Begin typing your search above and press return to search.

పదవులు ఇవ్వటంలో కేసీఆర్ ఫార్ములాను పాటించని జగన్

By:  Tupaki Desk   |   19 Oct 2020 6:00 AM GMT
పదవులు ఇవ్వటంలో కేసీఆర్ ఫార్ములాను పాటించని జగన్
X
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు అనూహ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మీద కొత్త ఒత్తిడిని పెంచేస్తున్నాయి. వాస్తవానికి కేసీఆర్ మీద ప్రభావం పడాలనో.. ఇంకేదో అన్నది లేకుండా తన తీరుకు అనుగుణంగా సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు.. అటు తిరిగి ఇటు తిరిగి కేసీఆర్ ను ప్రశ్నించేలా... ఆయన తీరును తప్పు పట్టేలా మారటం గమనార్హం.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి ఏపీ సీఎం చాలా వేగంగా కొన్ని నిర్ణయాల్ని తీసుకుంటున్నారు. సుదీర్ఘకాలం విపక్షానికి పరిమితమైన ఆయన.. తన చేతికి పవర్ రాగానే.. దాన్ని విధేయులుగా ఉన్న వారికి పంచేస్తున్నారు. అధికారంలో లేనప్పుడు హామీలు ఇవ్వటం.. మీ సంగతి చూద్దాం.. పార్టీ కోసం కష్టపడండి అంటూ ఉత్సాహపరిచి పంపటం మామూలే. తీరా పవర్ లోకి వచ్చాక.. తామిచ్చిన తాయిలాల్ని మర్చిపోవటం చాలామంది అధినేతలు చేసే పనే.

ఎందుకిలా అంటే.. పదవుల పందేరం షురూ చేయగానే.. వచ్చిన వారు సంతోషపడితే.. రాని వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం.. అధినేత మీద గుర్రును ప్రదర్శించటం లాంటి తలనొప్పులు తలెత్తుతాయన్న సందేహంతో.. ఆచితూచి అన్నట్లుగా నిర్ణయం తీసుకుంటారు. దీంతో..పదవీ కాలం పూర్తి అయ్యే నాటికి.. తామిచ్చిన హామీలు గుర్తుకు వచ్చి.. ఈసారి తప్పకుండా అంటూ మాట దాటేస్తుంటారు. ఈ తీరుకు భిన్నంగా... అధికారంలో ఉన్నప్పుడు ఎవరికేం చేయాలో వాటినివేగంగా పూర్తి చేసే కొత్త తరహా ఫార్ములాను జగన్ పాటిస్తున్నారు.

తాజాగా బీసీల అభివృద్ధి కోసం 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేయటమే కాకుండా.. వాటికి పాలక మండళ్లను నియమించటం ద్వారా భారీ ఎత్తున పదవుల్ని పంపిణీ చేసింది. 56 కులాలకు ఛైర్మన్లను ఏర్పాటు చేయటం.. వాటికి పాలక మండళ్లు అంటే.. వందల్లో పదవుల పంపంకం జరిగినట్లే. అదే సమయంలో.. ఆయా వర్గాలకు చెందిన పలువురిని నేతలుగా.. పార్టీకి విధేయులుగా మార్చేయటం పార్టీకి ప్రయోజనకరంగా మారుతుంది. ఇలా.. అవకాశం ఉన్న పదవుల్ని వెంటనే ఇచ్చేసే ఫార్ములా.. పదవుల్ని తన వద్దే ఉంచుకొని.. ఎంతకూ ఇవ్వని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మీద కొత్త ఒత్తిడిని తీసుకొస్తోంది.

‘‘అరే.. పదవిలోకి వచ్చి ఏడాదిన్నర కాలేదు. అప్పుడే ఎంతమందికి ఎన్ని పదవులు ఇచ్చారో చూడండి. మా ముఖ్యమంత్రి అందుకు భిన్నం. ఇప్పటికి బోలెడన్ని కార్పొరేషన్లకు ఛైర్మన్లు లేరు. ఇవ్వాలనుకుంటే మస్తు పదవులు ఇవ్వొచ్చు. కానీ.. ఇవ్వరు. మొదటి టర్మ్ మాటలతోనే కానిచ్చేశారు.రెండో టర్మ్ రెండేళ్లు కావొస్తోంది. ఇలా అయితే.. మేమేం కావాలి. పదవులు.. అధికారం కొందరి చేతుల్లోనే ఉండటం కోసమే తెలంగాణ కోసం పోరాడామా?’’ అంటూ గులాబీ పార్టీకి చెందిన కొందరు నేతలు లోగుట్టుగా వ్యాఖ్యలు చేయటం గమనార్హం. ఏపీ సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు.. పార్టీ నేతల్లో కొత్త చర్చకు తావిచ్చిన వైనాన్ని సీఎం కేసీఆర్ గుర్తించారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఇదే తీరు కొనసాగితే.. పార్టీ నేతల్లో నిరాశ మరింతపెరుగుతుందని.. అది పార్టీకే ప్రమాదమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.