Jagan is going on a Davos tour

మూడేళ్ల ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ అంతా కేరాఫ్ తాడేపల్లిగానే గడిపేసారు. ఆయన సీఎం అయిన కొత్తలో ఫ్యామిలీతో కలిసి జెరూసలం వెళ్లారు. కేవలం వారం రోజుల ట్రిప్ అది. ఆ తరువాత ఆయన గుమ్మం కదలేదు. ఆ మాటకు వస్తే గత రెండేళ్ళుగా ప్రపంచమే ఆగింది. కరోనాతో ఎక్కడికక్కడ అంతా ఆగిన పరిస్థితి.



దాంతో విదేశీ టూర్లు అయితే పెద్దగా ఎవరికీ లేవు. ఈ నేపధ్యంలో ఫస్ట్ టైమ్ జగన్ దావోస్ టూర్ కి వెళ్తున్నారు. ఈ నెల 22 నుంచి 26 వరకూ జగన్ విదేశీ టూర్ కన్ ఫర్మ్ అయింది.  వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు లో జగన్ పాలుపంచుకుంటారు.

అలా స్విట్జర్లాండులోని దావోస్ నగరంలో జరిగే  జరగనున్న ఈ సదస్సుకు ఏపీ ప్రభుత్వం తరఫున హాజరు కానున్న ప్రతినిధి బృందానికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా నేతృత్వం వహించనున్నారు.  జగన్ తో పాటు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి పరిశ్రమల శాఖకు చెందిన ఉన్నతాధికారులు దావోస్ వెళ్లనున్నారు.

సరే దావోస్ అంటే ఏపీలో అందరికీ గుర్తుకువచ్చేది మాజీ సీఎం చంద్రబాబు నాయుడే. ఆయన సీఎం గా ఉన్నపుడు ప్రతీ ఏటా తప్పకుండా దావోస్ టూర్ కి వెళ్లేవారు. పెట్టుబడులు పెద్ద ఎత్తున ఏపీకి వస్తున్నాయని నాడు ప్రచారం గట్టిగానే జరిగేది.

ఇక జగన్ ఏలుబడిలో అభివృద్ధి లేదు పెట్టుబడుల ఊసు అంతకంటే లేదు అన్న విమర్శలు పెద్ద ఎత్తున ఉన్నాయి. మూడేళ్ళు చూస్తూండంగానే గడచిపోయాయి. ఈ నేపధ్యంలో సంక్షేమం తో పాటు అభివృద్ధికి పెద్ద పీట వేయాల్సిన అవసరం ఉంది. ఏపీని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తేనే వైసీపీ సర్కార్ కి పేరు వచ్చేది.

మొత్తానికి జగన్ ఇన్నాళ్ళకు రెండవ వైపు చూస్తున్నారు. మరో రెండేళ్లలో ఎన్నికలు ఉండగా ఎంతో కొంత పెట్టుబడి ఏపీకి వచ్చి కొన్ని ప్రాజెక్టులు కనుక జగన్ హయాంలో ప్రారంభం ఐతే ఆ పేరు చెప్పుకుని ఎన్నికల గోదాలోకి దిగిపోవచ్చు. మరి జగన్ వ్యక్తిగతంగా మంచి పారిశ్రామికవేత్త.

ఆయన తన టాలెంట్ ని ఇపుడు ఫుల్ గా వాడాల్సిన సమయం. ఇక ఈ సదస్సులో భాగంగా పలు బహుళ జాతి సంస్థలతో భేటీ కానున్న జగన్ వారితో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విషయంపై చర్చించనున్నారు అని చెబుతున్నారు. మొత్తానికి బాబు దావోస్ అన్న మాటలను అంతా కలిపి చదువుకునే వారు. ఫస్ట్ టైమ్ జగన్ దావోస్ అని చదవాల్సి ఉంటుంది. మరి ఈ టూర్ హిట్ అవుతుందా. ఏపీకి జగన్ కి వైసీపీకి మేలు చేస్తుందా. వెయిట్ అండ్ సీ.