Begin typing your search above and press return to search.

జగనన్న విద్యాదీవెన ... 11 లక్షల మందికి లబ్ధి .. రూ.693 కోట్లు విడుదల

By:  Tupaki Desk   |   29 July 2021 9:04 AM GMT
జగనన్న విద్యాదీవెన ... 11 లక్షల మందికి లబ్ధి .. రూ.693 కోట్లు విడుదల
X
ఓ కరోనా వైరస్ మహమ్మారి రాష్ట్రంలో కలకలం సృష్టిస్తున్నా , మరోవైపు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మాత్రం సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే ఉన్నారు. విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇవ్వడమే లక్ష్యంగా పథకాలను కొనసాగిస్తున్నారు. ఈ ఏడాదికి గాను జగనన్న విద్యా దీవెన రెండో విడత సొమ్మును ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గురువారం విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. దాదాపు 10.97 లక్షల మంది విద్యార్థులకు రూ.693.81 కోట్లను విడుదల చేశారు. నిరుపేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో దేశంలో ఎక్కడా లేని విధంగా అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి సకాలంలో, బకాయిలు లేకుండా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తున్నారు. ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికమే ఆ పిల్లల తల్లులకే చెల్లించి, వారే కాలేజీలకు ఫీజులు కట్టేలా చేసి పేదలకి అండగా నిలుస్తున్నారు.

జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్నితల్లుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం విద్యా రంగానికి పెద్ద పీట వేస్తూ ఇప్పటి వరకు 26,677.82 కోట్ల రూపాయలు వెచ్చించింది. దీంతో ఇప్పటి వరకు 1,62,75,373 మందికి లబ్ధి కలిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వెంటనే డబ్బులు ఎకౌంట్లలోకి వస్తాయని అందరూ భావిస్తున్నారు. అయితే , ఎకౌంట్లో డబ్బులు క్రెడిట్ అవడానికి కొంత సమయం పడుతుందని ప్రభుత్వం చెబుతోంది. సీఎం జగన్ ప్రారంభించిన వెంటనే కొంతమంది ఎకౌంట్లలో నగదు జమవుతాయి. కొంతదికి మాత్రం కాస్త ఆలస్యంగానైనా డబ్బులు వస్తాయి.. ఎవరూ నిరూత్సాహ పడాల్సిన అవసరం లేదంటున్నారు అధికారులు.మొత్తం లబ్ధిదారుల ఎకౌంట్లో డబ్బులు జమకావడానికి రెండువారాలు పట్టే అవకాశముంది. అందువల్ల విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అదికారులు చెప్తున్నారు.

డబ్బులు క్రెడిట్ అయ్యాయో లేదా తెలుసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. విద్యార్థులు జ్ఞానభూమి అనే వెబ్ సైట్ ఓపెన్ చేసి. స్టూడెంట్ ఆధార్, పాస్‌ వర్డ్ సాయంతో లాగిన్ అవ్వాలి. అందులో వ్యూ/ప్రింట్ స్కాలర్‌ షిప్ అప్లికేషన్ స్టేటస్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. అందులో ఏ విద్యాసంవత్సరానికి సంబంధించిన స్టేటస్ తెలుసుకోవాలనుకుంటున్నారో అనేది ఎంచుకోవాలి. అందులో మీ స్టేటస్ ఎలిజిబుల్ అని ఓటీఏ కంప్లీటెడ్ అని చూపిసతే మీకు ఇంకా డబ్బులు రాలేదని అర్ధం. ఒకవేళ రిలీజ్డ్ అని చూపిస్తే మీకు నగదు వచ్చినట్లు అర్ధం. ఐటీఐ విద్యార్థులకు రూ.10వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్‌ చదువుతున్న వారికి రూ.20వేల రూపాయలు ప్రభుత్వం అందిస్తుంది.

విద్యా దీవెన రెండో విడత సొమ్ము విడుదల కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ..పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువే.. ప్రతి అడుగులోను విద్యార్థుల భవిష్యత్తు గురించే ఆలోచిస్తున్నాం. ప్రతీ ఒక్కరూ బాగా చదువుకోవాలనేది నా తాపత్రాయం. ఇందులో భాగంగానే జగనన్న విద్యా దీవెన అనే మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. తల్లిదండ్రులకు భారం లేకుండా విద్యాదీవెన అమలు చేస్తున్నాం. దేవుడి ఆశీస్సులతోనే ఇదంతా చేయగల్గుతున్నాం. ప్రతి పేద విద్యార్థికి చదువు అందుబాటులోకి రావాలన్నదే మా ప్రభుత్వం లక్ష్యం. అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యార్థుల భవిష్యత్తు కోసం 100 శాతం ఫీజు రియింబర్స్‌ మెంట్‌ ఇస్తున్నాం అన్నారు.

2011 జనాభా లెక్కల ప్రకారం మన దగ్గర 33శాతం నిరక్షరాస్యత ఉంది. బ్రిక్స్ దేశాలతో పోలిస్తే మన దేశంలో ఇంటర్ తర్వాత డ్రాప్‌ అవుట్స్‌ సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ పరిస్థితిని మార్చడం కోసం అనేక పథకాలను ప్రవేశ పెట్టాం. తల్లిదండ్రులకు భారం లేకుండా వసతి దీవెన అందిస్తున్నాం. ప్రతి మూడు నెలలకోసారి తల్లుల ఖాతాల్లోనే డబ్బు జమ చేస్తున్నాం. తల్లులే నేరుగా ఫీజులు చెల్లించేలా చర్యలు తీసుకున్నాం. విద్యా దీవెనతో ఇప్పటివరకు రూ.5,573 కోట్లు అందించాం. అమ్మఒడి, విద్యాకానుక, మనబడి నాడు-నేడు కింద..మొత్తం రూ.26,677 కోట్లు ఖర్చు చేశాం అని సీఎం జగన్ తెలిపారు.